Share News

బస్సులన్నీ ఫుల్‌

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:47 AM

ఆర్టీసీలో సంక్రాంతి రద్దీ తారస్థాయికి చేరింది. జిల్లాలో ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులను కూడా కుదించి దూరప్రాంతాలకు నడుపుతున్నా సరిపోని పరిస్థితి ఏర్పడింది.

బస్సులన్నీ ఫుల్‌
పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో ప్రయాణికుల తాకిడి

స్పెషల్స్‌ వేసినా సరిపోని పరిస్థితి

దూరప్రాంతాలకు 100 స్పెషల్స్‌ నడిపిన ఆర్టీసీ

రద్దీ తట్టుకోలేక లోకల్‌ బస్సులు కూడా దూరప్రాంతాలకు

పెరిగిన జనాభాకు అనుగుణంగా లేని బస్సులు

(ఆంఽధ్రజ్యోతి, విజయవాడ) : ఆర్టీసీలో సంక్రాంతి రద్దీ తారస్థాయికి చేరింది. జిల్లాలో ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులను కూడా కుదించి దూరప్రాంతాలకు నడుపుతున్నా సరిపోని పరిస్థితి ఏర్పడింది. పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో ప్రయాణికులు కిక్కిరిసి కనిపిస్తున్నారు. స్థానిక బస్సులను కుదించడంతో.. ఉన్న బస్సులు కిటకిటలాడుతున్నాయి. బస్సులు ఎక్కటానికి తోపులాటలు జరుగుతున్నాయి. పండుగ ప్రయాణాల నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు 100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. 60 ప్రత్యేక బస్సులు హైదరాబాద్‌ పంపించారు. రాజమండ్రికి 28 స్పెషల్స్‌ నడిపారు. విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు కూడా డిమాండ్‌ ఏర్పడటంతో షెడ్యూల్‌ బస్సులకు అదనంగా ఆరు ప్రత్యేక బస్సులు నడిపారు.

ఆటోడ్రైవర్ల హవా

సిటీ బస్సులను తగ్గించడంతో ఆటోవాలాలకు డిమాండ్‌ పెరిగింది. పీఎన్‌బీఎస్‌లోని ప్రీపెయిడ్‌ ఆటోస్టాండ్‌లో ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆటోవాలాలు, ప్రీపెయిడ్‌ స్టాండ్‌లో విధులు నిర్వహించే పోలీసులు మిలాఖత్‌ అయ్యారు. దీంతో నిర్దేశించిన రేట్లను అమలు చేయడం ఎప్పుడో మానేశారు. ఆటోవాలాల చేతిలో నిలువు దోపిడీకి గురవుతున్నామని ప్రయాణికులు లబోదిబోమంటున్నారు.

పెరగని బస్సుల సంఖ్య

పెరిగిన జనాభాకు అనుగుణంగా బస్సులు పెరగకపోవటం వల్ల ఈ సంక్రాంతి సీజన్‌లో నెలకొన్న రద్దీని తట్టుకునే పరిస్థితి లేకుండాపోయింది. 15ఏళ్ల కిందట అప్పటి జనాభాకు అనుగుణంగా కొన్న బస్సులే నేటికీ తిప్పుతున్నారు. మధ్యలో నామమాత్రంగా బస్సులు కొని మమ.. అనిపించారు. ద శాబ్దకాలం కిందట బస్సులు కొన్నప్పుడు ఉన్న జనాభాతో పోలిస్తే నేటి పరిస్థితికి జనాభా భారీగా పెరిగింది. మన రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 1,300 బస్సులు కూడా లేవు. ఐదేళ్ల కిందటే 1,400 బస్సులు ఉండేవి. అంటే 100 బస్సులు తగ్గాయి. కొత్తగా అద్దె బస్సులు కూడా నామమాత్రంగానే తీసుకున్నా ఫలితం లేకుండాపోయింది. మూడు వేల బస్సులు కొనాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నా అధికారులు ఆ దిశగా ఆలోచన మాత్రం చేయట్లేదు. తాజాగా కొత్త బస్సులు కొంటున్నామని అధికారులు చెబుతున్నా డిమాండ్‌కు అనుగుణంగా కొనుగోలు చేసే పరిస్థితి లేదు.

Updated Date - Jan 12 , 2024 | 12:47 AM