కంచికచర్లలో రియల్ కుదేల్
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:05 AM
కంచికచర్ల ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం మందగించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఆకాశాన్నంటిన ధరలు కొద్దిరోజుల నుంచి నేలచూపులు చూస్తున్నాయి. కొనుగోలుదారుల హడావిడి తగ్గటంతో భూములు, స్థలాల క్రయవిక్రయాలు పెద్దగా జరగటం లేదు. మార్కెట్ పుంజుకునే సూచనలు కనిపించకపోవటంతో ఆశగా ఈ రంగంలో పెట్టుబడి పెట్టిన వారంతా ఆందోళన చెందుతున్నారు. కొన్నవి అమ్ముడుపోక, అప్పులకు వడ్డీలు చెల్లించలేక సతమతమవుతున్నారు.

భారీగా తగ్గిన భూముల ధరలు
తగ్గిన క్రయవిక్రయాలు
ఆందోళనలో రియల్ వ్యాపారులు
(ఆంధ్రజ్యోతి, కంచికచర్ల) : రాష్ట్ర విభజన తర్వాత కంచికచర్ల ప్రాంతంలో 2014-19 మధ్య రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. రాజధాని అమరావతి ప్రాంతంలోని భూముల కంటే ఇక్కడి భూములకు అధిక ధరలు పలికాయి. కంచికచర్ల చుట్టుపక్కల ప్రాంతంలో ఎకరం ధర రూ.కోట్లకు చేరింది. అయినప్పటికీ ఇబ్బడిముబ్బడిగా వెంచర్లు వెలిశాయి. ప్రతి గ్రామంలో వందలాది ఎకరాలు చేతులు మారాయి. అయితే, వైసీపీ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం పడకేసింది. నూటికి 90 శాతం మందికి పైగా వ్యాపారులు దెబ్బతిన్నారు. తీవ్రంగా నష్టపోవటంతో తట్టుకోలేక కొంతమంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. అలాంటిది ఎన్నికల షెడ్యూల్ వెలువడిన దగ్గర నుంచి మళ్లీ ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ధరలు ఎగబాకాయి. క్రయవిక్రయాలు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అసాధారణంగా పెరిగాయి. ఇతర ప్రాంతాల వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, లాయర్లు, వైద్యులు, ఇతరత్రా మధుపరులు, కొనుగోలుదారుల హడావిడి ఎక్కువైంది.
రాష్ట్ర విభజన తర్వాత..
రాష్ట్ర విభజన తర్వాత పరిటాల బైపాస్ రోడ్డులో ఎకరం రూ.3.65 కోట్లకు చేరింది. కృష్ణానది తీరాన గనిఆత్కూరు వెళ్లే రోడ్డులో అమ్రితసాయి ఇంజనీరింగ్ కళాశాల వరకు పరిటాల పరిధిలో ఎకరం గరిష్టంగా రూ.2 కోట్లు పలికింది. చెవిటికల్లు రోడ్డులో బత్తినపాడు పరిధి వరకు రూ.1.80 కోట్లు, కొత్తపేట, చెవిటికల్లు, కునికినపాడు, మున్నలూరు గ్రామాల పరిధిలో కూడా భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ఎకరం ధర గరిష్టంగా రూ.1.40 కోట్లు పలికింది. కంచికచర్లను ఆనుకుని ఉన్న వీరులపాడు మండలంలో కూడా ధరలు అమాంతం పెరిగాయి. కంచికచర్ల నుంచి మధిర వెళ్లే రోడ్డులో ఎకరం రూ.2 కోట్లు పలికింది. జుజ్జూరు, అల్లూరు గ్రామాల పరిధిలో ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కన రూ.80 లక్షల నుంచి రూ.1.20 కోట్లకు కొన్నారు. ఇక జాతీయ రహదారి వెంబడి అయితే.. దేవినేని రమణ ఘాట్, మిక్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంతంలో ఎకరం రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు బేరం వచ్చినప్పటికీ క్రయ విక్రమాలు జరగలేదు. మూడు నెలలుగా మూడు పూలు, ఆరు కాయలుగా విరాజిల్లిన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు అకస్మాత్తుగా మందగించింది. అరకొర తప్పితే చెప్పుకోదగిన స్థాయిలో క్రయవిక్రయాలు జరగలేదు. ఇతర ప్రాంతాల కొనుగోలుదారులు ఇక్కడకు రావట్లేదు.
రియల్ వ్యాపారుల్లో ఆందోళన
ఎంతో ఆశతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టిన పలువురు వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భూములను అమ్ముదామంటే కొనేవారు లేకుండాపోయారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొన్న భూములను విక్రయ రిజిస్ట్రేషన్ చేసి తీసుకొచ్చిన అప్పులు చాంతాడులా పెరుగుతున్నాయి. అడ్వాన్సులు చెల్లించిన కొంతమంది మిగతా సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వెనుకాడుతున్నారు. వాయిదాలు అడుగుతూ గడువు పెంచుతున్నారు. అలాగని తక్కువ ధరకు అమ్మేందుకు రైతులెవరూ ముందుకు రావట్లేదు. దీంతో పరిస్థితి ఏమిటన్నదీ ఎవరికీ అర్థం కావట్లేదు. కంచికచర్ల మీదుగా వెళ్లే అమరావతి-ఎర్రుపాలెం రైల్వే లైనుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటం, కంచికచర్లను ఆనుకుని వెళ్లే అవుటర్ రింగు రోడ్డుకు మోక్షం కలగటం (ఓఆర్‌ఆర్), ఇప్పటికే సీఎం చంద్రబాబు గతంలో శంకుస్థాపన చేసిన దాములూరు-వైకుంఠపురం రిజర్వాయర్ కమ్ బ్రిడ్జి కంచికచర్లకు సమీపంలో ఉండటం, ఆరులైన్లుగా జాతీయ రహదారి విస్తరణ ప్రతిపాదన కార్యరూపం దాల్చనుండటం, ఇంకా కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు ఏర్పాటు కానుండటం వల్ల రియల్ ఎస్టేట్ రంగం తప్పకుండా పుంజుకుంటుందన్న ఆశాభావంలో రియల్టర్లు, రైతులు ఉన్నారు.