Share News

అవే తప్పులు

ABN , Publish Date - Jan 28 , 2024 | 01:06 AM

బోగస్‌ ఓట్ల వ్యవహారంతో నందిగామ నియోజకవర్గంలోని వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామం ఇప్పటికే వార్తల్లో నిలిచింది. అక్రమంగా ఇంటర్‌ స్టేట్‌ బోగస్‌ ఓట్లు పుట్టుకొచ్చాయన్న ఉద్దేశంతో ఈ గ్రామంలో అలజడి రేగిన సంగతి తెలిసిందే.

అవే తప్పులు

ఓటర్ల తుది జాబితాలో బయటపడుతున్న తప్పులు

డబ్లింగ్స్‌.. తొలగింపులు.. బోగస్‌ ఓటర్లు

ఒక్క పెద్దాపురంలోనే భారీగా..

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): బోగస్‌ ఓట్ల వ్యవహారంతో నందిగామ నియోజకవర్గంలోని వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామం ఇప్పటికే వార్తల్లో నిలిచింది. అక్రమంగా ఇంటర్‌ స్టేట్‌ బోగస్‌ ఓట్లు పుట్టుకొచ్చాయన్న ఉద్దేశంతో ఈ గ్రామంలో అలజడి రేగిన సంగతి తెలిసిందే. తుది జాబితా తర్వాత కూడా మళ్లీ అలాంటి తప్పులే కనిపిస్తుండటంతో ఆందోళన పెల్లుబికుతోంది. పెద్దాపురం గ్రామంలో ఈసారి డబ్లింగ్‌ ఓట్లు కలకలం సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించి ‘ఆంధ్రజ్యోతి’కి ఆధారాలు చిక్కాయి.

డబ్లింగ్‌ ఓట్లు ఇవీ..

కీలం వీరభద్రరావుకు రెండు ఓట్లు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. మొదటి ఓటు 800 సీరియల్‌ నెంబర్‌లో జేఎస్‌జీ2823284 నెంబర్‌తో ఉండగా, రెండోది 151 సీరియల్‌ నెంబర్‌లో టీఏఈ063393 ఉంది. ఇదే గ్రామంలో 1102 సీరియల్‌ నెంబర్‌లో దీపర్‌ కొరకొప్పుల (ఓటరు కార్డు నెంబర్‌ టీఏఈ1780212) ఉండగా, సీరియల్‌ నెంబర్‌ 589లోనూ ఓటరు కార్డు నెంబర్‌ టీఏఈ1776889తో ఉంది. కమల్‌ సాహెబ్‌ షేక్‌ ఓటరుకు సీరియల్‌ నెంబర్‌ 738లో టీఏఈ1788496 నెంబర్‌ ఉండగా, సీరియల్‌ నెంబర్‌ 724లో ఎస్‌వోఎక్స్‌1079459 ఓటరుకార్డు నెంబర్‌తో ఓటు ఉంది. ఇలా చెప్పుకొంటూ పోతే మరో డజను వరకు డబ్లింగ్‌ ఓట్లు ఉన్నాయి.

గతంలో ఓట్ల తొలగింపులు ఇవీ..

గతంలో గడ్డం వీరాస్వామికి ఏపీ130760363295 నెంబర్‌, రంగిశెట్టి శ్రీలక్ష్మికి టీఏఈ0686311 నెంబరుతో ఓటు ఉండేది. 2019, 2020, 2021 ఓటర్ల జాబితాల్లో వీరి పేర్లు ఉన్నాయి. కానీ, తుది జాబితాలో వీరి పేర్లు లేవు. ఇంకో విచిత్రం ఏమిటంటే, భార్య మీరాబీ షేక్‌ ఓటు తొలగింపునకు ఫాం-7 దరఖాస్తు చేస్తే, ఆమెతో పాటు ఆమె భర్త షేక్‌ మస్తాన్‌ వలీ ఓటును కూడా తొలగించడం గమనార్హం.

తెలంగాణా ఓట్లు ఇంకా తొలగించలేదు

ఓటర్ల తుది జాబితాలో కూడా ఇంకా తెలంగాణా ఓట్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పెద్దాపురం గ్రామంలో రహీమున్నీసా దూదేకుల (తెలంగాణా ఓటరు కార్డు నెంబరు ఆర్‌క్యూఎన్‌0541615)కు ఖమ్మం జిల్లా మధిరలో ఓటుహక్కు ఉంది. అక్కడే రేషన్‌ కార్డు కూడా ఉంది. ఇదే రహీమున్నీసాకు మన రాష్ట్రంలో నందిగామ నియోజకవర్గంలోని పెద్దాపురం గ్రామంలో (ఏపీ ఓటరు కార్డు నెంబర్‌ టీఏఈ1610609) ఓటుహక్కు ఉంది. అలాగే, దూదేకుల జానీ, దూదేకుల షాహిబ్జానీ ఓట్లు కూడా రెండు రాష్ర్టాల్లో ఉన్నాయి. ఫాం-7 ఇచ్చినప్పటికీ స్థానిక ఎన్నికల అధికారులు వీటిని తొలగించలేదు. ఇవి ప్రాథమికంగా మాత్రమే వెలుగుచూశాయి. ఇంకా ఓటర్ల జాబితాల పంపిణీ పూర్తికాలే దు. రాజకీయ పార్టీల బీఎల్‌ఏల చేతికి పూర్తిగా వచ్చాక అనేక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Jan 28 , 2024 | 01:06 AM