Share News

రూ.కోటి బంగారం కొట్టేశారు

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:44 AM

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో పోలీసుల తనిఖీలు జోరుగా సాగుతున్నాయి. ఈ తనిఖీల పేరుతో కొందరు పోలీసులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నగరానికి చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి సహకారంతో సత్యనారాయణపురం పోలీసులు ఇటీవల సుమారు రూ.కోటి విలువైన బంగారం బిస్కెట్లను మాయం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రూ.కోటి బంగారం కొట్టేశారు

విజయవాడ రైల్వేస్టేషన్‌లో 3 కేజీల బంగారం పట్టివేత

బిల్లులు లేకపోవడంతో సగం నొక్కేసి మిగిలింది వెనక్కి..

(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో పోలీసుల తనిఖీలు జోరుగా సాగుతున్నాయి. ఈ తనిఖీల పేరుతో కొందరు పోలీసులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నగరానికి చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి సహకారంతో సత్యనారాయణపురం పోలీసులు ఇటీవల సుమారు రూ.కోటి విలువైన బంగారం బిస్కెట్లను మాయం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఎస్‌ఎన్‌ పురం పోలీసుల చేతివాటం

వివరాల్లోకి వెళితే.. నగరంలోని పలువురు బంగారం వ్యాపారులు పొరుగు రాష్ట్రాల నుంచి బంగారం బిస్కెట్లను తెప్పించుకోవడం ఎప్పటి నుంచో జరుగుతోంది. మన రాష్ట్రంలోని ధరలతో పోలిస్తే 22 క్యారెట్ల 100 గ్రాముల బిస్కెట్‌ సుమారు రూ.50 వేల వరకు తక్కువకు రావడమే దీనికి కారణం. కేరళ, కర్నాటకలోని వ్యాపారుల నుంచి ఈ బిస్కెట్లను కొని తెస్తుంటారు. వీటికి ఎలాంటి బిల్లులు ఉండవు. దొంగ బిల్లులతో తెచ్చేందుకు వ్యాపారులు తమకు నమ్మకమైన గుమస్తాలను వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల గవర్నరుపేటకు చెందిన ఓ బంగారం వ్యాపారి తనకు నమ్మకస్తుడైన వ్యక్తి ద్వారా రైలుమార్గంలో బిస్కెట్లను తెప్పించారు. రైల్లో వచ్చిన వ్యక్తి సుమారు రూ.2 కోట్ల విలువచేసే 3 కిలోల బంగారం బిస్కెట్లను తీసుకొచ్చాడు. సమాచారం తెలుసుకున్న సత్యనారాయణపురం పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో తనిఖీల పేరుతో ఆ వ్యక్తి వద్ద ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారానికి సంబంధించి ఎటువంటి బిల్లులు లేకపోవడంతో యజమానిని స్టేషన్‌కు పిలిపించారు. బిల్లులు లేని బంగారం కావ డంతో మొత్తం సీజ్‌ చేసి ఎన్నికల అధికారులకు అప్పగిస్తామని బెదిరించడంతో యజమాని కాళ్ల బేరానికి వచ్చారు. ఏదోలా తన బంగారం తనకు ఇప్పించాల్సిం దిగా అభ్యర్థించాడు. దీంతో పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం బిస్కెట్లలో సగం తమ వద్ద ఉంచుకుని మిగిలిన కిలోన్నర యజమానికి అప్పగించారు. సుమారు రూ.కోటి విలువైన బంగారం బిస్కెట్లను పోలీసులు నొక్కేసినా బయటకు చెప్పుకోలేక సదరు యజమాని బంధువుల వద్ద తన బాధను వెళ్లబోసుకున్నారు. పోలీసులు నొక్కేసిన కిలో బంగారం ఓ పోలీసు ఉన్నతాధికారికి చేరగా, మిగిలిన మొత్తాన్ని ఇతర పోలీసు సిబ్బంది పంచుకున్నట్లు సమాచారం. మరో దొంగతనం కేసులో క్రైం పోలీసులు ఒక నేరస్థుడి నుంచి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో విలువైన చైన్లను పక్కకు మళ్లించి, మిగతా వాటినే కేసులో రికవరీగా చూపించినట్లు సమాచారం.

Updated Date - Apr 06 , 2024 | 12:44 AM