Share News

‘రివర్స్‌’ ఫ్రంట్‌..!

ABN , Publish Date - Mar 14 , 2024 | 12:55 AM

మంగళవారం సీన్‌.. కనకదుర్గమ్మ వారధి పక్కన, రిటైనింగ్‌ వాల్‌పై నిర్మించిన ‘విజయవాడ రివర్‌ ఫ్రంట్‌’ పార్కు. చక్కటి వాతావరణం.. పచ్చటి మొక్కలు.. పిల్లలు ఆడుకునే ఆట పరికరాలు.. పెద్దలు వ్యాయామం చేసుకునే పరికరాలు.. అందమైన ప్రాంగణంతో కళకళలాడిన ఈ పార్కును సీఎం జగన్‌ ప్రారంభించి ‘కృష్ణమ్మ జలవిహారం’ అని నామకరణం చేశారు. ఇంకేముంది ఆహ్లాదకరమైన పార్కు మన ముంగిట వాలిందని స్థానికులు తెగ ఆనందపడిపోయారు. కట్‌ చేస్తే.. బుధవారం సీన్‌.. రివర్‌ ఫ్రంట్‌ పార్కు ‘రివర్స్‌’ అయ్యింది. మొండిగా నిలబడిన ఆటపరికరాలు.. ఊడిపడిన వ్యాయామ పరికరాలు.. కనిపించకుండా పోయిన పచ్చటి లాన్‌.. పూర్తికాని పనులు.. సందర్శకులను రానివ్వకుండా గేటు బయట సెక్యూరిటీ గార్డు.. సీఎం జగన్‌ వస్తున్నారని పైపై పనులతో, మొండి పరికరాలతో హడావిడి చేసిన అధికారులు ఆయన వెళ్లాక ఇప్పుడు తీరిగ్గా పనులు చేస్తూ సందర్శకులకు తేలిగ్గా నో ఎంట్రీ చెప్పేశారు.

‘రివర్స్‌’ ఫ్రంట్‌..!
నామ్‌ కే వాస్తేగా నిలబెట్టిన ఆటపరికరాల వద్ద పిల్లల ఆటలు

ప్రారంభం రోజే తొందర.. మరుసటిరోజు చిందరవందర

సీఎం కోసం నామ్‌కే వాస్తేగా నిలబెట్టిన పరికరాలు

ఇప్పుడు హడావిడిగా చేపడుతున్న పనులు

సందర్శకులెవరూ రాకుండా బయట సెక్యూరిటీ గార్డు

ఆశగా వచ్చిన స్థానికులు నిరాశతో వెనక్కి..

పనులు కానప్పుడు ప్రారంభమెందుకని ఆగ్రహం

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : కనకదుర్గమ్మ వారధికి దిగువన రూ.12.3 కోట్లతో నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌ను ఆనుకుని విజయవాడ ‘రివర్‌ ఫ్రంట్‌’ పేరుతో నిర్మించిన పార్కుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి నుంచి కృష్ణానది అందాలను వీక్షించవచ్చన్న కోణంలో ఈ పార్కును నిర్మించారు. వాల్‌ వెంబడి వాకింగ్‌ ట్రాక్‌, దీనికి రెండువైపులా లాన్‌ ఏర్పాటు చేశారు. వ్యాయామం చేసుకోవడానికి పరికరాలు, పిల్లలు ఆడుకోవడానికి ఆట పరికరాలను సిద్ధం చేశారు. సీఎం మంగళవారం ప్రారంభించడానికి అనుకూలంగా సిద్ధం చేశారు.

ప్రారంభ కోసమే తొందర

విజయవాడ రివర్‌ ఫ్రంట్‌ పేరుతో పార్కును నిర్మించినా, దానికి సీఎం జగన్‌ కృష్ణమ్మ జలవిహారం అని నామకరణం చేసి ప్రారంభించారు. తొలిరోజు అధికారులు పార్కును సకల హంగులతో సిద్ధంచేసినా.. మరుసటిరోజు కళావిహీనంగా మారింది. సందర్శకులు లోపలకు వెళ్లకుండా ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ గార్డును నియమించారు. పార్కులో ఇంకా పనులు జరుగుతున్నాయని, మరో రెండు రోజుల సమయం పడుతుందని చెప్పి వచ్చిన సందర్శకులను, పిల్లలను వెనక్కి పంపేశారు. దీంతో సందర్శకులంతా నిరాశకు లోనయ్యారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో తాను చేసిన అభివృద్ధి ఇదీ.. అని చెప్పుకోవడానికి వీలుగా ఈ పార్కును జగన్‌ హడావిడిగా ప్రారంభించారని చుట్టుపక్కల వారు విమర్శిస్తున్నారు.

పనులన్నీ చిందరవందర

పులప్స్‌ బార్‌, అప్‌ అండ్‌ డౌన్‌, ఊయల, ఫ్రంట్‌ అండ్‌ బ్యాక్‌, జారుడుబల్ల.. ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునే పరికరాలు. పులప్స్‌ బార్‌, ఫ్రంట్‌ అండ్‌ బ్యాక్‌పై యువకులు వ్యాయామం చేసుకుంటారు. పార్కు ప్రారంభోత్సవం రోజున ఇవన్నీ బాగానే ఉన్నాయి. బుధవారం మాత్రం నేలపై ఒరిగి ఉన్నాయి. సీఎం రాక కోసం వాటిని ఇసుకలో తాత్కాలికంగా నిలబెట్టామని అక్కడ పనులు చేస్తున్నవారు తెలిపారు. వాటిని పక్కనపెట్టి ఇప్పుడు శాశ్వతంగా అమర్చే పనులు సాగుతున్నాయి. గోతులు తవ్వి ఆ పరికరాలను నిలబెట్టి కాంక్రీట్‌ వేస్తున్నారు. పార్కుకు మొదటి ప్రదేశంలో మాత్రమే పనులు కొంతవరకు పూర్తయ్యాయి. లోపలకు వెళ్లేకొద్దీ గ్రావెల్‌ వేయడం, మొక్కలు నాటడం వంటి పనులు జరుగుతున్నాయి. గార్డెనింగ్‌ పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. సీఎం సందర్శించిన ప్రదేశంలో మాత్రమే పనులను పూర్తిచేసి అధికారులు మమ అనిపించారు. పనులు పూర్తికాని పార్కు ప్రారంభోత్సవానికి ఇంత హడావుడి ఎందుకని సందర్శకులు మండిపడుతున్నారు.

Updated Date - Mar 14 , 2024 | 12:55 AM