రింగ రింగా..!
ABN , Publish Date - Jul 28 , 2024 | 01:11 AM
బదిలీలపై సొంత జిల్లాలకు వస్తున్న తహసీల్దార్లు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒక్కో మండలానికి అరడజను మంది తక్కువ కాకుండా పోటీ పడుతున్నారు. వచ్చేవారు, వెళ్లేవారితో ఎమ్మెల్యేల కార్యాలయాలు రద్దీగా మారిపోయాయి.

ఎమ్మెల్యేల చుట్టూ తహసీల్దార్ల ప్రదక్షిణలు
బదిలీల్లో గ్రేటర్ విజయవాడ విలీన మండలాలపై దృష్టి
ఒక్కో పోస్టు కోసం ఆరుగురు చొప్పున పోటీ
అవాక్కవుతున్న ఎమ్మెల్యేలు
పోటీగా.. ఆర్‌ఐ, వీఆర్వోలు కూడా..
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : బదిలీలపై సొంత జిల్లాలకు వస్తున్న తహసీల్దార్లు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒక్కో మండలానికి అరడజను మంది తక్కువ కాకుండా పోటీ పడుతున్నారు. వచ్చేవారు, వెళ్లేవారితో ఎమ్మెల్యేల కార్యాలయాలు రద్దీగా మారిపోయాయి. తహసీల్దార్ల తాకిడి చూసి ఎమ్మెల్యేలే ఆశ్చర్యపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరీ ముఖ్యంగా విజయవాడ గ్రేటర్ విలీన జాబితాలో ఉన్న స్థానాలకు తహసీల్దార్ల నుంచి తీవ్ర పోటీ నెలకొంది.
ఆ స్థానాలకు పోటాపోటీ
ఉమ్మడి కృష్ణాజిల్లాలో విజయవాడ రూరల్ మండలం మొదటి వరుసలో ఉండగా, గన్నవరం మండలం రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత జగ్గయ్యపేట, పెనమలూరు, కంకిపాడు, బాపులపాడు, మైలవరం, గంపలగూడెం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, గుడివాడ, పెడన, విస్సన్నపేట, రెడ్డిగూడెం మండలాలు ప్రధానంగా ఉన్నాయి. మచిలీపట్నం, అవనిగడ్డ, క ంచికచర్ల, పామర్రు మండలాలకు కూడా డిమాండ్ బాగానే ఉంది. విజయవాడ తూర్పు, సెంట్రల్ మండలాలకు పోటీ తీవ్రంగా ఉంది.
సందిగ్ధంలో ఎమ్మెల్యేలు
ఒక్కో పోస్టు కోసం అరడజను మందికి పైగా తహసీల్దార్లు పోటీ పడుతుండటంతో ఎవరిని ఎంపిక చేసుకోవాలో ఎమ్మెల్యేలకు అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేలతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఆర్‌ఐలు, వీఆర్వోలు కూడా ఆయా మండలాలకు వెళ్లడానికి పోటీ పడుతున్నారు. తమకు ఎవరు కావాలో ఎమ్మెల్యేలు ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కలెక్టర్లకు సిఫార్సు లేఖలు పంపినట్టు సమాచారం. కాగా, ఇప్పటికే తహసీల్దార్లకు మండలాల కేటాయింపు కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. సోమ, మంగళవారాల్లో కేటాయింపులు జరిగే అవకాశం ఉంది.