తరతరాల స్ఫూర్తి రాణి అహిల్యాబాయి
ABN , Publish Date - Oct 21 , 2024 | 01:13 AM
మహిళాశక్తికి ధైర్యం, సామాజిక సేవలకు ప్రతీకగా నిలిచి, తన నిష్టత, దృఢత్వంతో పాలనలో పురోగతిని సాధించిన వీరమహిళ రాణి అహిల్యాబాయ్ హోల్కర్ అని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివా్‌సవర్మ అన్నారు.
విజయవాడ కల్చరల్ అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : మహిళాశక్తికి ధైర్యం, సామాజిక సేవలకు ప్రతీకగా నిలిచి, తన నిష్టత, దృఢత్వంతో పాలనలో పురోగతిని సాధించిన వీరమహిళ రాణి అహిల్యాబాయ్ హోల్కర్ అని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివా్‌సవర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమన్వయ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన తరతరాల స్ఫూర్తి రాణి అహిల్యాబాయ్ పుస్తకావిష్కరణ సభలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. అహిల్యాబాయ్ శాంతియుత పరిపాలనఅందించడంలో సమానత్వాన్ని ప్రోత్సహించడంలో ప్రజల సంక్షేమానికి చేసిన కృషి దేశచరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. ఆమె సత్రాలను పునరుద్ధరించిన పుణ్యశీలి అన్నారు. శివాజీ తల్లి జిజియాబాయ్, ఝాన్సీలక్ష్మి గురించి మాత్రమే ఎక్కువ మందికి అవగాహన ఉందని , ఇంతటి గొప్ప చారిత్రక వైభవం కలిగిన అహిల్యాబాయ్ గురించి నేటి తరానికి తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు. నాటి కాలంలోనే మహిళా సాధికారతను ప్రోత్సహించారని, తన బిడ్డకు కులాంతర వివాహం జరిపించి కులమత బేధాలకు అతీతంగా సమానత్వాన్ని సాటిందన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షురాలు విజయభారతి మాట్లాడుతూ అహిల్యాబాయ్ హోల్కర్ మహిళా హక్కుల గురించి చారిత్రక నిదర్శనంగా నిలిచిందన్నారు. ఆమె భర్త మరణం తర్వాత సామ్రాజ్యాన్ని సమర్థంగా పాలించి, నేటి మహిళలకు నాయకత్వం, సామాజిక న్యాయం, ఆర్థిక స్వాతంత్య్రం అనే హక్కుల్ని వినియోగించడంలో స్ఫూర్తినిచ్చిందన్నారు. మహిళలు తమ హక్కులను ఉపయోగించుకోవాలనీ పిలుపునిచ్చారు. సమస్యలు ఎదురైతే కేవలం పోలీస్ స్టేషన్‌కే పరిమితం కాకుండా మానవ హక్కుల కమిషన్‌ను సంప్రదించవచ్చునన్నారు. మానవ హక్కుల కమిషన్ దృష్టికి వచ్చిన చాలా ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు తీసుకున్నామన్నారు. పశ్చిమబెంగాల్, విశాఖపట్నం, కదిరి వంటి ఘటనల దృష్ట్యా తీసుకొన్న చర్యలను వివరించారు. ఐఏఎస్ అధికారిణి సృజన మాట్లాడుతూ అహిల్యాబాయ్ హోల్కర్ ఎందరో మహిళకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. సేవాతత్పరత, యుద్ధనీతి, ఆధ్యాత్మికత వంటి అనేక గొప్పపార్శ్వాలు ఆమెలో ఉన్నాయన్నారు. పుస్తకాన్ని విజయభారతి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్‌ఎ్‌సఎస్ దక్షిణ మధ్య క్ష్షేత్ర సహాసంఘ సంచాలకుడు దూసి రామకృష్ణ, బొమ్మరాజు సారంగపాణి, సాహితీ నికేతన్ డైరెక్టర్ బి.పవన్ కుమార్, మహిళా సమన్వయ కన్వీనర్ ఎన్.మాధురి తదితరులు పాల్గొన్నారు.