Share News

ప్రచారాస్త్రం

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:31 AM

ఒకరిది వ్యూహం.. మరొకరిది ప్రతివ్యూహం.. ఒకవర్గం ప్రచారం.. మరొక వర్గం ప్రలోభం.. ఒకరు ఎలాగైనా పాగా వేయాలనే తాపత్రయం.. ఇంకొకరు పగ తీర్చుకోవాలనే ప్రచార తంత్రం.. ఎన్నికలకు ఇంకా 50 రోజులు ఉండగానే, జిల్లాలో అధికార, ప్రతిపక్షాలు తమ అస్త్రాలకు పదును పెట్టుకుంటున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు కదులుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటంతో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పని విభజన సులువైంది. ఆయా సామాజిక వర్గాల్లోని జిల్లా, మండలస్థాయి నాయకులను రంగంలోకి దింపి, గ్రామాల్లోకి పంపుతూ తమదైనశైలిలో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇంతకాలం అధికారం అనుభవించి, అసమ్మతివాదులను పక్కనపెట్టిన వైసీపీ నాయకులు తాజాగా వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రచారాలు, ప్రలోభాలతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి

ప్రచారాస్త్రం

జిల్లాలో అధికార, విపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలు

సామాజిక వర్గాలవారీగా టీడీపీ కూటమి ప్రచారం

గ్రామ, మండల స్థాయిలో నాయకుల నియామకం

అసమ్మతివాదులను బుజ్జగించే పనిలో వైసీపీ

పామర్రులో వైసీపీ టార్గెట్‌గా కాంగ్రెస్‌ తరఫున డీవై దాస్‌ ప్రచారం

పెడనలో సతీమణుల సమేతంగా అధికార, ప్రతిపక్ష అభ్యర్థులు

కూటమి మచిలీపట్నం ఎంపీ, అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థులపై ఉత్కంఠ

ఒకరిది వ్యూహం.. మరొకరిది ప్రతివ్యూహం.. ఒకవర్గం ప్రచారం.. మరొక వర్గం ప్రలోభం.. ఒకరు ఎలాగైనా పాగా వేయాలనే తాపత్రయం.. ఇంకొకరు పగ తీర్చుకోవాలనే ప్రచార తంత్రం.. ఎన్నికలకు ఇంకా 50 రోజులు ఉండగానే, జిల్లాలో అధికార, ప్రతిపక్షాలు తమ అస్త్రాలకు పదును పెట్టుకుంటున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు కదులుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటంతో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పని విభజన సులువైంది. ఆయా సామాజిక వర్గాల్లోని జిల్లా, మండలస్థాయి నాయకులను రంగంలోకి దింపి, గ్రామాల్లోకి పంపుతూ తమదైనశైలిలో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇంతకాలం అధికారం అనుభవించి, అసమ్మతివాదులను పక్కనపెట్టిన వైసీపీ నాయకులు తాజాగా వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రచారాలు, ప్రలోభాలతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి

బందరులో వ్యూహ.. ప్రతివ్యూహాలు

మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నాయకులు ఎన్నికల వ్యూహంతో ముందుకు కదులుతున్నారు. గ్రామాలతో పాటు నగరంలోని వార్డుల్లో పర్యటిస్తూ వైసీపీలో అసమ్మతి నాయకులను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ మచిలీపట్నం అభ్యర్థి కొల్లు రవీంద్ర ఈసారి వ్యూహం మార్చి ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇక సిటింగ్‌ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని అసమ్మతివాదుల ఇళ్లకు వెళ్లి తన తనయుడు పేర్ని కిట్టూను గెలిపించాలని కోరుతున్నారు. కానీ, ఇంతకాలం తమను పట్టించుకోకుండా.. ఎన్నికల ముందు గుర్తొచ్చామా అని అసమ్మతివాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పామర్రులో పగలు.. ప్రతీకారాలు

పామర్రు నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. అయితే, అనూహ్యంగా పామర్రు మాజీ ఎమ్మెల్యే డీవై దాస్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తానని ప్రకటించారు. ఎన్నికల కోడ్‌ రాకముందే ఆయన గ్రామాల్లో పర్యటించి తన వర్గీయుల మద్దతును కూడగడుతున్నారు. గతంలో వైసీపీలో ఉన్న డీవై దాస్‌ను అకారణంగా సస్పెండ్‌ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం ఆయన పని చేశారు. దీంతో ఆయన వైసీపీ ఓటమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగి కాంగ్రెస్‌ అభ్యర్థిగా తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల వైసీపీ ఓటుబ్యాంకుకు గండిపడే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి వర్ల కుమార్‌రాజా నియోజకవర్గంలోని గ్రామాల్లోని పెద్దలను కలుసుకుని పార్టీ గెలుపు కోసం అభ్యర్థిస్తున్నారు. ఇక వైసీపీ నాయకులు బుధవారం నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు.

పెడనలో పోటాపోటీ ప్రచారాలు

పెడన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికై, ప్రస్తుతం మంత్రిగా ఉన్న జోగి రమేశ్‌ పెనమలూరు నియోజకవర్గానికి వెళ్లిపోయారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో పెడన నుంచి తప్పించారు. ప్రస్తుతం టీడీపీ తరఫున కాగిత కృష్ణప్రసాద్‌ పోటీలో ఉన్నారు. వైసీపీ తరఫున ఉప్పాల రాము పోటీ చేస్తున్నారు. కాగిత కృష్ణప్రసాద్‌ 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం పనిచేస్తూ వచ్చారు. దీంతో టీడీపీ అధిష్ఠానం ఆయనకే మళ్లీ టికెట్‌ ఇచ్చింది. వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాము, టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్‌ ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. బీసీ ఓటర్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఎవరిని విజయం వరిస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. తమతమ సతీమణులతో కలిసి వీరు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి ఎవరు..?

మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి పేరును ఇంకా ఖరారు చేయకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎంపీ అభ్యర్థిత్వంపై జిల్లా స్థాయిలో ప్రభావం ఉండనుండటంతో ఎవరిని ప్రకటిస్తారోనని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే, ఎంపీ అభ్యర్థిగా గ్రీన్‌కో కంపెనీ డైరెక్టర్‌ బండారు నరసింహారావు పేరు వినిపిస్తుండటంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇక.. టీడీపీకి సంబంధించి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా, అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి పేరుపై ఉత్కంఠ నెలకొంది. మండలి బుద్ధప్రసాద్‌కే అవనిగడ్డ సీటును కేటాయించాలని టీడీపీ నియోజకవర్గ నాయకులు కోరుతున్నారు. అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.

Updated Date - Mar 27 , 2024 | 01:31 AM