Share News

సమస్యలు పరిష్కరించకపోతే.. తడాఖా చూపిస్తాం

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:58 AM

మీరు సిద్ధం అయితే.. మేమూ సిద్ధమే.. అంటూ ప్రభుత్వం తీరుపై ఉద్యోగులు గర్జించారు. ఎన్నికల ముందు.. ఉద్యోగులు ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు. హామీల వాయిదాలతో ఐదేళ్లు ఉద్యోగులను అంతులేని ఆవేదనకు గురిచేశారని, ఇప్పుడు మాకు సమయం వచ్చిందని తడాఖా చూపిస్తామంటూ గర్జించారు.

సమస్యలు పరిష్కరించకపోతే.. తడాఖా చూపిస్తాం

నల్లబ్యాడ్జీలతో విధులు.. హోరెత్తిన ధర్నాలు

హామీల వాయిదాలతో ఐదేళ్లు నెట్టుకొచ్చారు

27న చలో విజయవాడకు సమాయత్తం

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో ఉద్యోగుల వినతిపత్రం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

ఏపీజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగులు ఉద్యమ శంఖారావం పూరించారు. తొలిరోజే ఊహించని ప్రతిఘటనను ఉద్యోగులు చూపారు. ఏపీఎన్జీవోలు, రవాణా శాఖ, ఉపాధ్యాయులు, పంచాయతీరాజ్‌, ఏపీజీఎల్‌ఐ, దంత వైద్యులు, జలవనరుల శాఖ, కమర్షియల్‌ ట్యాక్సెస్‌, సహకార, వ్యవసాయ శాఖ, ట్రెజరీ, ఆర్‌అండ్‌బీ ఉద్యోగులకు తోడు పెన్షనర్లు కూడా ఉద్యమ కదనరంగంలోకి వచ్చారు. ఏపీజేఏసీ ఎన్టీఆర్‌ జిల్లా నాయకత్వం కలెక్టరేట్‌లో డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించింది. తొలిరోజు నల్లబ్యాడ్జీల ధారణ, వినతిపత్రాలకే పిలుపునిచ్చినా ఉద్యోగులు ఉధృతస్థాయిలో ధర్నాలు చేపట్టారు.

ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఉద్యమం

- ఎ.విద్యాసాగర్‌, ఏపీజేఏసీ ఎన్టీఆర్‌ జిల్లా

ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావలసిన ఆర్థిక ప్రయోజనాలు సాధించే వరకు ఆందోళన కొనసాగుతుంది.. డిమాండ్ల సాధన కోసం పోరాటాన్ని తీవ్ర స్థాయికి తీసుకు వెళ్లేందుకు ఉద్యోగులంతా సంఘటితమౌతున్నారు.. అని విద్యాసాగర్‌ పేర్కొన్నారు. ఏపీజేఏసీ ఇచ్చిన ఉద్యమ శంఖారావం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో ఉద్యోగులు నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం ఉద్యోగుల ఉద్యమాన్ని చల్లార్చేందుకు ప్రతిసారీ చర్చల పేరుతో పిలవటం, హామీలు గుప్పించటం, వాటిని నెరవేర్చకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ మైండ్‌ గేమ్‌ ఆడుతోందన్నారు. పాత వాయిదాల పరిస్థితి గురించి స్పష్టత ఇవ్వకుండా కొత్తగా వాయిదాలు వేయటం చూస్తుంటే ఉద్యోగుల సమస్యల విషయంలో ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధమౌతుందన్నారు. ఇలాంటి హామీల వల్ల ఉద్యోగులకు ఒరిగేదేమీ ఉండదన్నారు. అనంతరం కలెక్టరేట్‌ ఏవో నాగలక్ష్మికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో జిల్లా జేఏసీ కార్యదర్శి ఎండీ ఇక్బాల్‌, రాష్ట్ర జేఏసీ నాయకులు, ఎస్టీయూ నాయకులు కిషోర్‌, శ్రీనివాసరావు, పబ్లిక్‌ సెక్టార్‌ నాయకులు సాంబశివరావు, నాల్గవ తర గతి ఉద్యోగుల సంఘం నాయకులు సాయిరాం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు పాల్గొన్నారు.

సహనాన్ని పరీక్షించవద్దు

- రవాణా శాఖ ఉద్యోగులు

ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని, తక్షణమే తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు ఎం.రాజబాబు డిమాండ్‌ చేశారు. ఏపీజేఏసీ పిలుపు మేరకు స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. రాజబాబు మాట్లాడుతూ, ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించకపోతే మరో చలో విజయవాడ తప్పదని హెచ్చరించారు. ఉద్యోగుల సంఘం నేత శ్రీరామ్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటికే అనేకమార్లు చర్చలు జరిపామన్నారు. సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యోగుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉందన్నారు. ఉద్యోగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లాలో ఉద్యోగుల ఉద్యమబాట..

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. జిల్లాలోని అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కలెక్టరేట్‌లోని ఆర్డీవో కార్యాలయంలో కృష్ణా ఎన్జీవో జేఏసీ నాయకులు వినతిపత్రం అందజేశారు. మొవ్వ, చల్లపల్లి, ఉయ్యూరు జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.

ఫ ఉద్యోగులు సంతోషంగా లేరు

మచిలీపట్నం కలెక్టరేట్‌లోని ఆర్డీవో కార్యాలయంలో ఏపీ ఎన్జీవో జేఏసీ కృష్ణాజిల్లా విభాగం నాయకులు, ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. అన్ని విభాగాల ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ జేఏసీ తూర్పు కృష్ణా అఽఽధ్యక్షుడు ఉల్లి కృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎవ్వరూ సంతోషంగా లేరని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రయోజనాలను కాపాడుకోవ డమే కష్టతరంగా మారిందన్నారు.

దశలవారీగా ఉద్యమం

ఏపీఎన్‌జీవో జేఏసీ పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన షెడ్యూలును జిల్లాఎన్‌జీవో జేఏసీ నాయకులు ప్రకటించారు. ఈనెల 15, 16తేదీల్లో నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారు. తాలూకా, జిల్లా కేంద్రాల్లో, పాఠశాలల్లో భోజన విరామ సమయంలో ప్రదర్శనలు నిర్వహిస్తారు. 17వతేదీన అన్నిప్రాంతాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. 20వ తేదీన కలెక్టరేట్‌ వద్ద ధర్నా, ర్యాలీ చేయాలని నిర్ణయించారు. 21వ తేదీనుంచి 24వతేదీవరకు జిల్లాల పర్యటనలు, 27వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తారు.

Updated Date - Feb 15 , 2024 | 12:58 AM