Share News

ఆయువు తీసిన ఆటో

ABN , Publish Date - Feb 01 , 2024 | 01:25 AM

రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. అయినా ఆనందంగా సాగిపోతున్న సంసార సాగరం. ముద్దు ముద్దు మాటలు చెప్పే ఓ బాబు, మురిపెంగా చూసుకుంటున్న ఓ పాప. ఆటో వేయగా వచ్చిన డబ్బుతో ఆ దంపతులు ఏ చీకూ చింత లేకుండా ఉన్నదాంట్లోనే సంతోషంగా బతుకుతున్నారు. విధికి కన్నుకుట్టిందో ఏమో.

ఆయువు తీసిన ఆటో

రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం

ఆటోపైనే 20 ఏళ్లుగా జీవనాధారం

చిన్నారిని చిదిమేసిన ఆటో

దుఃఖసాగరంలో మోటూరు

గుడివాడ రూరల్‌, జనవరి 31 : రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. అయినా ఆనందంగా సాగిపోతున్న సంసార సాగరం. ముద్దు ముద్దు మాటలు చెప్పే ఓ బాబు, మురిపెంగా చూసుకుంటున్న ఓ పాప. ఆటో వేయగా వచ్చిన డబ్బుతో ఆ దంపతులు ఏ చీకూ చింత లేకుండా ఉన్నదాంట్లోనే సంతోషంగా బతుకుతున్నారు. విధికి కన్నుకుట్టిందో ఏమో. ఆటో రూపంలో వచ్చి ఆ ఆనందాన్ని దూరం చేసింది. ఆ కుటుంబాన్ని దుఃఖసాగరంలో ముంచేసింది. గుడివాడ రూరల్‌ మండలం మోటూరు గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలుడు వరిగంజి రిషిక్‌ మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తండ్రి ఆటో కింద పడి రిషిక్‌ మృతిచెందిన ఘటనను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. వరిగంజి మురళీకృష్ణ (35)కు 20 ఏళ్ల నుంచి ఆటోనే జీవనాధారం. రిషిత (30)తో వివాహమైనా, ఇద్దరు పిల్లలు పుట్టినా ఆటో నడపగా వచ్చిన డబ్బుతోనే జీవిస్తున్నారు. రోజూ మాదిరిగానే మురళీకృష్ణ ఆటో నడిపి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు. 3 గంటల సమయంలో తిరిగి ఆటో తీసి ఇంజన్‌ స్టార్ట్‌ చేశాడు. అయితే, కుమారుడు వెనుకే ఉన్న విషయాన్ని మురళీకృష్ణ గమనించలేదు. ఆటోను వెనక్కి నడపగా, అక్కడే ఆడుకుంటున్న రిషిక్‌పైకి ఆటో చక్రం ఎక్కింది. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు గుడివాడ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమా రుడు కళ్లముందే విగతజీవిగా మారడంతో ఏరియా ఆసుపత్రి వద్ద తల్లిదండ్రులు కన్నీరుమురన్నీరుగా రోదించారు. గ్రామస్థులు, కుటుంబసభ్యులు ఓదారుస్తున్నప్పటికీ వారి రోదన ఆపలేదు.

Updated Date - Feb 01 , 2024 | 01:31 AM