Share News

సిగ్నల్స్‌ కామధేనువు

ABN , Publish Date - Jun 17 , 2024 | 01:48 AM

గన్నవరం మండలం కేసరపల్లి వద్ద జరిగిన సీఎం ప్రమాణస్వీకార సభాప్రాంగణం వద్ద కొంతమంది సెల్‌ఫోన్లు మాత్రమే పనిచేశాయి. సీఎంకు జడ్‌ప్లస్‌ కేటగిరీ ఉండడంతో జామర్లు ఆన్‌చేయడంతో సెల్‌ఫోన్లకు సిగ్నల్స్‌ రావడం లేదని కొంతమంది భావించారు. కొంతమంది సెల్‌ఫోన్లు మాత్రం మోగాయి. దీనికి ప్రధాన కారణం బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకొచ్చిన ‘కౌ’.

సిగ్నల్స్‌ కామధేనువు

బీఎస్‌ఎన్‌ఎల్‌ వద్ద ‘కౌ’

సిగ్నల్స్‌ పునరుద్ధరణకు మొబైల్‌ టవర్లు

రద్దీ ఉన్న ప్రదేశాల్లో ఏర్పాటు

గన్నవరం మండలం కేసరపల్లి వద్ద జరిగిన సీఎం ప్రమాణస్వీకార సభాప్రాంగణం వద్ద కొంతమంది సెల్‌ఫోన్లు మాత్రమే పనిచేశాయి. సీఎంకు జడ్‌ప్లస్‌ కేటగిరీ ఉండడంతో జామర్లు ఆన్‌చేయడంతో సెల్‌ఫోన్లకు సిగ్నల్స్‌ రావడం లేదని కొంతమంది భావించారు. కొంతమంది సెల్‌ఫోన్లు మాత్రం మోగాయి. దీనికి ప్రధాన కారణం బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకొచ్చిన ‘కౌ’.

(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : మొబైల్‌ రంగంలో తన ప్రత్యేకతను చూపించుకోవ డానికి కొత్త ఆవిష్కరణలకు బీఎస్‌ఎన్‌ఎల్‌ శ్రీకారం చుట్టింది. ప్రముఖుల సభలు జరిగినప్పుడు, జనం రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ కౌను ప్రయోగిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న కూటమి సభల్లో కౌ లక్షలాదికి మందికి సిగ్నల్స్‌ను అందజేసింది. దీనితో మొబైల్‌ రంగంలో అసలు ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ రూపొందించిన కౌ ఏమిటన్న దానిపై చర్చ జరుగుతోంది.

అసలు కౌ అంటే...

సెల్‌ఫోన్లకు సిగ్నల్స్‌ను ప్రసారం చేయడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ రూపొందించిన కొత్త టెక్నాలజీ పేరు కౌ. సెల్‌ ఆన్‌ వీల్స్‌ పేరుతో మినీ టవర్లను రూపొందిం చింది. దీన్ని సంక్షిప్తంగా కౌ అని వ్యవహరిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పా లంటే ఇదొక మొబైల్‌ టవర్‌. సెల్‌ఫోన్‌ నుంచి కాల్‌ మరొకరికి వెళ్లాలన్నా, ఇతరుల నుంచి మనకు రావాలన్నా అందుకు అవసరమైన సిగ్నల్స్‌ టవర్‌ నుంచి విడుదలవుతాయి. ఈ సిగ్నల్స్‌ కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌తోపాటు అన్ని సర్వీసు ప్రొవైడర్లు పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో పలు ప్రాంతాల్లో టవర్లను ఏర్పాటు చేశాయి. ఈ టవర్లు స్థిరంగా ఉండిపోతాయి. నగర నడిబొడ్డున ఉన్నా సిగ్నల్స్‌ సరిగా ఉండడం లేదని అనేక మంది సెల్‌ఫోన్‌ వినియోగదారులు నిత్యం గగ్గోలు పెడుతున్నారు. సిగ్నల్స్‌ విషయంలో అన్ని సర్వీసు ప్రొవైడర్ల పరిస్థితి ఒకేలా ఉందని విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అప్పటి వరకు ఫోన్‌ మాట్లాడుతున్నా కాసేపటికి కాల్‌ కట్‌ అయిపోతుంది. కొన్నిసార్లు నంబర్‌ను డయల్‌ చేసినప్పుడు ఫోన్‌ స్ర్కీన్‌పై కాలింగ్‌ అని చూపిస్తుంది. ఎంతసేపు అయినా కాల్‌ మాత్రం కనెక్ట్‌ అవ్వదు. దీనికి ప్రధాన సమస్య సిగ్నల్స్‌ లేకపోవడమేనని సెల్‌ యూజర్లకు తెలిసిన విషయమే

సిగ్నల్స్‌ జాం

నగరంలో రహదారులపై ట్రాఫిక్‌ స్తంభించిపోయినట్టే సెల్‌టవర్ల నుంచి వెలువడే సిగ్నల్స్‌ స్తంభించిపోతారు. దీనికి ప్రధాన కారణం ఎక్కువ మంది ఒకేచోట ఉండడమేనని బీఎస్‌ఎన్‌ఎల్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమస్యలు ఎక్కువగా జాతరలు జరిగినప్పుడు, బహిరంగ సభలు నిర్వహించినప్పుడు, ట్రాఫిక్‌లో వాహనాలను ఎక్కువ సమయం ఆగినప్పుడు వస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఒక్కో సెల్‌టవర్‌ సామర్థ్యం (బ్యాండ్‌ విడ్త్‌) 100 ఎంబీ ఉంటుంది. ఈ సామర్థ్యం ఉన్న టవర్‌ 10వేల సెల్‌ఫోన్లకు సిగ్నల్స్‌ను ప్రసారం చేస్తుంది. దీనికి మించిన సెల్‌ఫోన్లు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు సిగ్నల్స్‌ జామ్‌ అవుతాయి. దీనితో కొంతమందికి సిగ్నల్స్‌ అందవు. మరికొంతమంది సిగ్నల్స్‌ అందినా కాల్‌బ్రేక్‌లు అవుతాయి. ప్రముఖుల సభల్లో ఎక్కువగా ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతుండడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ కౌను తీసుకొచ్చింది. ఇదొక మొబైల్‌ టవర్‌. ఇది జనరేటర్‌ మాదిరిగా ఉంటుంది. ఈ వాహనంపై విద్యుత్‌ సరఫరా చేసే క్యాబిన్‌ ఉంటుంది. టవర్‌ యాంటీనా విడిభాగాలుగా ఉంటుంది. అవసరమైనచోటకు ఈ వాహనాన్ని తీసుకెళ్లి యాంటీనాను బిగిస్తారు. ఈ యాంటీనా ఎత్తు ఆరు నుంచి ఏడు అడుగుల వరకు ఉంటుంది. ఇటువంటి కౌలు బీఎస్‌ఎన్‌ఎల్‌ వద్ద తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నంలో ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో రాయలసీమలో కూటమి నిర్వహించిన సభల్లో ప్రధాని మోదీ పాల్గొన్నప్పుడు ఈ కౌ సేవలను వినియోగించారు. ఇటీవల జరిగిన చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తిరుపతిలో ఉన్న కౌను కేసరపల్లికి తీసుకొచ్చారు.

Updated Date - Jun 17 , 2024 | 01:48 AM