Share News

బరులు సిద్ధం

ABN , Publish Date - Jan 14 , 2024 | 01:18 AM

అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో సంక్రాంతికి కోడి పందేల బరులను సిద్ధం చేశారు. బరుల వద్ద గుండాట, పేకాట వంటి జూదాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిని నియంత్రించాల్సిన పోలీసులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

బరులు సిద్ధం
కొత్తపల్లిలో పామాయిల్‌తోటలో ఏర్పాటు చేసిన కోడిపందేల బరి

కోడిపందేలతో పాటు గుండాట, పేకాటకు ఏర్పాట్లు

పట్టించుకోని పోలీసులు

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌, జనవరి 13: గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి గ్రామగ్రామాన కోడిపందేలు నిర్వహించేందుకు బరు లను అధికార పార్టీకి చెంది స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో భారీగా ఏర్పాటు చేస్తున్నారు. బరుల వద్దే పేకాట, గుండాటకు ఏర్పాటు చేస్తు న్నారు. ఈ ఏడాది రూ.వందకోట్లకు పైగా చేతులు మారనున్నాయని పందెంరాయుళ్లే చెబుతున్నారు. గతంలో కొత్తపల్లి, మడిచర్ల, ఓగిరాల గ్రామాల్లో కోడిపందేల్లో ఘర్షణలు చెలరేగాయి. కొన్ని రోజుల క్రితమే కొత్త పల్లిలో టీడీపీ-జనసేన బ్యానర్లను ధ్వంసం చేశారు. ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. కోడిపందేల మాటున శాంతి భద్రతలకు విఘాతం కలిగితే గ్రామాల్లో గొడవలు జరిగే ప్రమాదం ఉంది.

అంపాపురంలో కేసినోకు ప్రత్యేక ఏర్పాట్లు

రాష్ట్రంలోనే పేరుగాంచిన అంపాపురం ప్రధానబరిలో రూ.కోట్లలో పం దేలు నిర్వహించేందుకు అన్నిరకాల హంగులతో ఏర్పాట్లు చేశారు. ప్రధాన బరిలో ఒక్కో పందెం రూ.5లక్షలకు పైనే వేయనున్నారు. పక్కన 8బరుల్లో రూ.3లక్షల నుంచి రూ.50 వేల వరకూ పందేలు నిర్వహించనున్నారు. కేసినో కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందర్‌బాహర్‌ను రూ.లక్షల్లో నిర్వహించాలని చూస్తున్నారు. చిన్నకోసు(పేకాట, గుండాట)కుకోసం 15 ఏర్పాటు చేస్తున్నారు. వీటికోసం ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.4లక్షల వరకూ నిర్వాహకులు తీసుకున్నారని సమాచారం. పార్కింగ్‌, కోసుల ద్వారానే నిర్వాహకులకు పండగ మూడురోజుల్లోనేరూ.4కోట్లకు పైగా రాబడి ఉంటుందని అనుకుంటున్నారు.

జగ్గయ్యపేట ప్రాంతంలో 11కు పైగా..

జగ్గయ్యపేట: జగ్గయ్యపేట ప్రాంతంలో పోలీసుల హెచ్చ రికలు బేఖాతరు చేస్తూ పందెం బరులు సిద్ధమయ్యాయి. మండలం, పట్టణ పరిధిలో 11కి పైగా బరులు ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా చిన్న, చిన్న బరులు అనేకం ఉన్నాయి. జగ్గయ్య పేట ప్రాంతం తెలంగాణకు సరిహద్దుగా ఉండటంతో సరిహద్దు గ్రామాల్లో బరులకు డిమాండ్‌ బాగా ఉంది. బూదవాడ, జాతీయ రహదారిపై అనుమంచిపల్లి, తిరుమలగిరి, జగ్గయ్యపేట సమీపంలో సత్యనారాయ ణపురం, మంగోల్లు, వత్సవాయిల్లో బరులు సిద్ధం చేశారు.

బరులు, పేకాట శిబిరాల వద్ద బౌన్సర్లు

తిరువూరు: నియోజకవర్గంలో భారీగా కోడి పందేలు నిర్వహించేందుకు నిర్వాహకులు బరులు సిద్ధం చేస్తున్నారు. పందేలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసిన పోలీసుల వద్దకే పందేలు, పేకాల నిర్వాహణకు అనుమతుల కోసం నిర్వాహకులు వెళ్లడం గమనార్హం. గత ఏడాది ఆర్డీవో కార్యాలయం(ఎన్టీఆర్‌ స్టేడియం)పక్కనేగల మామిడి తోటలో కోడిపందేలు, పేకాట నిర్వహించారు. ఈ ఏడాది ఆ తోటలో పం దేల నిర్వాహణకు బరులు సిద్ధం చేసుకుని, స్టాల్స్‌ నిర్వహణకు అడ్వా న్సులు తీసుకుని స్థలం కేటాయింపులు పూర్తిచేసుకున్నారు. చివరి నిముషంలో ఆర్డీవో కార్యాలయం సమీపంలోని మామిడి తోటలో పందేల నిర్వాహణకు అనుమతి ఇవ్వరనే సమాచారంతో పట్టణ శివారు అష్టలక్ష్మి ఆల యం సమీపంలోని మామిడి తోటలో బరులు సిద్ధం చేశారు. స్టాల్స్‌, పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. పట్టణంలో రెండు చోట్ల, మండలంలోని కాకర్ల, మల్లేల, ముష్టికుంట్ల గ్రామాల్లో నియోజకవర్గం పరిధిలోని విస్సన్నపేట మండలంలో తాతకుంట్ల, వేమిరెడ్డిపల్లి, కొర్లమండ, తెల్లదేవరపల్లి, పుట్రాల గ్రామాల్లో, ఎ.కొండూరు మండలంలో గోపాపురం, చీమలపాడు, గంపలగూడెం మండలంలో తునికిపాడు, ఊటుకూరు, కొణిజర్ల గ్రామాల్లో కోడిపందేల నిర్వాహణకు ఏర్పాట్లు చేశారు. పట్టణంతో పాటు మండలంలోని కాకర్ల, మల్లేల గ్రామాల్లోని కోడిపందేల శిబిరాల వద్ద పేకాట శిబిరాల నిర్వహణకు పెద్దమొత్తంలో నగదుచేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. దూరప్రాంతానికి చెందిన వారు పందేల వద భారీ పేకాట శిబిరాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బరులు, పేకాట శిబిరాల వద్ద బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.

జూదగాళ్లు, అధికార పార్టీ నేతలు చేతులు కలిపి..

పామర్రు: అధికారుల ఉదాసీన వైఖరితో అడ్డాడ, పామర్రులో జూద గాళ్లు, అధికార పార్టీ చోటా నేతలతో చేతులు కలిపి పందెపు బరులు సిద్ధం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు తమవారేనని అధికార పార్టీకి చెందిన ఓ నేత జూదపురాయుళ్లకు అభయం ఇస్తున్నారని ప్రచా రం జరుగుతోంది. నిత్యం కలెక్టరు, ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు పయ నించే మచీలిపట్నం-విజయవాడ రహదారి సమీపంలోని పామర్రు మార్కెట్‌ యార్డు ఎదురుగా బరి ఏర్పాటుకు, జూదనిర్వహణకు స్టాల్స్‌, పేకాట, గుండాట శిబిరాలకు రూ.లక్షల వసూలు చేశారని తెలుస్తోంది.

Updated Date - Jan 14 , 2024 | 01:18 AM