Share News

బుసక అక్రమాలు

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:42 AM

తోట్లవల్లూరు మండలంలో ఇసుక, బుసక తవ్వకాల కోసం విచిత్రమైన రాజకీయ పొత్తులు చోటుచేసుకుంటున్నాయి. 2022లో వైసీపీ ప్రభుత్వ అండతో ఇద్దరు నాయకులు దేవరపల్లి సొసైటీ పక్క భూముల్లో బుసకను దళితులను బెదిరించి మరీ ఇష్టానుసారంగా తవ్వేశారు. వారిలో ఒకరు ప్రస్తుత ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజాకు దగ్గరై స్థానిక టీడీపీ నేతలతో జట్టుకట్టగా, గతంలో టీడీపీ నేతను హత్య చేసిన మరో క్రిమినల్‌ వైసీపీ నేతతో కలిసి తాజాగా దేవరపల్లి సొసైటీ భూములపై కన్నేశారు. బుసక తవ్వకాల పేరిట మచిలీపట్నానికి చెందిన వ్యక్తిని తెరపైకి తీసుకురాగా, అతనేమో ఓ మంత్రి అనుచరుడినని చెప్పుకొంటూ తవ్వకాలు జరిపేందుకు సిద్ధమైపోతున్నాడు.

బుసక అక్రమాలు
దేవరపల్లి సొసైటీకి తూర్పువైపు, నదీపాయ పక్కన విస్తారమైన బుసక భూములు

  • దరఖాస్తుదారుడి వెనుక వైసీపీ క్రిమినల్‌ నేత

  • ఓ మంత్రి అనుచరుడినని దరఖాస్తుదారుడి ప్రచారం

  • వైసీపీకి చెంది, టీడీపీతో అంటకాగుతున్న మరో నేత సహకారం

  • నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చే ప్రయత్నాలు

  • వ్యతిరేకంగా దేవరపల్లి సొసైటీ సభ్యులు

తోట్లవల్లూరు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : తోట్లవల్లూరు మండలం దేవరపల్లి ఎస్సీ ఫీల్డ్‌ లేబర్‌ కో-ఆపరేటీవ్స్‌ సొసైటీ సర్వే నెంబర్‌ 190లోని భూముల్లో బుసక తవ్వకాలకు మచిలీపట్నానికి చెందిన వెంకటస్వామి అనే వ్యక్తి కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని తహసీల్దార్‌ కుసుమకుమారి గతంలోనే చెప్పారు. అయితే, దరఖాస్తుదారుడు వెంకటస్వామికి దేవరపల్లి సొసైటీ భూముల్లో బుసక ఉందని ఎలా తెలిసింది..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. బుసక తవ్వకాలకు ఆయన దరఖాస్తు చేయగా, స్థానికంగా మాత్రం ఇద్దరు వైసీపీ నేతలు అతనికి జత కలవటం రాజకీయంగా దుమారం రేపుతోంది.

ఇష్టానుసారంగా..

ఈ నెల 17న దేవరపల్లి సొసైటీ భూముల వద్ద అధికారుల బృందం సర్వే నిర్వహించి జెండాలను హద్దులుగా పాతారు. జీవో నెం 59 ప్రకారం సొసైటీ సీ క్లాస్‌ భూముల్లో తవ్వకాలకు అనుమతివ్వటం కుదరదని చెప్పిన అధికారులు అందుకు విరుద్ధంగా సర్వే చేశారు. అధికారుల తీరుని, సొసైటీ సభ్యుల ఆవేదనను ‘ఆంధ్రజ్యోతి’ పలుమార్లు వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో అధికారులు అనుమతి ఇచ్చేందుకు వెనుకాడారు. అయినప్పటికీ ఇసుక, బుసకను తవ్వేందుకు దరఖాస్తుదారుడు, వైసీపీ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ క్రిమినల్‌ నేతకు మద్దతుగా ఓ గ్రామానికి చెందిన టీడీపీ అధ్యక్షుడు రంగంలోకి దిగి సొసైటీ సభ్యులను అడ్డురావొద్దని కోరినట్టు తెలిసింది. ఈ విచిత్ర రాజకీయ పొత్తులు అసలైన టీడీపీ కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. దేవరపల్లి సొసైటీ చుట్టూ ప్రభుత్వ భూముల్లో రూ.కోట్ల విలువైన ఇసుక, బుసక ఉండటంతో అందరూ కలిసిపోయారనే విమర్శలు వస్తున్నాయి. మంత్రి పేరును వాడుకుంటూ ఎలాగైనా అనుమతులు సాధించేందుకు వెంకటస్వామి ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. దీంతో అధికారులు కూడా సానుకూలంగా పనిచేస్తూ రిపోర్టులు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

Updated Date - Dec 28 , 2024 | 12:42 AM