Share News

రూ.1.60లక్షల తెలంగాణ మద్యం స్వాధీనం

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:01 AM

అక్రమంగా తరలిస్తున్న రూ.1.60 లక్షల విలువైన తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని నలుగురిపై కేసు నమోదు చేసినట్టు విజయవాడ ఎన్‌పోర్స్‌మెంట్‌ స్పెషల్‌ సూపరింటెండెంట్‌ భార్గవ్‌ తెలిపారు.

రూ.1.60లక్షల తెలంగాణ మద్యం స్వాధీనం
నిందితులు, మద్యంతో ఎస్‌ఈబీ అధికారులు

వత్సవాయి, ఏప్రిల్‌ 18 : అక్రమంగా తరలిస్తున్న రూ.1.60 లక్షల విలువైన తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని నలుగురిపై కేసు నమోదు చేసినట్టు విజయవాడ ఎన్‌పోర్స్‌మెంట్‌ స్పెషల్‌ సూపరింటెండెంట్‌ భార్గవ్‌ తెలిపారు. వత్సవాయికి చెందిన వల్లంకొండ రమణయ్యకు చెందిన వరి గడ్డివామిలో గ్రామానికి చెందిన రమణయ్యతో పాటు చీకటిమల్ల గోపి, ఎస్‌కె నాగుల్‌, వల్లంకొండ రమే్‌షలు తెలంగాణకు చెందిన మద్యం 1,190 సీసాలు అట్టపెట్టెల్లో పెట్టి గడ్డివామిలో డంప్‌ చేసినట్టు భార్గవ్‌ తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన సీసాలను స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ చీకటి వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది. మద్యం సీసాలను తెలంగాణ నుంచి వత్సవాయికి తరలించి వైసీపీ పెద్దల ఆదేశానుసారం దాచినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎస్‌ఈబీ దాడులు

తిరువూరు, ఏప్రిల్‌ 18 : విస్సన్నపేట, ఎ.కొండూరు, గంపలగూడెం మండలాల్లో ఎస్‌ఈబి అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. సీఐ పి.అశోక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెంలో చప్పిడి కృష్ణకుమారి నుంచి ఐదు లీటర్ల నాటుసారా, నెమలిలో యాదాల జయరాజ్‌ నుంచి 15 తెలంగాణ మద్యం బాటిళ్లు, ఎ,కొండూరు మండలం గొల్లమందలతండాలో బాణావత్‌ నుంచి 10 ఆంధ్ర మద్యం బాటిళ్లు, విస్సన్నపేట మండలం తాతకుంట్లలో సారాకేసులో పాతముద్దాయి బాణావత్‌ అశోక్‌ను అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించడం జరిగిందని సీఐ వివరించారు. ఈ దాడుల్లో ఎస్‌ఈబి ఎస్సై జి.రఘు, జగ్గారావు, బిఎంపీపీ ఎస్సై కెఎండి ఆరీఫ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 01:01 AM