సదరం.. బెదరం..
ABN , Publish Date - Jul 28 , 2024 | 01:08 AM
నందివాడ మండలంలో వైసీపీ సానుభూతిపరులైన కోటీశ్వరులు సైతం వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నారు. తమకున్న కోట్ల రూపాయల ఆస్తిని పిల్లలు, మనవళ్ల పేరున మార్చి మరీ పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఏకంగా లక్షల విలువ చేసే కార్లలో వస్తుండటం ఆశ్చర్యచకితమే. నందివాడ మండలంలోనే సొంత కారు, ఇల్లు, చేపల చెరువులు, వ్యవసాయ భూములుండి కోటీశ్వరుడైన వైసీపీ ముఖ్య నాయకుడు దర్జాగా ఐదేళ్లుగా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నాడంటే నమ్మితీరాల్సిందే. చల్లపల్లి మండలంలో వినికిడి సమస్య ఉన్నట్టు చూపించి చాలామంది సదరం సర్టిఫికెట్లు పొందారు. వీరంతా భారీగా పెన్షన్లు దండుకుంటున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో 30 మందికి పైగా వినికిడి సమస్య లేదని, వారికి స్పష్టంగా వినిపిస్తోందని తెలుసుకున్న సచివాలయ సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు. ఒకటా రెండా.. ఇలాంటి వారు వేలల్లో పెన్షన్లు తీసుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్య నాయకుల ప్రోద్బలంతో, వలంటీర్ల సహకారంతో, డాక్టర్ల ప్రోద్బలంతో దొంగ సదరం సర్టిఫికెట్లు సృష్టించి, నాలుగేళ్లుగా ప్రభుత్వ పెన్షన్‌ను పొందుతున్నారు. క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బంది తనిఖీల్లో ఇలాంటి బాగోతాలు చాలానే బయటపడగా, టీడీపీ నాయకుల పరిశీలనలో మరిన్ని వెలుగుచూశాయి.

జిల్లాలో దొంగ సదరం సర్టిఫికెట్లతో పెన్షన్ దోపిడీ
వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా జారీ
స్థానిక నాయకులు, కొందరు వలంటీర్ల ప్రోత్సాహంతోనే..
వినికిడి సమస్య చూపించి భారీగా సర్టిఫికెట్లు
ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.30 వేల వరకూ వసూలు
ఆధార్‌లో పుట్టిన తేదీ, వయస్సు కూడా మార్పు
ఆస్తులున్న వైసీపీ సానుభూతిపరులకు వృద్ధాప్య పెన్షన్
సచివాలయ సిబ్బంది తనిఖీల్లో బయటపడిన నిజాలు
నందివాడ మండలంలో వైసీపీ సానుభూతిపరులైన కోటీశ్వరులు సైతం వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నారు. తమకున్న కోట్ల రూపాయల ఆస్తిని పిల్లలు, మనవళ్ల పేరున మార్చి మరీ పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఏకంగా లక్షల విలువ చేసే కార్లలో వస్తుండటం ఆశ్చర్యచకితమే.
నందివాడ మండలంలోనే సొంత కారు, ఇల్లు, చేపల చెరువులు, వ్యవసాయ భూములుండి కోటీశ్వరుడైన వైసీపీ ముఖ్య నాయకుడు దర్జాగా ఐదేళ్లుగా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నాడంటే నమ్మితీరాల్సిందే.
చల్లపల్లి మండలంలో వినికిడి సమస్య ఉన్నట్టు చూపించి చాలామంది సదరం సర్టిఫికెట్లు పొందారు. వీరంతా భారీగా పెన్షన్లు దండుకుంటున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో 30 మందికి పైగా వినికిడి సమస్య లేదని, వారికి స్పష్టంగా వినిపిస్తోందని తెలుసుకున్న సచివాలయ సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు.
ఒకటా రెండా.. ఇలాంటి వారు వేలల్లో పెన్షన్లు తీసుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్య నాయకుల ప్రోద్బలంతో, వలంటీర్ల సహకారంతో, డాక్టర్ల ప్రోద్బలంతో దొంగ సదరం సర్టిఫికెట్లు సృష్టించి, నాలుగేళ్లుగా ప్రభుత్వ పెన్షన్‌ను పొందుతున్నారు. క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బంది తనిఖీల్లో ఇలాంటి బాగోతాలు చాలానే బయటపడగా, టీడీపీ నాయకుల పరిశీలనలో మరిన్ని వెలుగుచూశాయి.
గుడివాడ : జిల్లాలో నకిలీ సదరం సర్టిఫికెట్ల బాగోతాలు బయటపడుతున్నాయి. అంగవైకల్యం విషయంలో దొంగ సదరం సర్టిఫికెట్లను పొంది దర్జాగా ప్రభుత్వ పెన్షన్‌ను పొందుతున్నారు. ప్రధానంగా వృద్ధాప్య, వితంతు పెన్షన్లలో దోపిడీ జరుగుతోంది. అర్హత లేకున్నా సదరం సర్టిఫికెట్లను పొందిన కొంతమంది అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్నారు.
భారీగా అక్రమాలు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అంగవైకల్యం లేకున్నా ఉన్నట్టు సర్టిఫికెట్లను సృష్టించి, అక్రమంగా పెన్షన్లు పొందినవారు చాలామందే ఉన్నారు. సాధారణంగా అంగవైకల్యం ఉన్నవారికే పెన్షన్ అధికంగా వస్తుంది. 40 శాతం పైబడి ఉంటే, పెన్షన్‌కు అర్హులవుతారు. జిల్లాలో వైసీపీ నాయకులు.. కొందరు వలంటీర్లతో కలిసి ఈ మోసానికి పాల్పడుతున్నారు. అర్హత లేకున్నా సదరం సర్టిపికెట్లు ఇప్పిస్తామని, రూ.30 వేలు ఖర్చు చేస్తే జీవితకాలం పెన్షన్ పొందవచ్చునని నమ్మిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నాయకుల కుటుంబీకులు, బంధువులకు సదరం సర్టిఫికెట్లను భారీగా ఇప్పించారు. వలంటీర్ల ద్వారా అర్జీలు పెట్టుకుని నాలుగేళ్లుగా ప్రభుత్వ సొమ్ము దోచుకుంటున్నారు. వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ప్రభుత్వ వైద్యులు సైతం ఒత్తిడి తలొగ్గి అక్రమంగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని సమాచారం. మచిలీపట్నం, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో దొంగ సదరం సర్టిఫికెట్లను జారీ చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం.
జంక్షన్ కేంద్రంగా ఆధార్‌లో మార్పులు
హనుమాన్ జంక్షన్ కేంద్రంగా ఆధార్‌లో మార్పులు ఎక్కువగా చోటుచేసుకున్నట్లు సమాచారం. జనన ధ్రువీకరణ పత్రంతో సంబంధం లేకుండా ఆధార్‌లో వయస్సును మార్చాలంటే రూ.3 వేల నుంచి రూ.5 వేలు తీసుకుంటున్నట్లు వినికిడి. కృష్ణా, ఏలూరు జిల్లాలకు చెందిన చాలామంది తమ ఆధార్‌లలో వయసులను మార్చుకున్నట్లు సమాచారం. నాలుగేళ్లలో వందలాది మంది తమ ఆధార్‌లలో వయసులను మార్చుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మచ్చుకు కొన్ని..
గుడివాడ మండలం మోటూరుకు చెందిన వ్యక్తి నాలుగేళ్లుగా దర్జాగా అంగవైకల్య పింఛన్ పొందుతున్నాడు. ఇతనికి అంగవైకల్యం కేవలం ఐదు శాతం కూడా ఉండదని, అయినా పెన్షన్ పొందుతున్నాడని స్థానికులే చెబుతున్నారు. చేతికి దెబ్బ తగలడంతో రాడ్డు వేశారు. సదరు వ్యక్తి భారీ బస్తాలను మోయడంతో పాటు పొలం పనులు పూర్తిగా చేసుకుంటున్నాడు.
గుడివాడకు చెందిన వైసీపీ సానుభూతిపరురాలు నాలుగేళ్లుగా ఒంటరి మహిళ పింఛన్ పొందుతోంది. నాలుగేళ్ల కిందట చిన్నపాటి మనస్పర్థలతో భర్త నుంచి విడిపోయి ఆరు నెలలుగా వేరుగా ఉంటోంది. సదరు మహిళ సోదరుడు వార్డులో వైసీపీ కీలక నేతగా ఉన్నాడు. భర్త వదిలేసినట్టు చూపి వలంటీర్ సాయంతో నాలుగేళ్లుగా ఒంటరి మహిళ పెన్షన్ అందజేసేలా చేశాడు. కాగా, ప్రస్తుతం సదరు మహిళ భర్తతో కలిసి కాపురం చేస్తుండటం విశేషం.
గుడివాడ మండలం శేరీవేల్పూరుకు చెందిన వైసీపీ సానుభూతిపరులు ఏకంగా ఆధార్‌లో వయసు మార్చుకుని వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నారు. గుడివాడలో ఒక ప్రైవేట్ బ్యాంకులో వైసీపీ నాయకుల అండతో ఆధార్‌లో వయసులను మార్చినట్టు గ్రామస్థులు చెబుతున్నారు.
నందివాడ మండలం తుమ్మలపల్లి, నందివాడ, జొన్నపాడు తదితర గ్రామాల్లో సదరం సర్టిఫికెట్ల విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 50 ఏళ్లు దాటకుండానే వృద్ధాప్య పెన్షన్లు పొందుతున్నారని సచివాలయ సిబ్బందే మాట్లాడుకుంటున్నారు.