Share News

తగ్గినది

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:29 AM

ప్రాణనది కొన ఊపిరితో కనిపిస్తోంది. జీవనది జలకళను కోల్పోతోంది. ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజల దాహార్తిని, సాగునీటి కష్టాలను తీర్చే కృష్ణమ్మ ఇప్పుడు కన్నీరు పెడుతోంది. ప్రజల గొంతును తడిపే జలదేవతకు గొంతు ఎండిపోతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పదిహేనేళ్ల కిందటి గడ్డు పరిస్థితికి మళ్లీ చేరింది.

తగ్గినది

పదిహేనేళ్ల తర్వాత కృష్ణానదికి గడ్డు పరిస్థితి

ప్రకాశం బ్యారేజీ వద్ద పైకి తేలిన ఇసుక

6.1 అడుగులకు పడిపోయిన నీటిమట్టం

1.68 టీఎంసీలకు తగ్గిన నీటి నిల్వలు

2015 తర్వాత మళ్లీ ఇప్పుడే..

పులిచింతలలోనూ అదే పరిస్థితి

ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణ నిపుణులు

ప్రాణనది కొన ఊపిరితో కనిపిస్తోంది. జీవనది జలకళను కోల్పోతోంది. ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజల దాహార్తిని, సాగునీటి కష్టాలను తీర్చే కృష్ణమ్మ ఇప్పుడు కన్నీరు పెడుతోంది. ప్రజల గొంతును తడిపే జలదేవతకు గొంతు ఎండిపోతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పదిహేనేళ్ల కిందటి గడ్డు పరిస్థితికి మళ్లీ చేరింది.

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ప్రకాశం బ్యారేజీ వద్ద సరిగ్గా ఏడేళ్ల క్రితం ఉన్న పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. మార్చిలోనే నది నీటిమట్టం దారుణంగా పడిపోతోంది. ప్రస్తుతం నది పరిస్థితిపై జలవనరుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే నదీజలాలు అడుగంటిపోతుంటే, రాబోయే రెండు నెలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎల్‌నినో ప్రభావమే..

ప్రకాశం బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 12.0 అడుగులు, నీటిసామర్థ్యం 3.07 టీఎంసీలు. ప్రస్తుతం ఇక్కడ 6.1 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతోంది. నీటినిల్వలు 1.68 టీఎంసీలు ఉన్నాయి. ఈ ఏడాది ఇది దయనీయమైన పరిస్థితి. నీటిమట్టంతో పాటు నిల్వలు అడుగంటిపోతున్నాయి. బ్యారేజీ గేట్లకు వెనుక వైపున ఉన్న కాంక్రీట్‌ దిమ్మల వద్ద ఇసుక పైకి కనిపిస్తోంది. సరిగ్గా ఇదే పరిస్థితి 2015లో కనిపించింది. ఆ సంవత్సరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 6.1 అడుగులుగా నమోదైంది. నాడు 1.68 టీఎంసీల నీటి నిల్వలు రికార్డయ్యాయి. కాగా, జూలై నుంచి అక్టోబరు, నవంబరు వరకు కురిసే వర్షాలకు బ్యారేజీకి వరదలు వస్తాయి. ఆ సమయంలో గేట్లను పైకెత్తి లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసేవారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణంగా ఆ పరిస్థితి కనిపించలేదు. ఆగస్టు, సెప్టెంబరుల్లో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు వాగులు, వంకల్లో కురవడంతో వేల క్యూసెక్కుల్లోనే ఇన్‌ఫ్లో నమోదైంది. ఈ సమయంలో నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.

చింత తీర్చని పులిచింతల

బ్యారేజీకి ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టులోనూ నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇలాంటి సమయంలో పులిచింతల నుంచి నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉండేది. అటువంటిది ఈ ఏడాది ప్రకాశం బ్యారేజీ వద్ద ఎటువంటి పరిస్థితి ఉందో పులిచింతల ప్రాజెక్టు దగ్గరా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు. నీటినిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. ప్రస్తుతం నీటిమట్టం 123.489 అడుగులు, నీటినిల్వలు 4.6844 టీఎంసీలు ఉన్నాయి. గడిచిన ఏడాది ఇదే సమయానికి నీటిమట్టం 173.75 అడుగులు ఉండగా, నీటినిల్వలు 43.8 టీంఎసీలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో లేకపోగా, అవుట్‌ఫ్లో ఇవ్వలేని పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం ఉన్న నీటిలో 200 క్యూసెక్కులు ఆవిరిరూపంలో పోతోంది. ఇదిపోగా, మిగిలిన నీటిని తిరిగి వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండుకుండలా తయారయ్యే వరకు పొదుపుగా ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

Updated Date - Mar 27 , 2024 | 01:29 AM