Share News

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌కు దారేదీ..?

ABN , Publish Date - May 17 , 2024 | 12:18 AM

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌కు బాలారిష్టాలు తీరట్లేదు. ఇది దాదాపు పూర్తయినా అందుబాటులోకి రాలేని పరిస్థితి ఏర్పడింది. హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్ల సమస్య కారణంగా ఇంకా పలుచోట్ల పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఈ కారణ ంగా చిన్న అవుటపల్లి-గొల్లపూడి వరకు విజయవాడ బైపాస్‌ వినియోగంలోకి రాని పరిస్థితి ఏర్పడింది.

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌కు దారేదీ..?
అంబాపురం వద్ద ఆగిపోయిన ఆర్వోబీ

పరిష్కారం కాని హైటెన్షన్‌ తీగలు

పూర్తికాని నాలుగు ఆర్‌వోబీలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కాజా-విజయవాడ-గుండుగొలను రోడ్డు ప్రాజెక్టులో అంతర్భాగంగా ప్యాకేజీ-3లో నిర్మిస్తున్న విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ అందుబాటులోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఈ రోడ్డు ప్రాజెక్టు గత డిసెంబరులోనే వినియోగంలోకి రావాల్సి ఉంది. గడువు దాటి ఐదు నెలలు కావస్తున్నా అందుబాటులోకి రాలేదు.

కారణాలివీ..

ఇందుకు ప్రధాన కారణం హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్ల సమస్య. బైపాస్‌ మార్గంలో ఇంకా ఐదారుచోట్ల హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్ల సమస్య వెన్నాడుతోంది. సూర ంపల్లి, జక్కంపూడి, గొల్లపూడి గ్రామాల్లో ఈ సమస్యలు ఉన్నాయి. హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్లు బైపాస్‌ రోడ్డుకు అత్యంత దిగువన ఉండటం వల్ల పలుచోట్ల ఆర్‌వోబీలు సగంలోనే ఆపేయాల్సి వచ్చింది. ఈ హైటెన్షన్‌ తీగలను మార్చడం ద్వారా కానీ, ఎత్తు పెంచటం ద్వారా కానీ మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది. హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్లను ఎత్తు పెంచాల్సి రావటం వల్ల క్రాస్‌ అవుతున్న లైన్లను ఒకదానికొకటి అనుసంధానం కాకుండా దిశను మార్చాలి. దీంతో వేరే రైతుల పొలాల్లో టవర్లు వేయాలి. దీనిపై రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. హైటెన్షన్‌ టవర్లను తమ పొలాల్లో నిర్మించటానికి అంగీకరించలేదు. పదేపదే చర్చల తర్వాత రైతులు అంగీకరించినా చివరికి పరిహారంపై మళ్లీ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇదే అంశంపై పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా రైతులతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా జిల్లా యంత్రాంగానికి సూచించింది. ఆ తర్వాత రైతులతో పలుమార్లు చర్చించినా రైతులు తమకు ఆమోదయోగ్యమైన పరిహారం కాదని భావించటంతో సమస్య పరిష్కారం కాలేదు. ఈలోపు ఎన్నికల వాతావరణం నెలకొనటంతో ఆరు నెలలుగా పరిస్థితి అలాగే ఉండిపోయింది.

95 శాతం పూర్తి

విజయవాడ బైపాస్‌ పనులు 95 శాతం పూర్తయ్యాయి. హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్ల కారణంగా నాలుగుచోట్ల ఆర్‌వోబీల పనులు సగం వరకే నిర్మించి వదిలేశారు. చిన్న అవుటపల్లి దగ్గర ఎన్‌హెచ్‌-16కు అనుసంధానంగా పిన్నమనేని సిద్ధార్థ మెడికల్‌ కాలేజీకి అభిముఖంగా ఇది ప్రారంభమైంది. ప్రారంభంలో కనెక్టివిటీ ఇంకా సంపూర్ణంగా జరగలేదు. చిన్న అవుటపల్లి నుంచి మర్లపాలెం వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. మర్లపాలెం దగ్గర ఫ్లై ఓవర్‌ నిర్మాణం, మర్లపాలెం నుంచి గన్నవరం వరకు రోడ్డు పోర్షన్‌ పూర్తయింది. గన్నవరం-బీబీ గూడెం మధ్య ఆర్‌వోబీ కూడా పూర్తయింది. ఈ ఆర్‌వోబీకి అనుసంధానంగా కొండపావులూరు వరకు రోడ్డు నిర్మించారు. కొండపావులూరులో రెండు ఆర్‌వోబీ నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ రెంటికీ అనుసంధానంంగా సూరంపల్లి వరకు రోడ్డు నిర్మాణం పూర్తయింది. సూరంపల్లి వెలుపల టోల్‌గేట్‌ నిర్మాణం కూడా పూర్తయింది. సూరంపల్లి దాటాక నున్న మార్గంలో రెండుచోట్ల హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్ల సమస్య కారణంగా ఆర్‌వోబీలు అసంపూర్తిగా ఉన్నాయి. నున్న నుంచి జక్కంపూడికి వెళ్లే మార్గంలో కూడా హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్ల కారణంగా రెండుచోట్ల ఆర్‌వోబీలు సగమే పూర్తయ్యాయి. జక్కంపూడి నుంచి గొల్లపూడి వరకు ఆరు వరసల రోడ్డు పనులు పూర్తయ్యాయి. గొల్లపూడి ఫ్లై ఓవర్‌ నిర్మాణం కూడా పూర్తయింది. గొల్లపూడి ఫ్లై ఓవర్‌ నుంచి ఎన్‌హెచ్‌-65పై నిర్మిస్తున్న ఆర్‌వోబీకి అనుసంధానమయ్యే చోట హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్ల కారణంగా పనులు స్వల్పంగా మిగిలి ఉన్నాయి.

Updated Date - May 17 , 2024 | 12:18 AM