Share News

హోం ఓటింగ్‌కు పీడబ్ల్యూడీ తప్పనిసరి

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:36 AM

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అతి ముఖ్యమైనదని, వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు భారత ఎన్నికల సంఘం కల్పించిన హోం ఓటింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు కోరారు.

హోం ఓటింగ్‌కు పీడబ్ల్యూడీ తప్పనిసరి
విభిన్నప్రతిభావంతులు, వయోవృద్ధుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ దిల్లీరావు

కృష్ణలంక, జనవరి 8 : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అతి ముఖ్యమైనదని, వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు భారత ఎన్నికల సంఘం కల్పించిన హోం ఓటింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు కోరారు. సోమవారం పింగళి వెంకయ్య సమావేశమందిరంలో భారత ఎన్నికల సంఘం-సిస్టమాటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌ (స్వీప్‌) కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా విభిన్న ప్రతిభావంతులు, టీడీ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధ్వర్యంలో వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు ఓటు హక్కు ప్రాధాన్యత, ఓటు నమోదు, పీడబ్ల్యూడీ (పర్సన్‌ విత్‌ డిజబిలిటీ) మార్కింగ్‌, హోం ఓటింగ్‌ తదితరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ దిల్లీరావు మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం 40 శాతం, అంతకంటే అధిక వైకల్యమున్న వారికి, 80 ఏళ్లు, ఆపై వయసున్న వయోవృద్ధులకు ఇంటి దగ్గర నుంచే ఓటు వేసే హోం ఓటింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులో తెచ్చిందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటు హక్కు వినియోగించుకోవడం ముఖ్యమని, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మార్గాలతో పాటు బీఎల్‌వోల ద్వారా తమ ఓటు వివరాలు తెలుసుకోవాలన్నారు. ఒకవేళ ఓటు నమోదు కాకుంటే వెంటనే నమోదు చేయించుకోవాలన్నారు. 40 శాతం, అంతకంటే అధిక వైకల్యమున్నవారు 80 ఏళ్లు ఆపై వయసున్న వయోవృద్ధులు ఇంటిదగ్గరి నుంచే హోం ఓటింగ్‌ సౌకర్యాన్ని వినియోగించుకొనేందుకు తప్పనిసరిగా ఫారం 8 సహాయంతో పీడబ్ల్యుడీ మార్కింగ్‌ చేయించుకోవాలని సూచించారు. ఈ అంశంపై విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ సంఘాలు తమ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో హోం ఓటింగ్‌ విధానాన్ని పూర్తిస్థాయిలో పటిష్టంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నామని, సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. పోలింగ్‌, భద్రతా సిబ్బంది వున్న ప్రత్యేక బృందం హోం ఓటింగ్‌లో భాగస్వామ్యమవుతుందని, వీడియోగ్రఫీ కూడా చేయడం జరుగుతుందని వివరించారు. త్వరలో ఓటు, పోలింగ్‌ స్టేషన్‌ వివరాలు తెలియజేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విభిన్న ప్రతిభావంతులు, టీజీ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వి.కామరాజు, జిల్లా యువజన సంక్షేమ అధికారి,స్వీప్‌ నోడల్‌ అధికారి యు.శ్రీనివా్‌సలతో పాటు సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వేమూరి బాబురావు, కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు, విజువల్లీ చాలెంజ్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ రవీంద్రబాబు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు బి.రమేష్‌; ఎస్‌కే చాన్‌బీ తదితరులు పాల్గొన్నారు.

కోడిపందేలు చట్టరీత్యా నేరం

కృష్ణలంక : కోడిపందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారిపై క్రిమినల్‌ చర్యలు తప్పవని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు హెచ్చరించారు. సంక్రాంతి పండగ సందర్భంగా జిల్లాలో కోడి పందేలు జరగకుండా చర్యలపై సోమవారం కలెక్టర్‌ సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. కోడిపందేలు నిర్వహించడం-పాల్గొనడం చట్టరీత్యా నేరమని ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, చట్ట ప్రకారం కోడిపందేలను నిషేధించడం జరిగిందన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తే క్రిమినల్‌ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్‌, రెవెన్యూ, పశుసంవర్థక శాఖ అధికారులు సమన్వయంతో బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పర్యటించి ఎక్కడా కోడిపందేలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి కె.విద్యాసాగర్‌, ఏడీ విక్రమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:36 AM