భక్తులకు అసౌకర్యం కలిగితే అధికారులదే బాధ్యత
ABN , Publish Date - Mar 06 , 2024 | 01:09 AM
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెదకళ్లేపల్లి కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలిగినా సంబంధిత శాఖాధికారులే బాధ్యత వహించాలని ఆర్డీవో వాణి హెచ్చరించారు.

మోపిదేవి : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెదకళ్లేపల్లి కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలిగినా సంబంధిత శాఖాధికారులే బాధ్యత వహించాలని ఆర్డీవో వాణి హెచ్చరించారు. మంగళవారం ఉదయం పెదకళ్లేపల్లి స్నాన ఘాట్‌లను ఆమె పరిశీలించారు. స్నానఘాట్ల వద్ద మేట వేసిన మట్టి తొలగింపు, ఘాట్ల పరిశుభ్రత వంటి పనులను చేపట్టాల్సి ఉందన్నారు. పనులు చేపట్టేందుకు కనీస బడ్జెట్ కేటాయింపులు కూడా లేవని డీఈ భానుబాబు ఆర్డీవో దృష్టికి తీసుకొచ్చారు. నిధుల కొరత విషయాన్ని ఆర్‌సీ శాఖాధికారులే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలన్నీరు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగిపై ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. లక్ష మందికిపైగా భక్తులు వచ్చి స్నానాలు ఆచరిస్తారని అంచనా వేసిన నేపథ్యంలో పనులు చేపట్టాల్సిన బాధ్యత మీపై లేదా? అని ఆమె మందలించారు. తహసీల్దార్ ఎం.శ్రీవిద్య, ఆర్‌ఐ సునీల్, ఆర్‌సి ఏఈ చిరంజీవి, పంచాయతీ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, వీఆర్వోలు రమణ, వేణు పాల్గొన్నారు.
ప్రత్యేక బస్సులు
అవనిగడ్డ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెదకళ్లేపల్లి తిరునాళ్లకు ఏపీఎ్‌సఆర్టీసీ అవనిగడ్డ డిపో నుంచి 20 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ హనుమంతరావు తెలిపారు. ప్రత్యేక బస్సులు అవనిగడ్డ నుంచి పెదకళ్లేపల్లి, చల్లపల్లి నుంచి పెదకళ్లేపల్లి, మచిలీపట్నం నుంచి పెదకళ్లేపల్లి వరకు ప్రత్యేక బస్సులు నడపటం జరుగుతుందన్నారు. ఈనెల 7వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక సర్వీసులు నడపటం జరుగుతుందన్నారు.
ఐలూరులో విస్తృత ఏర్పాట్లు
తోట్లవల్లూరు : ప్రముఖ పుణ్యక్షేత్రం ఐలూరులో ఈ నెల 8వ తేదీన జరిగే మహా శివరాత్రి ఉత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఘాట్‌లు ఉన్న కృష్ణానదీపాయలో నీరు లేకపోవటంతో నాలుగు చోట్ల భక్తులు జల్లు స్నానాలు చేసేందుకు బోర్లు నిర్మించారు. జడ్పీటీసీ సభ్యుడు జొన్నల రామ్మోహన్‌రెడ్డి, తహసీల్ధార్ ఎం కుసుమకుమారి జల్లు స్నానాల బోర్లను పరిశీలించారు. నదీపాయలో తాగునీటి కోసం చేతిపంపులను నిర్మిస్తున్నారు. రహదారుల వెంట జంగిల్ క్లియరెన్స్ పనులను చేపట్టారు. రామేశ్వరస్వామి దేవస్థానం వద్ద భక్తులు దైవదర్శనం కోసం ఈవో జయశ్రీ ఆధ్వర్యంలో బారికేడ్లు, పందిరి ఏర్పాటు చేస్తున్నారు.