Share News

పటిష్టంగా ఉచిత ఇసుక విధానం

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:41 AM

రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈనెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జి.సృజన ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సృజన అధ్యక్షతన జిల్లాస్థాయి ఇసుక కమిటీ (డీఎల్‌ఎ్‌ససీ) సమావేశం జరిగింది.

పటిష్టంగా ఉచిత ఇసుక విధానం

తవ్వకం, రవాణా, లోడింగ్‌, సీనరేజ్‌ ఫీజు నామమాత్రపు వసూలు

రీచ్‌ ప్రాంత రహదారులు, ర్యాంపుల అభివృద్ధికి వినియోగం

డీఎల్‌ఎ్‌ససీ సమావేశంలో ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ సృజన

  • వివిధ స్టాక్‌ పాయింట్లలో అందుబాటులో వున్న ఇసుక (క్యూబిక్‌ మీటర్లు)

  • పెండ్యాల (కంచికచర్ల మండలం) 19,781

  • మాగల్లు (నందిగామ మండలం) 36,366

  • కొడవటికల్లు (చందర్లపాడు మండలం) 9,713

  • అల్లూరుపాడు (వత్సవాయి మండలం) 3,040

  • అనుమంచిపల్లి (జగ్గయ్యపేట మండలం) 56,820

  • పోలంపల్లి (వత్సవాయి మండలం) 922

  • కీసర (కంచికచర్ల మండలం) 1,49,703

  • మొగులూరు (కంచికచర్ల మండలం) 93,243

కృష్ణలంక, జూలై 4 : రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈనెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జి.సృజన ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సృజన అధ్యక్షతన జిల్లాస్థాయి ఇసుక కమిటీ (డీఎల్‌ఎ్‌ససీ) సమావేశం జరిగింది. జిల్లాలోని వివిధ ఇసుక స్టాక్‌ పాయింట్లలో నిల్వలు, ఉచిత విధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో రాష్ట్రప్రభుత్వం ఈనెల 8వ తేదీ సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినందున, ఈ మేరకు జిల్లాస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించి, ఆదేశాలివ్వడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 12 ఇసుక నిల్వ కేంద్రాలకు సంబంధించి ఎనిమిది కేంద్రాల్లో 3,69,588 క్యూబిక్‌ మీటర్ల మేర ఇసుక అందుబాటులో వుందని తెలిపారు. ఇసుక తవ్వకం, లోడింగ్‌, రవాణా ఖర్చు, సీనరేజ్‌ ఫీజు మాత్రమే నామమాత్రంగా వినియోగదారుల నుంచి వసూలు చేయడం జరుగుతుందని, ఈ మొత్తంలో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు వెళ్లదని, నేరుగా జిల్లా, మండల పరిషత్‌లు, పంచాయతీలకు వెళుతుందన్నారు. ఈ మొత్తాన్ని రీచ్‌ ప్రాంత రహదారులు, ర్యాంపులు తదితరాల అభివృద్ధికి వినియోగించడం జరుగుతుందన్నారు. ఇసుక నిల్వ కేంద్రాల వద్ద నామమాత్రపు రుసుం వివరాలను ప్రదర్శించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తెచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని మైన్‌ అండ్‌ జియాలజీ, రెవెన్యూ, రవాణా, పోలీస్‌ తదితర శాఖల అధికారులు పటిష్ట అమలుకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా ఇసుక కొరతలేకుండా చూసేందుకు పూడిక రూపంలో వున్న ఇసుక పాయింట్లను కూడా గుర్తించాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో మైన్స్‌ అండ్‌ జియాలజీ డిప్యూటీ డైరక్టర్‌ జి.వెంకటేశ్వర్లు, గ్రామీణ నీటి సరఫరా ఎస్‌ఈ డీవీ రమణ, డీపీవో ఎన్‌వీ శివప్రసాద్‌ యాదవ్‌, గ్రౌండ్‌ వాటర్‌ డీడీ బి.నాగరాజు, డీటీసీ ఎం.పురేంద్ర, పీసీబీ ఈఈ పి.శ్రీనివాసరావు, వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:41 AM