Share News

వేడి పెంచుతున్న నిరసనలు

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:33 AM

కనీస వేతనాలు చెల్లించాలంటూ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మె గురువారం 31వ రోజుకు చేరింది. కార్యకర్తలపై ఎస్మా ప్రయోగించి నోటీసులు జారీచేసినా భయపడేది లేదంటూ సమ్మెను కొనసాగించారు.

వేడి పెంచుతున్న నిరసనలు
జగ్గయ్యపేటలో అంగన్వాడీ కార్యకర్తల మానవహారం

మచిలీపట్నం టౌన్‌/జగ్గయ్యపేట జనవరి 11 : కనీస వేతనాలు చెల్లించాలంటూ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మె గురువారం 31వ రోజుకు చేరింది. కార్యకర్తలపై ఎస్మా ప్రయోగించి నోటీసులు జారీచేసినా భయపడేది లేదంటూ సమ్మెను కొనసాగించారు. కార్యకర్తలు పలురీతిలో నిరసన దీక్షలు, ధర్నాలు, జైల్‌భరోలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సంఘ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, ప్రాజెక్టు నాయకురాలు రజనీరాణి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ ధర్నాచౌక్‌ వద్ద నిర్వహించిన దీక్షల్లో వివిధ మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యమానికి సీఐటీయూ, పలు ప్రజాసంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. 31 రోజులకు గాను శిబిరంలో పూలదండలతో నిరసన వ్యక్తం చేశారు. 31 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఫ జగ్గయ్యపేటలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసనల జోరు పెంచారు. 31వ రోజు కార్యకర్తలు మానవహారం నిర్వహించారు. కార్యకర్తలు పోర్లుదండాలు పెడుతూ, సాష్టాంగ న మస్కారాలు చేశారు. రాష్ట్రమంతా స్పందిస్తున్నా సీఎం జగన్‌కు మాత్రం చీమ కుట్టినట్టు లేదని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్మా చట్టాలు ఎన్ని తెచ్చినా ఆందోళన విరమించేది లేదని, డిమాండ్ల సాధనకు ఎంత దూరమైనా వెళతామని హెచ్చరించారు.

ఫ సీఎం జగన్‌ మౌనం వీడాలి

సమస్యలు పరిష్కరించకుంటే తాడేపల్లి ప్యాలెస్‌ ముట్టడిస్తాం

కంకిపాడు : అంగన్వాడీల నిరవధిక సమ్మెను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పట్టించుకోకుండా బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ అనుబంధ సంఘం అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత అన్నారు. కంకిపాడులో అంగన్వాడీల సమ్మెకు గురువారం ఆమె సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.10 లక్షల మంది సమ్మెలో పాల్గొంటే సంబంధిత శాఖ మంత్రి నిద్ర పోతున్నారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అంగన్వాడీలకు రూ. 4 వేల నుంచి రూ. 10500కు జీతాలను పెంచిందని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం పెంచింది కేవలం రూ. 1 వెయ్యి మాత్రమే అన్నారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగల కొడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. అవసరమైతే తాడేపల్లి ప్యాలె్‌సను ముట్టడిస్తామన్నారు. అంగన్వాడీల సమ్మెకు టీడీపీ పూర్తిగా మద్దతు ఇస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవినేని రాజా, తాడిగడప మున్సిపాలిటి అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్‌, టీడీపీ మండల అధ్యక్షులు సుదిమళ్ల రవీంద్ర, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు లలిత, నియోజకవర్గ అధ్యక్షురాలు అన్నవరపు శివపార్వతి స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:33 AM