Share News

పేకాట మాఫియా

ABN , Publish Date - May 16 , 2024 | 12:52 AM

జిల్లా కేంద్రమైన మచిలీపట్నం, పరిసర ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి పేకాట శిబిరాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నాడు. హైటెక్‌ పద్ధతుల్లో శిబిరాలను కొనసాగిస్తున్నాడు. పోలీస్‌శాఖలోని అన్ని విభాగాలను తనదారిలోకి తెచ్చుకున్నాడు. పోలీసులు దాడిచేసేందుకు వస్తుంటే ముందస్తు సమాచారం క్షణాల్లో పేకాట శిబిరం నిర్వహించే వ్యక్తికి చేరుతోంది. ఎన్నికల సమయం కావడంతో పేకాటతోపాటు ఏ పార్ట్టీ గెలుస్తుంది? ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది? అని బెట్టింగులూ ఈ శిబిరంలో నిర్వహిస్తున్నారు. శిబిర నిర్వాహకుడే మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు.

పేకాట మాఫియా

బందరు, ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో రాత్రి సమయంలో డెన్‌లు

హైటెక్‌ పద్ధతిలో రోజూ లక్షల్లో జూదం

మచిలీపట్నం మూడు స్తంభాల సెంటరు నుంచి పేకాటరాయుళ్ల తరలింపు

రోజుకో ప్రాంతంలో పేకాట.. చోద్యంచూస్తున్న పోలీసులు

జిల్లా కేంద్రమైన మచిలీపట్నం, పరిసర ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి పేకాట శిబిరాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నాడు. హైటెక్‌ పద్ధతుల్లో శిబిరాలను కొనసాగిస్తున్నాడు. పోలీస్‌శాఖలోని అన్ని విభాగాలను తనదారిలోకి తెచ్చుకున్నాడు. పోలీసులు దాడిచేసేందుకు వస్తుంటే ముందస్తు సమాచారం క్షణాల్లో పేకాట శిబిరం నిర్వహించే వ్యక్తికి చేరుతోంది. ఎన్నికల సమయం కావడంతో పేకాటతోపాటు ఏ పార్ట్టీ గెలుస్తుంది? ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది? అని బెట్టింగులూ ఈ శిబిరంలో నిర్వహిస్తున్నారు. శిబిర నిర్వాహకుడే మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : బందరు మండలం కోన, గుండుపాలెంలోని చేపలచెరువులు, గుండేరు డ్రెరున్‌గట్టుపై, చల్లపల్లి మండలం కొత్తమాజేరు, ఘంటసాల మండలం యండకుదురు గ్రామాల్లో గుండేరు డ్రెయిన్‌ గట్టు, చేపలచెరువులను వేదికగా చేసుకుని కొన్ని నెలలుగా వైసీపీ సానుభూతిపరుడు పేకాట శిబిరాన్ని ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహిస్తున్నాడు. ఒకరోజు పేకాట శిబిరం పెట్టిన ప్రాంతంలో మరో వారం రోజుల వరకు అక్కడ శిబిరం పెట్టకుండా ప్రాంతాలను మారుస్తూ ఉంటాడు. విజయవాడ, పామర్రు, గుంటూరు, రేపల్లె, కైక లూరు, గుడివాడ, మచిలీపట్నం, బాపట్ల తదితర ప్రాంతాల నుంచి ప్రతిరోజు రాత్రి 10 గంటల సమయానికి మచిలీపట్నం మూడు స్థంబాల సెంటరుకు పేకాటరాయుళ్లు 50-60 మందికిపైగా చేరుకుంటారు. వీరంతా కార్లలో వచ్చి జాతీయరహదారి పక్కనే, పెట్రోల్‌ బంకుల వద్దకార్లు పార్కింగ్‌ చేసి అక్కడ వేచి ఉంటారు.

అంతా పకడ్బందీగా..

పేకాటరాయుళ్లు ఎక్కడికి రావాలో రాత్రి 10.30 గంటల సమయంలో ఫోన్‌లలో మెసేజ్‌ పెడతారు. ఈ సమాచారం ఆధారంగా మూడు స్తంభాల సెంటరులో సిద్ధంగా ఉన్న పేకాట నిర్వహకుడి వద్ద పనిచేసే మనుషులు వీరి నుంచి నగదు కట్టించుకుని టోకెన్లు ఇస్తారు. తరువాత ఫోన్లు తీసేసుకుని ఎక్కడ పేకాట శిబిరం ఏర్పాటు చేస్తే అక్కడకు తీసుకువెళతారు. పేకాట శిబిరం వద్దకు వెళ్లాక ఫోన్లు ఇస్తారు. రోజుకు కనీసంగా రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల మేర నగదు ఈ పేకాట శిబిరంలో చేతులు మారుతోంది. పేకాటలో మొదటి రౌండ్‌లో గెలిచిన వారికి వెంటనే నగదు ఇవ్వరు. తెల్లవారుజాము మూడు, లేదా నాలుగు గంటలకు ఆట పూర్తయ్యేవరకు ఆడాల్సిందే. ఆటపూర్తయిన తరువాత గెలిచినవారికి నగదు ఇచ్చేందుకు వ్యక్తి (బ్యాంకురు) వచ్చి నగదు ఇస్తాడు. ఓడిపోయినవారికి కారు కిరాయి ఖర్చులు ఇచ్చి పంపుతారు. బ్యాంకరు అందుబాటులో లేకుంటే పేకాట శిబిరం నిర్వహించే వ్యక్తి మచిలీపట్నంలోని తన ఇంటివద్దనే నగదు ఇస్తుండటం గమనించదగ్గ అంశం.

పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని...

మచిలీపట్నం తాలూకా సర్కిల్‌ పరిధిలోనే పేకాట శిబిరాలు ఎక్కువ రోజులపాటు జరుగుతున్నాయి. తాలూకా పోలీసులు, అధికారులు ఎవ్వరూ శిబిరం వైపునకు రాకుండా అందరికీ కలిపి ఒకరోజు పేకాట శిబిరం పెడితే రూ.75వేల వరకు మామూళ్ల రూపంలో పంపుతున్నట్టు పేకాట నిర్వాహకుడు బాహాటంగానే చెబుతున్నాడు. స్పెషల్‌ బ్రాంచ్‌, ఎస్‌ఈబీ పోలీసులు దాడులు చేయకుండా ఆ కార్యాలయాల్లో పనిచేసే ఒకరిద్దరు సిబ్బందిని వేగులుగా నియమించుకున్నానని పేకాట నిర్వాహకుడు చెబుతున్నాడు. పోలీసులు దాడులు చేసేందుకు వస్తుంటే ముందస్తుగానే సమాచారం పంపేలా రోజువారీ మామూళ్లు ఇస్తున్నానని చెబుతున్నాడు. మంగ ళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి మచిలీపట్నంలో పేకాట శిబిరం నిర్వహణపై ఫిర్యాదులు అందాయి. అధికారులు వచ్చేలోపే అన్నీ సర్దేశారు. పేకాట శిబిరంపెట్టిన ప్రతిరోజు రూ.1.70 లక్షల వరకు మామూళ్లు రూపంలో పోలీసులకు ఖర్చుచేస్తున్నట్టు సమాచారం

బాధితులు ఎందరో

మచిలీపట్నం, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో నిర్వహించే పేకాట శిబిరానికి విజయవాడ, గుంటూరు, పామర్రు, గుడివాడ, తదితర ప్రాంతాల నుంచి పేకాట రాయుళ్లు తరలివస్తున్నారు. నగదు కోల్పోయిన వారి నుంచి బంగారు నగలు, ఇతరత్రాలను తాకట్టుపెట్టుకుని వడ్డీకి అప్పులు కూడా ఈ పేకాట శిబిరం నిర్వాహకుడే ఇస్తున్నాడు. పామర్రుకు చెందిన ఒక హోటల్‌ యజమాని పేకాటలో పెద్దమొత్తంలో నగదును పోగొట్టుకుని ఆర్థికంగా నష్టపోయినట్లు పేకాటరాయుళ్లు చెప్పుకుంటున్నారు. విజయవాడకు చెందిన మరో వ్యక్తి అప్పులపాలై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తోటి పేకాటరాయుళ్లు చెప్పుకుంటున్నారు. మరో వ్యక్తి పేకాటలో నగదు పోగొట్టుకుని అప్పుగా తన కారును ఉంచుకోమని మచిలీపట్నంలోనే విడిచిపెట్టి వె ళ్లడం గమనార్హం. వారంరోజులుగా రోజుకు ఈ పేకాట శిబిరంలో కోటి రూపాయలకుపైగా నగదు చేతులు మారుతుండటం గమనార్హం. పోలీసు ఉన్నతాధికారులు ఈ పేకాట శిబిరం నిర్వహించకుండా కళ్లెం వేస్తారా? లేక మిన్నకుండిపోతారో వేచిచూడాలి.

Updated Date - May 16 , 2024 | 12:52 AM