Share News

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Feb 29 , 2024 | 01:01 AM

భవన నిర్మా ణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ బుధవారం కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ వద్ద భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ గోపాలరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో భవన నిర్మాణ

 భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

మచిలీపట్నం టౌన్‌, ఫిబ్రవరి 28: భవన నిర్మా ణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ బుధవారం కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ వద్ద భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ గోపాలరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు ఐదేళ్లుగా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. సంఘ నేతలు బండారు శ్రీనివాసరావు, పాల్‌, ఏడుకొండలు, చిట్టబ్బాయి, సంజీవరావు, నరసింహారావు పాల్గొన్నారు.

పెడనలో..

పెడన: భవన నిర్మాణ కార్మికులకు జగన్‌ తీరని అన్యాయం చేశాడని ఏపీ బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నేతలు ఆరోపించారు. పట్టణంలోని బస్టాండ్‌ సెంటర్‌లోని అంబేడ్కర్‌ పార్కు ఎదుట బుధవారం రిలే నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నేతలు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు అనేక సంవత్సరాలుగా అమలవుతున్న సంక్షేమ పథకాలను 1214 మెమో ద్వారా వైసీపీ ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా రద్దు చేసిందని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారన్నారు. టీడీపీ, జనసేన పార్టీల పెడన ఉమ్మడి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్‌ శిబిరాన్ని సందర్శించి దీక్షకు సంఘీభావం తెలిపారు. ధనశ్రీ, పంచల నరసింహారావు, మాజేటి శివశ్రీనివాసరావు, గొల్లపల్లి నాగశేషుబా బు, షేక్‌ షమీమ్‌, కాగిత శ్రీనివాసరావు పాల్గొన్నారు.

అవనిగడ్డలో రిలే దీక్ష..

అవనిగడ్డ: భవన నిర్మాణ కార్మికులు కోరుతున్న న్యాయమైన డిమాండ్ల సాధనకు సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం అవనిగడ్డలో నిరసన దీక్ష చేపట్టగా, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ దీక్షకు మద్దతు పలికాయి. సంక్షేమ బోర్డును వెంటనే అమలు చేయాలని, 12, 14 మెమోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేయగా, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కరీముల్లా, బండి ఆదిశేషులు నేతృత్వం వహించారు. బుధవారం దీక్షలో అన్నపరెడ్డి నాగేశ్వరరావు, రాజశేఖర్‌, యాసం శ్రీనివాసరావుతో కలిపి 13 మంది దీక్షలో కూర్చోగా, జనసేన పార్టీ తరపున రాయపూడి వేణుగోపాలరావు, గుడివాక శేషుబాబు, బొప్పన భాను, రాజనాల వీరబాబు, మద్దతు తెలపగా, తెలుగుదేశం పార్టీ తరపున టీడీపీ జిల్లా అధ్యక్షుడు మండలి వెంకట్రామ్‌ దీక్షా శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలిపారు.

గుడివాడలో..

గుడివాడ: భవన నిర్మాణ కార్మికులకు అందించాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేసి మెమో 1214ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ సీఐటీయూ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన రెండు రోజుల రిలే నిరాహార దీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. పలు కార్మిక సంఘాలకు చెందిన నేతలు దీక్షాపరులకు సంఘీభావం తెలిపారు.

మొవ్వలో..

కూచిపూడి : బిల్డింగ్‌ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలని జిల్లా బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి వేము పెదబాబు అన్నారు. బుధవారం మొవ్వలో కృష్ణా జిల్లా బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌, సీఐటీయూ ఆధ్వర్యంలో నిరాహారదీక్షను నిర్వహించారు. ఎస్‌.కె.అల్లా భక్షు, సుబ్రహ్మణ్యం, ఓరుగంటి బాబురావు, కాకి రాజశేఖర్‌, ఇంటి రాజు, ఏనుగు శ్రీనివాసరావు, ఇటికల ఏసుపాదం, బుద్దుల మురళీ, మన్నె మోహన్‌ దీక్షలో కూర్చున్నారు. కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శీలం నారాయణరావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర ప్రసాద్‌ పాల్గొని సంఘీభావం తెలిపారు.

Updated Date - Feb 29 , 2024 | 01:01 AM