బరితెగిస్తున్నారు!
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:42 AM
తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దపండుగైన సంక్రాంతికి అంతే భారీగా కోడిపందేల నిర్వహణ కోసం బరులు సిద్ధం చేస్తున్నారు. తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఒడిసా తదితర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పందేలలో పాల్గొనే అతిపెద్ద బరిగా పేరుగాంచిన అంపాపురంలో నిర్వాహకులు ఈసారి ఎక్కడా తగ్గకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

హనుమాన్‌జంక్షన్‌రూరల్, జనవరి 11 : తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దపండుగైన సంక్రాంతికి అంతే భారీగా కోడిపందేల నిర్వహణ కోసం బరులు సిద్ధం చేస్తున్నారు. తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఒడిసా తదితర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పందేలలో పాల్గొనే అతిపెద్ద బరిగా పేరుగాంచిన అంపాపురంలో నిర్వాహకులు ఈసారి ఎక్కడా తగ్గకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీఏటా మూడు రోజుల పాటు జరిగే కోడిపందేలు ఈసారి మరింత ఎక్కువగా జరిగే విధంగా సాంకేతికతో కూడిన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కోతముక్క, అందర్ బాహర్, తీన్‌పత్తీ లాంటి వాటి కోసం భారీ యంత్రాల సాయంతో ప్రత్యేకంగా గదులు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. పండుగ ఇంకామూడు రోజులేఉండటంతో ఇప్పటికే 50 ఎకరాలకు పైగా భూమిని చదును చేసి బరుల ఏర్పాటు ముమ్మరం చేస్తున్నారు. 20 ఎకరాల్లో బరులు, మిగిలిన భూమిని కార్లు, ద్విచక్ర వాహనాల పార్కింగ్ ఉండేలా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మరో పక్క కె.సీతారాంపురంలో మరో పెద్ద బరి వైసీపీ రాష్ట్ర స్థాయి నేత అండదండలతో భారీగా తయారవుతోంది. ఆదాయం కోట్లలో ఉండటంతో మరికొంతమంది నాయకులు గ్రామాల్లో బరులను కూడా ప్రోత్సహిస్తున్నారు. బాపులపాడు మండలంలోనే ఈసారి కోట్లలో పందేలు జరుగుతాయని పందెపురాయుళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.
ఫ సాంకేతికత సొబగులు
అంతర్జాతీయ స్థాయిలో చేయితిరిగిన చీకోటి ప్రవీణ్ సూచనలతో అంపాపురం బరికి సాంకేతిక సొబగులు అద్దుతున్నారు. అన్‌లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహణకు, వీడియోల ద్వారా కోడిపందేలు తిలకిస్తూ పందెం కాసేందుకు కావలసిన ఏర్పాటు, నెట్‌వర్క్‌లతో ఇబ్బంది లేకుండా వైఫై సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు. 24 గంటలూ అన్ని రకాల జూదాల నిర్వహ ణకు భారీ ఫ్లడ్ లైట్లు, పెద్ద పెద్ద టెంట్లతో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ప్రధాన బరిలో జరిగే లక్షల్లో పందేలను చూసేందుకు ప్రేక్షకులకు, పందెపురాయుళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భారీతెరలు, కూర్చునేందుకు సోఫాలు, ఏసీలు వంటి సకలసౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. పేకాట కోసమైతే ప్రత్యేక శిబిరం, పాల్గొన్న వారికి కూర్చున్నచోటే సకల సౌకర్యాలు(మందు, విందు) అందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఫ కట్టుదిట్టమైన ఏర్పాట్లు
గత ఏడాది పోలీసుల దాడిని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు. ఈసారి బరులు మొత్తం సీసీ కెమెరాలతో పాటు బౌన్సర్లను కూడా భారీగా సిద్ధం చేస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పందెపురాయుళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, ఇతర రాష్ట్రాలతో పాటు విదేశీ మద్యం కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసినట్టు నిర్వహకుల్లో ఒకరు తెలిపారు. అనుమతితో తప్ప అన్యులెవరూ రాకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లతో పాటు ఆవరణ మొత్తం తమ కనుసన్నల్లో ఉండేలా సీసీ కెమెరాలు, వాకీటాకీలతో కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో కోడిపందేల నిర్వహణకు ఎటువంటి ఆటంకాలు రావనే ధీమాతో భారీస్థాయి నిర్వహణకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈసారి బాపులపాడు మండలంలోని రెండు ప్రధాన బరులతో పాటు, గ్రామల్లో నిర్వహించే చిన్నపాటి బరుల్లో కోట్లాదిరూపాయల జూదం జరుగుతుందని పందెపురాయుళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.