Share News

బందరులో రియల్‌ దందా

ABN , Publish Date - May 29 , 2024 | 01:30 AM

జిల్లా కేంద్రమైన మచిలీపట్నం, పరిసర ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు బరితెగిస్తున్నారు. ఎలాంటి అనుమతులూ తీసుకోకుండానే వెంచర్లు వేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. బందరు పోర్టు, మెడికల్‌ కళాశాల పేర్లతో బ్రోచర్లతో మాయచేసి ప్లాట్లు విక్రయించేస్తున్నారు. వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చేసి అన్ని అనుమతులూ ఉన్నాయంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొనుగోలుదారులను నమ్మించి బురిడీ కొట్టిస్తున్నారు.

బందరులో రియల్‌ దందా

రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల ఇష్టారాజ్యం

పంచాయతీల అనుమతులు లేకుండానే వెంచర్లు, ప్లాట్‌ల విక్రయాలు

పెద్దమొత్తంలో ప్రభుత్వాదాయానికి గండి

చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్న ముడా అధికారులు

పోతేపల్లి, అరిసేపల్లి పంచాయతీల్లో 12కుపైగా అనుమతులు లేని లే అవుట్‌లు

జిల్లా కేంద్రమైన మచిలీపట్నం, పరిసర ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు బరితెగిస్తున్నారు. ఎలాంటి అనుమతులూ తీసుకోకుండానే వెంచర్లు వేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. బందరు పోర్టు, మెడికల్‌ కళాశాల పేర్లతో బ్రోచర్లతో మాయచేసి ప్లాట్లు విక్రయించేస్తున్నారు. వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చేసి అన్ని అనుమతులూ ఉన్నాయంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొనుగోలుదారులను నమ్మించి బురిడీ కొట్టిస్తున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నం నగరానికి పోతేపల్లి, అరిసేపల్లి పంచాయతీలు అత్యంత సమీపంలో ఉంటాయి. ఈ గ్రామాలకు సమీపంలోనే కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారి 216-ఏ ఉంది. ఈ రహదారి నిర్మాణం దాదాపు పూర్తికావడంతో ఈ రెండు పంచాయతీల్లో భూముల ధరలు ఇటీవల కాలంలో అమాంతం పెరిగాయి. గతంలో ఎకరం రెండు కోట్ల రూపాయల ధర ఉంటే ప్రస్తుతం మూడు కోట్లకుపైగా పెరిగింది. ఈ రెండు పంచాయతీల్లో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలతో 12 ప్రాంతాల్లో అనధికారిక వెంచర్లు వేశారు. వీటికి ఎలాంటి అనుమతులూ లేవు. కనీసం పంచాయతీల నుంచి కూడా లే అవుట్‌ అప్రూవల్‌ తీసుకోలేదు. పంచాయతీల్లో రియల్‌ఎస్టేట్‌ వెంచర్లు వేస్తే నిబంధనల ప్రకారం 10 శాతం భూమిని కామన్‌సైట్‌గా వదలిపెట్టి పంచాయతీలకు ఈ భూమిని చూపాలి. రియల్‌ఎస్టేట్‌ వెంచర్లలో భవిష్యత్తులో భవనాల నిర్మాణం జరిగితే తాగునీటి వసతి, రహదారుల నిర్మాణం, విద్యుత్‌, పారిశుధ్యం ఇతరత్రా సౌకర్యాలను పంచాయతీలే కల్పించాల్సి ఉంది. అయినా పంచాయతీల నుంచి కనీస అనుమతులు తీసుకోకుండానే భూమిని ప్లాట్లుగా విభజించి వ్యాపారులు విక్రయాలు చేస్తున్నారు. పోతేపల్లిలో 100 అడుగుల రహదారి సమీపంలో ఇటీవల ఆరు ఎకరాల్లో వ్యవసాయ భూమిలో రియల్‌ఎస్టేట్‌ వెంచర్‌ వేశారు. ప్రస్తుతం ఈ భూమిలో వ్యాపారులు అంతర్గత రహదారులకు సంబంధించిన తాత్కాలిక పనులను చేస్తున్నారు. పంచాయతీ కార్యాలయ ఉద్యోగులు ఈ వెంచర్‌ వద్దకు వెళ్లి నిబంంధనల ప్రకారం అనుమతులు తీసుకోవాలని చెబితే రియల్‌ వ్యాపారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఈ ఒక్క వెంచరులోనే పంచాయతీకి రూ.6 లక్షల వరకు ఆదాయం కోల్పోతోందని పంచాయతీ సిబ్బంది చెబుతున్నారు. పోతేపల్లి, అరిసేపల్లి గ్రామాల్లో 12కుపైగా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేయగా ఒక్క వెంచరుకు కూడా అనుమతులు తీసుకోలేదని రెండు పంచాయతీల పనిచేసే ఉద్యోగులు చెబుతున్నారు.

ముడా అధికారులు ఏం చేస్తున్నట్టు?

సీఆర్‌డీఏ పరిధిలో లేని మచిలీపట్నం, పెడన, కైకలూరు, నియోజకవర్గాలతో పాటు పామర్రు, గుడివాడ , అవనిగడ్డ నిమోజకవర్గాలలోని కొంత బాగం మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, ఇతరత్రా కట్టడాలు నిర్మాణం చేయాలంటే తప్పనిసరిగా ముడా అనుమతులు తీసుకోవాలి. పంచాయతీ అనుమతులు పొందిన లేవుట్‌లను పరిశీలనచేసి అన్నీ సక్రమంగా ఉంటేనే రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, ఇతరత్రా కట్టడాలకు అనుమతులు ఇవ్వాలి. ఇప్పటివరకు ముడాలో పనిచేసిన అధికారులు పంచాయతీల అనుమతులతో సంబంధం లేకుండా అనుమతులను ఇచ్చేస్తూ వచ్చారు. తమ పరిధిలోకిరాని అంశాలకు సైతం ముడా అధికారులు అనుమతులు ఇవ్వడంతో ఈ అంశం వివాదాస్పదమైంది. దీంతో పంచాయతీల ఆదాయానికి గండికొడుతూ ముదా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పంచాయతీ అధికారులు జిల్లాఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ముడా అధికారులు, కిందిస్థాయి సిబ్బందిలో మార్పు రాకపోవడం గమనార్హం.

Updated Date - May 29 , 2024 | 01:30 AM