Share News

గరళ జలం!

ABN , Publish Date - May 29 , 2024 | 01:21 AM

వీఎంసీ సరఫరా చేసే మంచినీరు తాగేందుకు జనం బెంబేలెత్తుతున్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రంగు, వాసనతో మంచినీరు సరఫరా అవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. సోమవారం మొగల్రారాజపురంలో ఓ వ్యక్తి వాంతులు విరేచనాలతో చనిపోవడంతో నగరవాసులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. నగరంలో అన్ని ప్రాంతాల్లో మంచినీరు రంగు, వాసన రావడంతోపాటు పలువురు వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో డయేరియా అనే అనుమానాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. అధికారులు మాత్రం అటువంటిది ఏమీ లేదని వాదిస్తున్నారు. (విజయవాడ - ఆంధ్రజ్యోతి/చిట్టినగర్‌)

గరళ జలం!

నగరంలో కలుషిత నీటి కలకలం

ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క రంగు, వాసన

కొన్ని రోజులుగా ప్రజల నుంచి ఫిర్యాదులు

అయినా పట్టించుకోని వీఎంసీ అధికారులు

మొగల్రారాజపురంలో వారంలో ఇద్దరు మృతి

వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్న బాధితులు

డయేరియా వార్తలతో ఎట్టకేలకు రంగంలో వీఎంసీ అధికారులు

వాటర్‌ ట్యాంకర్లతో తాగునీటి సరఫరా

వీఎంసీ సరఫరా చేసే మంచినీరు తాగేందుకు జనం బెంబేలెత్తుతున్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రంగు, వాసనతో మంచినీరు సరఫరా అవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. సోమవారం మొగల్రారాజపురంలో ఓ వ్యక్తి వాంతులు విరేచనాలతో చనిపోవడంతో నగరవాసులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. నగరంలో అన్ని ప్రాంతాల్లో మంచినీరు రంగు, వాసన రావడంతోపాటు పలువురు వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో డయేరియా అనే అనుమానాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. అధికారులు మాత్రం అటువంటిది ఏమీ లేదని వాదిస్తున్నారు. (విజయవాడ - ఆంధ్రజ్యోతి/చిట్టినగర్‌)

తాగునీరు కలుషితం అవుతోందిలా..

విజయవాడలో 64 డివిజన్లలో సుమారు 1.40 లక్షల మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి. విద్యాధరపురం హెడ్‌ వాటర్‌ వర్క్స నుంచి తాగునీటిని పలు దఫాలుగా ఫిల్టర్‌ చేసి పైపులైన్లు ద్వారా నగరంలో 69 రిజర్వాయర్లుకు పంపుతారు. అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. హెడ్‌ వాటర్‌ వర్స్క్‌ నుంచి రోజుకి 44 ఎంజీడీ వాటర్‌ను ఫిల్టర్‌ చేసి ప్రజలకు అందిస్తున్నారు. వీఎంసీ పరిధిలోని మూడు సర్కిల్స్‌లో 600 మంది వాటర్‌ సప్లయ్‌ విభాగంలో పని చేస్తున్నారు. వీరు నిత్యం మూడు సర్కిల్స్‌లోని వివిధ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు వాటర్‌ శాంపిళ్లు తీసి పరీక్షలు చేస్తారు. కొంతమంది లీకేజీలు, పైపులైన్ల మరమ్మతులు తదితర పనులు చేస్తారు. నగరంలో మంచినీటి సరఫరా చేసే వాటర్‌ పైపులైన్లు పురాతన కాలం నాటివి. వీటికి తరచూ లీకేజీలు ఏర్పడుతుంటాయి. దీంతో తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొన్ని డివిజన్లలో మంచినీటి పైపులైన్లు డ్రైయిన్‌ క్రింద డ్రైయిన్‌లపైన, పక్కనే వెళుతున్నాయి. డ్రైయిన్‌ కింద పక్కనే ఉన్న కొన్ని ప్రాంతాల్లో పైపులైన్‌ పాడైతే వాటర్‌ పైపుల్లో మురుగునీరు చేరి తాగునీరు కలుషితం అవుతుంది. కొన్నిచోట్ల రిజర్వాయర్లు ఎక్కువ కాలం శుభ్రం చెయ్యకపోవడంతోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. రామలింగేశ్వ రనగర్‌లో నిర్మిస్తున్న తాగునీటి ట్యాంకు ఏళ్లు గడుస్తున్నా అందుబాటులోకి రావడం లేదు. ఫలితంగా ఈ ప్రాంతవాసులకు కలుషిత నీరే దిక్కవుతోంది. నీటి పన్ను వసూలు చేస్తున్న అధికారులు స్వచ్ఛమైన నీటిని అందించడం లేదని నగరవాసులు మండిపడుతున్నారు.

ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా

మొగల్రారాజపురం సంఘటన తెలిసిన వెంటనే అధికారులు అక్కడ ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించేందుకు మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేసి డాక్టర్లను అందుబాటులో ఉంచారు. ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా వారికి పరీక్షలు నిర్వహించి మందులు అందిస్తున్నారు. డయేరియా అనే అనుమానాలు రావడంతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎక్కడికక్కడ మంచినీటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంచినీటిలో ఎటువంటి సమస్యా లేదని తెలియటంతో మంచినీటి పైపులైన్లను పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా పైపులైన్లు లీకేజీలు ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. నగరపాలకసంస్థతోపాటు గుంటూరు ఐపీఎం ల్యాబ్‌ హెడ్‌ వాటర్‌ వర్స్క్‌ సిబ్బంది రంగంలోకి దిగి మొగల్రారాజపురం ప్రాంతంలో పలుచోట్ల మంచినీటి శాంపిళ్లను తీసుకొని పరీక్షలకు పంపించారు. సంఘటన జరిగిన ప్రాంతంలో ప్రజలకు మంచినీటిని వాటర్‌ ట్యాంక్‌ల ద్వారా సరఫరా చేయడంతోపాటు కాచిచల్లార్చిన నీటిని తాగాలని

ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు.

డయేరియా వ్యాప్తిపై వీఎంసీ దిద్దుబాటు

ఫుడ్‌ కంట్రోల్‌, ఆరోగ్య శాఖ కూడా తనిఖీలు

నీటి శాంపిళ్లు తీసి పరీక్షలు

మొగల్రాజపురం, మే 27 : మొగల్రాజపురంలో డయేరియా సమస్యపై వీఎంసీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 7వ డివిజన్‌లోని సమస్య ఉన్న ప్రాంతాల్లో వీఎంసీ డీఎంహెచ్‌ఓ సుహాసిని ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ ఇంటింటి సర్వేలో మొత్తం 26 కేసులు గుర్తించామన్నారు. వాంతులు విరేచనాలతో బాధపడే వారి ఇళ్ల నుంచి తాగునీటి శాంపిళ్లు తీశామన్నారు. మంగళవారం కూడా రెండు కేసులు గుర్తించామని, వారిలో ఒకరిని ప్రభుత్వాసుపత్రికి పంపామని చెప్పారు. ఒకరు ప్రయివేటు ఆసుపత్రిలో చేరారన్నారు. ప్రభుత్వాసుపత్రిలో 30 బెడ్‌లతో వార్డు సిద్ధం చేశామని, డాక్టర్లను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు.

ఫుడ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీ

ఫుడ్‌ కంట్రోల్‌ అండ్‌ సేఫ్టీ శాఖ డైరెక్టర్‌ పూర్ణచంద్రరావు, నగర అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ ఖాజామెహీద్దీన్‌ గుంటూరు నుంచి మోబైల్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్‌ను రప్పించారు. సమస్య ఉన్న చోట నుంచి వీఎంసీ సరఫరా చేస్తున్న మంచినీటి శాంపిళ్లు, వాంతులు విరేచనాలతో భాదపడుతున్న వారి ఇళ్ల నుంచి తాగునీటి శాంపిళ్లు తీయించారు. ల్యాబ్‌లో కెమికల్‌ టెస్ట్‌ చేయించారు. ఇతర పరీక్షలకు శాంపిళ్లను హైదరాబాద్‌ పంపుతున్నామని ఆ రిపోర్టు 48 గంటల తరువాత వస్తుందని అన్నారు. ఇంకా సందేహం ఉన్నవారు తాము వాడే మంచినీటి శాంపిళ్లను తీసుకొస్తే పరీక్షలు చేస్తామని వారు చెప్పారు. మోబైల్‌ ల్యాబ్‌ ఇంకా నాలుగు రోజులు ఇక్కడే ఉంటుందన్నారు.

వీఎంసీ అధికారుల పరీక్షలు

మొగల్రాజపురంలో మంచినీటి సరఫరా చేసే బాలభాస్కర్‌ నగర్‌, పటమట వారి వీధిలో కొండ మీద ఉన్న వాటర్‌ ట్యాంకులకు, బోరు నుంచి సరఫరా అవుతున్న మంచినీటికి సంబంధించి ట్యాంకుకు ఎక్కించే ముందు, ఫిల్టర్‌ చేసిన తరువాత ట్యాంకుకు ఎక్కించిన మంచినీటిని శాంపిళ్లు తీశారు. స్థానికంగా కెమికల్‌ టెస్ట్‌ చేశారు. అయినా నీరు ఇంకా ఎర్రగా ఉండటంతో మెరుగైన పరీక్షలకు ల్యాబ్‌కు పంపారు.

Updated Date - May 29 , 2024 | 01:21 AM