Share News

తిరుగుబాట..!

ABN , Publish Date - Apr 07 , 2024 | 01:14 AM

విజయవాడలో పనిచేస్తున్న ఓ ఇన్‌స్పెక్టర్‌కు కాకినాడలో పనిచేస్తున్న ఒక ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్‌ చేశాడు. మీరు విజయవాడలోనే ఉంటారా? బదిలీపై వెళ్తారా? అని ప్రశ్నించాడు. దీనికి ఏం సమాధానం చెప్పాలో ఆ ఇన్‌స్పెక్టర్‌కు తెలియలేదు. ఉన్నట్టుండి కాకినాడ ఇన్‌స్పెక్టర్‌ ఇలా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు. ఎన్నికల కోడ్‌ ఎత్తేశాక ఆలోచిస్తానని సమాధానం చెప్పడంతో ఆ ఇన్‌స్పెక్టర్‌ ఫోన్‌ కట్‌ చేశాడు. కొద్దిరోజుల క్రితం ఓ ఇన్‌స్పెక్టర్‌కు ఎదురైన అనుభవమిది. అసలు ఎందుకిలా ఆరాలు తీస్తున్నారంటే..

తిరుగుబాట..!

బదిలీపై వెళ్లిన ఇన్‌స్పెక్టర్లు తిరిగి రావడానికి తహతహ

కమిషనరేట్‌లో మొదలైన ఆరాలు

ఇక్కడున్న ఇన్‌స్పెక్టర్లకు వరుస ఫోన్లు

విజయవాడలో పనిచేస్తున్న ఓ ఇన్‌స్పెక్టర్‌కు కాకినాడలో పనిచేస్తున్న ఒక ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్‌ చేశాడు. మీరు విజయవాడలోనే ఉంటారా? బదిలీపై వెళ్తారా? అని ప్రశ్నించాడు. దీనికి ఏం సమాధానం చెప్పాలో ఆ ఇన్‌స్పెక్టర్‌కు తెలియలేదు. ఉన్నట్టుండి కాకినాడ ఇన్‌స్పెక్టర్‌ ఇలా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు. ఎన్నికల కోడ్‌ ఎత్తేశాక ఆలోచిస్తానని సమాధానం చెప్పడంతో ఆ ఇన్‌స్పెక్టర్‌ ఫోన్‌ కట్‌ చేశాడు. కొద్దిరోజుల క్రితం ఓ ఇన్‌స్పెక్టర్‌కు ఎదురైన అనుభవమిది. అసలు ఎందుకిలా ఆరాలు తీస్తున్నారంటే..

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో ఎన్టీఆర్‌ కమిషనరేట్‌ పరిధిలో మూడేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఇన్‌స్పెక్టర్లను రేంజ్‌కు బదిలీ చేశారు. ఇలా వెళ్లిన వారిలో కొంతమందికి కాకినాడ జిల్లాలో, మరికొంతమందికి ఏలూరు జిల్లాలో, ఇంకొం దరికి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. నోటిఫికేషన్‌ ఇంకా విడుదల కాలేదు. ప్రస్తుతం ప్రచారాలు మాత్రమే సాగుతున్నాయి. ఇంకా నామినేషన్లు పూర్తై, ఎన్నికల తతంగం ముగిసి, ఫలితాలు వెల్లడి కావడానికి సమయం ఉంది. రెండు నెలలు సమయం ఉండగానే ఎన్టీఆర్‌ కమిషనరేట్‌ నుంచి బదిలీపై వెళ్లిన ఇన్‌స్పెక్టర్లు ఇక్కడకు రావడానికి తహతహలాడుతున్నారు. రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని బెర్తులను ఖరారు చేసుకునే పనిలో ఉన్నారు.

మొదలైన ఆరాలు

ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో రేంజ్‌లోని అన్ని జిల్లాల్లోని పోలీస్‌స్టేషన్లలో కొత్త ముఖాలు వచ్చాయి. తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల నుంచి ఇన్‌స్పెక్టర్లు ఎన్టీఆర్‌ పోలీసు కమిషనరేట్‌కు వచ్చారు. ఇక్కడున్న ఇన్‌స్పెక్టర్లు అక్కడికి వెళ్లారు. ఇందులో ఒకే బ్యాచ్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. ఇక్కడి నుంచి పొరుగు జిల్లాలకు వెళ్లిన ఇన్‌స్పెక్టర్లు ప్రస్తుతం ఇక్కడున్న ఇన్‌స్పెక్టర్లకు ఫోన్లు చేస్తున్నారు. ముందుగా క్షేమసమాచారాలు తెలుసుకుని, స్టేషన్‌ పరిస్థితులు ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. తర్వాత కమిషనరేట్‌ పరిధిలోనే ఉంటారా, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక వెళ్లిపోతారా అని ఆరా తీస్తున్నారు. తిరిగి విజయవాడకు రావాలనుకుంటున్నా మని, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నామని చెబుతున్నారు. తమ పిల్లలు విజయవాడలోనే చదువుకుంటున్నారని, అక్కడే సొంతింటిని సమకూర్చుకున్నామని వివరిస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో బదిలీపై వచ్చిన తమకు ఈ ఆరాలు ఏమిటని ఇన్‌స్పెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తికాకుండా, గెలుపోటముల లెక్కలు తేలకుండానే పొరుగు జిల్లాల్లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్లు బదిలీ కోసం ఆగలేకపోతున్నారు. తిరిగి కమిషనరేట్‌కు రావడానికి ఎదురు చూస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు ఏలూరు రేంజ్‌లో చర్చనీయాంశమైంది.

Updated Date - Apr 07 , 2024 | 01:14 AM