లిఫ్ట్ అడిగి.. కానరాని లోకాలకు..
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:59 AM
విధి ఎప్పుడు, ఎలా, ఎవరిని బలి తీసుకుంటుందో ఎవరికీ తెలియదు. ఇందుకు నున్న శివారు పాలెం అడ్డరోడ్డులో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదమే నిదర్శనం. సెక్యూరిటీ గార్డుగా విధులకు వెళ్లాలని ఒకరు బైకుపై బయల్దేరగా, భవానీ మాలధారులకు సమయానికి భోజనం వండి పెట్టాలని మరొకరు బైకరును లిఫ్ట్ అడిగి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెందారు.
నున్న శివారులో రోడ్డు ప్రమాదం
బైకర్ సహా లిఫ్ట్ అడిగిన భవానీ మృతి
విజయవాడ రూరల్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : విధి ఎప్పుడు, ఎలా, ఎవరిని బలి తీసుకుంటుందో ఎవరికీ తెలియదు. ఇందుకు నున్న శివారు పాలెం అడ్డరోడ్డులో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదమే నిదర్శనం. సెక్యూరిటీ గార్డుగా విధులకు వెళ్లాలని ఒకరు బైకుపై బయల్దేరగా, భవానీ మాలధారులకు సమయానికి భోజనం వండి పెట్టాలని మరొకరు బైకరును లిఫ్ట్ అడిగి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెందారు. వివరాల ప్రకారం.. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన సుంకర దుర్గారావు (43) ఆర్మీలో పనిచేసి రిటైరై ఆగిరిపల్లిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. విధుల నిమిత్తం సోమవారం ఉదయం ద్విచక్రవాహనంపై నున్న మీదుగా ఆగిరిపల్లి వెళ్తుండగా, అదే గ్రామానికి చెందిన వంటమేస్ర్తి సుంకర సాంబశివరావు (53) స్వాములకు వంట పనుల నిమిత్తం సూరంపల్లి వెళ్లేందుకు రోడ్డుపై నిలుచున్నారు. దుర్గారావును లిఫ్ట్ అడిగారు. దీంతో ఇద్దరూ కలిసి బైకుపై వెళ్తుండగా, పాలెం అడ్డరోడ్డు సమీపంలోకి రాగానే గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొంది. దీంతో ఇద్దరూ వాహనంతో సహా ఎగిరి రోడ్డు పక్కనే ఉన్న చెట్లలో పడి అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న నున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.