Share News

బియ్యం.. బెధరహో

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:59 AM

రెండు జిల్లాల్లో బియ్యం కొరత లేదు.. ధాన్యపు రాశి పుష్టిగానే ఉంది.. మిల్లులు రోజూ ఆడుతూనే ఉన్నాయి.. మిల్లర్లకు చేతినిండా పని కూడా ఉంది.. మరి.. మార్కెట్‌లో బియ్యం రేట్లు ఎందుకలా పెరుగుతున్నాయి? ట్రేడర్లు, హోల్‌సేలర్లు కలిసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? ఇంత జరుగుతున్నా సివిల్‌ సప్లయిస్‌ శాఖ ఎందుకు మిన్నకుండిపోతోంది..? వంటి ప్రశ్నలు వాస్తవాలే అయినా సమాధానం మాత్రం దొరకని పరిస్థితి ఏర్పడింది.

బియ్యం.. బెధరహో

రోజురోజుకూ పెరుగుతున్న ధరలు

మిల్లర్లు, ట్రేడర్లు, హోల్‌సేలర్ల సిండికే ట్‌ దోపిడీ

కృత్రిమ కొరత సృష్టించి రేట్లు పెంపు

జిల్లాలో ధాన్యం దిగుబడికి ఢోకా లేదు..

మద్దతు ధర కంటే తక్కువకే అమ్ముతున్న రైతులు

అయినా రేట్లు ఎందుకు పెరుగుతున్నాయ్‌..?

భారీగా లాభపడుతున్న వ్యాపారులు

కనీస చర్యలు తీసుకోని సివిల్‌ సప్లయిస్‌

రెండు జిల్లాల్లో బియ్యం కొరత లేదు.. ధాన్యపు రాశి పుష్టిగానే ఉంది.. మిల్లులు రోజూ ఆడుతూనే ఉన్నాయి.. మిల్లర్లకు చేతినిండా పని కూడా ఉంది.. మరి.. మార్కెట్‌లో బియ్యం రేట్లు ఎందుకలా పెరుగుతున్నాయి? ట్రేడర్లు, హోల్‌సేలర్లు కలిసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? ఇంత జరుగుతున్నా సివిల్‌ సప్లయిస్‌ శాఖ ఎందుకు మిన్నకుండిపోతోంది..? వంటి ప్రశ్నలు వాస్తవాలే అయినా సమాధానం మాత్రం దొరకని పరిస్థితి ఏర్పడింది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : బహిరంగ మార్కెట్‌లో కిలో బియ్యం రూ.68 పలుకుతోంది. బస్తా ధర రూ.1,700 పైనే ఉంటోంది. ఈ ధరలు ఇంకా ఎంతస్థాయికి పెరుగుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. బియ్యం ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన సివిల్‌ సప్లయిస్‌ అధికారులు పట్టించుకున్న పాపాన పోవట్లేదు. దీంతో వ్యాపారులకు పండుగ, సామాన్యులకు దండుగ అన్నట్టుగా మారింది పరిస్థితి. ప్రభుత్వం తరఫున రేషన్‌ ఇస్తున్నామన్న పేరుతో బహిరంగ మార్కెట్‌లో దోపిడీ జరుగుతుంటే, సివిల్‌ సప్లయిస్‌ అధికారులు కనీస తనిఖీలు, దాడులు కూడా చేయట్లేదు. ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యంలో 80 శాతం తిరిగి రీ సైక్లింగ్‌ అయ్యి ప్రస్తుతం పెరిగిపోతున్న ధరలతో వ్యాపారులకు లాభాల పంట పండిస్తోంది. సివిల్‌ సప్లయిస్‌ అధికారులు ఇలాగే చోద్యం చూస్తుంటే, రానున్న రోజుల్లో కేజీ బియ్యం రూ.100కు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు.

‘సివిల్‌ సప్లయిస్‌’ స్పందించదా..?

వాస్తవానికి రేషన్‌ తీసుకున్న కార్డుదారుల్లో 80 శాతానికి పైగా ఆ బియ్యాన్ని తినరు. వీరంతా బహిరంగ మార్కెట్‌లో లభించే సన్నగా, నాణ్యంగా ఉండే బియ్యాన్నే కొంటారు. రేషన్‌ బియ్యం పౌష్టికమే అయినప్పటికీ లావుగా, అన్నం వండితే మెత్తగా మారిపోతాయి. ఇలాంటి బియ్యాన్ని కార్డుదారులు అమ్ముకుంటున్నారన్న విషయం సివిల్‌ సప్లయిస్‌ అధికారులకు కూడా తెలుసు. ఇలాంటపుడు బహిరంగ మార్కెట్‌లో రాకెట్‌లా దూసుకుపోతున్న ధరలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత సివిల్‌ సప్లయిస్‌దే. మిల్లులు, మిల్లర్ల గోడౌన్లు, జిల్లావ్యాప్తంగా ఉన్న ట్రేడర్లు, హోల్‌సేల్‌ వ్యాపారులు, రీటైలర్లపై దాడులు చేస్తే బియ్యం ధరలను నియంత్రణలోకి తీసుకురావటం సాధ్యమవుతుంది. ఇలా అయితే కాస్తంత అయినా ధరలు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంటుంది.

ధాన్యం కొరత లేనపుడు ధరలెందుకు పెరుగుతున్నాయ్‌..!

ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొరత లేదు. ఆర్‌బీకేల ద్వారా ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌గా ట్రేడర్లు రైతుల నుంచి పెద్ద ఎత్తున బియ్యం కొంటున్నారు. మిల్లులు కూడా పూర్తిస్థాయిలో ధాన్యాన్ని ఆడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయో అర్థంకాని పరిస్థితి. రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర రూ.1,600. మధ్య దళారీలు రూ.1,400కే రైతుల వద్ద కొంటున్నారు. మిల్లర్లు అయితే రూ.1,300లే ఇస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.1,600 కాకుండా మరో రూ.400 పెంచి రూ.2,000 చొప్పున లెక్కించినా కూడా మిల్లు ఆడిస్తే ధాన్యం 70 కేజీల బియ్యం బస్తాకు కేజీ రూ.28 మించి ఖర్చు కాదు. మిల్లు ఆడినందుకు, పాలిష్‌ పట్టినందుకు, ప్యాకింగ్‌ చేసినందుకు, రవాణా చేసినందుకు మహా అయితే కేజీ బియ్యం రూ.40 కూడా అవ్వదు. మరి కేజీ బియ్యం రూ.68కు ఎందుకు పెరిగిందో అర్థంకాని పరిస్థితి. ఇదంతా ట్రేడర్లు, హోల్‌సేలర్లు కలిసి ఆడుతున్న నాటకమని తెలుస్తోంది. ఽధాన్యం దిగుబడి బాగానే ఉన్నా, బియ్యం బాగానే ఆడుతున్నా... కృత్రిమ కొరతను సృష్టించి, మార్కెట్‌లో రేట్లను పెంచి అడ్డగోలుగా ధరలు పెంచేస్తున్నారు. మిల్లర్లు, ట్రేడర్లు, హోల్‌సేలర్లు, రీటైలర్లపై దాడులు జరిపితే వాస్తవాలు బయటపడతాయి. ధరలకు ముకుతాడు పడుతుంది. ఇప్పటికైనా సివిల్‌ సప్లయిస్‌ అధికారులు జూలు విదల్చకపోతే మార్కెట్‌లో కేజీ బియ్యం రూ.100కు చేరుకున్నా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.

Updated Date - Feb 07 , 2024 | 12:59 AM