Share News

కేడీషీటర్లు

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:05 AM

రాజకీయాల్లో రౌడీషీటర్ల ప్రమేయం పెరిగిందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వారంవారం పోలీస్‌ కౌన్సెలింగ్‌కు డుమ్మా కొడుతూ.. నాయకుల ప్రచార కార్యక్రమాల్లో ప్రత్యక్షమవుతున్నారు.

కేడీషీటర్లు

వైసీపీ నాయకుల వెంట ప్రచార కార్యక్రమాల్లో ప్రత్యక్షం

రాజకీయ ఒత్తిళ్లతో నోరు మెదపని పోలీసులు

ఎన్నికల వేళ నాయకులకు అండగా..

ప్రచార కార్యక్రమాల్లో వారిదే హడావిడి

ఎవరైనా నాయకులను నిలదీస్తే దాడులు

విద్యాధరపురం, మార్చి 8 : రౌడీషీటర్లుగా రికార్డులకెక్కిన వారు.. వారి పరిధిలోని పోలీస్‌ స్టేషన్లకు నిర్దేశిత సమయంలో హాజరై తాము నేరాలకు పాల్పడడం లేదంటూ చెప్పుకోవాలి. మరోవైపు స్టేషన్‌ సీఐ లేదా ఏసీపీ స్థాయిలో వీరికి కౌన్సెలింగ్‌ ఇస్తారు. అయితే, ఇటీవల కాలంలో రౌడీషీటర్లు అసలు పోలీసుస్టేషన్ల వైపే చూడట్లేదు. అధికార పార్టీ నేతల వెంట ప్రచార కార్యక్రమల్లో తలమునకలుగా తిరుగుతున్నారు. విజయవాడ సెంట్రల్‌ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెలంపల్లి శ్రీనివాస్‌ ప్రచార కార్యక్రమంలో రౌడీషీటర్లదే హడావిడి. ఎవరైనా సమస్యలపై వెలంపల్లిని నిలదీస్తే.. వారిపై ఈ రౌడీషీటర్లు దాడికి దిగుతున్నారు. దీంతో తమకు అండగా ఉంటారన్న ఉద్దేశంతో మిగిలిన వైసీపీ నేతలు సైతం రౌడీషీటర్లను తమ ప్రచార కార్యక్రమాల్లో తిప్పుకొంటున్నారు.

కౌన్సెలింగ్‌కు డుమ్మా..

నేతల అండ చూసుకుని వారంవారం హాజరుకావాల్సిన కౌన్సెలింగ్‌కు చాలామంది రౌడీషీటర్లు డుమ్మా.. కొడుతున్నారు. వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఏడుగురు రౌడీషీటర్లు, 12 మంది సస్పెక్ట్‌ షీటర్లు, మరో 24 మంది నేరస్థులు ఉన్నారు. గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఐదుగురు రౌడీషీటర్లు ఉండగా, సస్పెక్ట్‌ షీటర్లు, నేరస్థులు కలిపి 43 మంది ఉన్నారు. సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఐదుగురు రౌడీషీటర్లు, 28 మంది సస్పెక్ట్‌ షీటర్లు, 60 మంది నేరస్థులు ఉన్నారు. భవానీపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 30 మంది రౌడీషీటర్లు, 99 మంది సస్పెక్ట్‌ షీటర్లు, 57 మంది నేరస్థులు ఉన్నారు. కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 30 మంది రౌడీషీటర్లు, 65 మంది సస్పెక్ట్‌ షీటర్లు, 60 మంది నేరస్థులు ఉన్నారు. కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో 52 మంది రౌడీషీటర్లు, 42 మంది సస్పెక్ట్‌ షీటర్లు, 100 మంది నేరస్థులు ఉన్నారు. కాగా, వన్‌టౌన్‌, కొత్తపేట పోలీస్‌ స్టేషన్లకు కలిపి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలో ప్రతి ఆదివారం పోలీసు అధికారులు రౌడీషీటర్లు, సస్పెక్ట్‌ షీటర్లు, నేరస్థులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. దీనికి కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అధికార పార్టీకి చెందిన పలువురు రౌడీషీటర్లు హాజరు కావట్లేదు. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ఆ రౌడీషీటర్లు రెచ్చిపోయి గొడవలకు దిగుతున్నారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్‌ షీటర్లు, నేరస్థులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి, పంపించాల్సిన ఇంటెలిజెన్స్‌ విభాగం రాజకీయ ఒత్తిళ్లతో పూర్తిగా పడకేసింది. దీంతో పాటు రౌడీషీటర్లను అదుపులో ఉంచాల్సిన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది కూడా నిద్రపోతున్నారు. ఇదే కొనసాగితే ఎన్నికల్లో రౌడీషీటర్ల ప్రమేయం మితిమీరే అవకాశం లేకపోలేదు.

Updated Date - Mar 09 , 2024 | 01:05 AM