Share News

పచ్చని పల్లెపై విషం..!

ABN , Publish Date - Jul 12 , 2024 | 01:03 AM

పచ్చటి పల్లెకు ఏదో శాపం తగిలింది. కళకళలాడే గ్రామం ఐదు రోజులుగా విలవిల్లాడిపోతోంది. పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లిన గ్రామస్థులు జీవచ్ఛవాల్లా ఆసుపత్రుల్లోని మంచాలపై పడి ఉండటం చూసి కుటుంబాలకు కుటుంబాలు కన్నీరు పెడుతున్నాయి. ఇప్పటికే మృతిచెందిన వారి బంధువుల రోదనలతో కుమిలిపోయిన ఆ గ్రామం.. చికిత్స పొందుతున్న క్షతగాత్రులు ఎప్పుడు క్షేమంగా వస్తారా అని ఆశగా ఎదురుచూస్తోంది. అలా్ట్రటెక్‌ కర్మాగారం నిర్లక్ష్యం.. అధికారుల లెక్కలేనితనం.. కాంట్రాక్టర్‌ విచ్చలవిడితనం.. వెరసి బూదవాడ గ్రామం ఇంకా బోరున విలపిస్తూనే ఉంది.

పచ్చని పల్లెపై విషం..!
బూదవాడ గ్రామంలోని అలా్ట్రటెక్‌ పరిశ్రమ

అల్ర్టాటెక్‌ కర్మాగారం ఘటనతో కకావికలం

ఇద్దరు మృతి.. నలుగురి పరిస్థితి విషమం

క్షతగాత్రుల క్షేమ సమాచారం కోసం గ్రామస్థుల ఎదురుచూపులు

అందరూ పొట్టకూటి కోసం రోజుకూలీకి వెళ్లి ప్రమాదంలో పడినవారే..

వెట్టిచాకిరీ చేసినా అరకొర కూలీనే..

కంపెనీ నిర్లక్ష్యం.. అధికారుల లెక్కలేనితనం

స్థానికులకు ఉద్యోగాల నిబంధన తూచ్‌

యూపీ, బిహార్‌, జార్ఖండ్‌ కూలీలే అధికం

జగ్గయ్యపేట రూరల్‌ : బూదవాడ గ్రామానికి అమాయక గ్రామమని పేరు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు ఎవరైనా మాట్లాడితే, ‘మాకు కాదు.. బూదవాడ వాసులకు చెప్పు’ అనే సామెత సైతం గతంలో వాడుకలో ఉండేది. దీన్నిబట్టి ఇక్కడి గ్రామస్థులు ఎంత అమాయకులో అర్థమవుతుంది. చుట్టూ పచ్చటి అడవితో పాడి సంపదకు నిలయంగా కళకళలాడుతూ ఉండేది ఈ గ్రామం. కేవలం 5 వేల మంది జనాభాతో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలు అధికంగా ఉన్నా, రెండు తెలుగు రాష్ర్టాలకు సరిహద్దు గ్రామమైనా ఎక్కడా తెలంగాణ వాసన కనిపించదు. అచ్చమైన ఆంధ్రులుగా వీరు దశాబ్దాలుగా ఈ చిన్న ఊరులోనే జీవనం సాగిస్తున్నారు.

అల్ర్టాటెక్‌ రాకతో..

కాలక్రమంలో టెక్నాలజీ పెరగటం, విద్య అందుబాటులోకి రావటం, గ్రామంలో కర్మాగారం ఏర్పాటవటంతో ఇక్కడి స్వరూపమంతా మారిపోయింది. అలా్ట్రటెక్‌ సిమెంట్‌ కర్మాగార యాజమాన్య నిర్లక్ష్యం, కాంట్రాక్టర్‌ విచ్చలవిడితనం గ్రామస్థులకు శాపంగా మారింది. స్థానికులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాల్సి ఉన్నా, కంపెనీతో అంటకాగుతున్న దళారులకు కాంట్రాక్టు అప్పగించారు. స్థానికులకు కూలి పనులు కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన అప్పజెప్పి వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. మొత్తం మూడు షిఫ్టుల్లో ఒక్కో షిఫ్టుకు సుమారు 500 మందికి వరకూ ఇక్కడ పనిచేస్తున్నారు. ఎంత గొడ్డు చాకిరీ చేసినా వీరికి రోజుకు ఇచ్చేది రూ.400 నుంచి రూ.500లే. పట్టణాల్లో కూలీకి వెళ్లి రావడం కష్టంతో కూడుకున్న పని. ఇంటి పక్కనే ఉన్న కర్మాగారంలో కూలి దొరికితే చాలనుకున్న చాలామంది అమాయకులు శాశ్వత ఉద్యోగాల ప్రస్తావనే లేకుండా పనులకు వెళ్లేవారు. ఇక వీరికి పోటీగా జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌కు చెందిన వలస కార్మికులు కుప్పలు తెప్పలుగా దిగుమతి అయ్యేవారు. ఆయా శాఖల అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకున్న కర్మాగారాన్ని ప్రశ్నించే నాథుడే కరువయ్యారు. ఫలితంగా గ్రామంలో చాలామంది ఇతర రాష్ట్రాల వారు వేళ్లూనుకున్నారు. కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నా గ్రామానికి చేసింది మాత్రం శూన్యం. ఈ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో నిర్మించిన ఆసుపత్రిలోకి గానీ, ఆలయంలోకి గానీ స్థానికులను అనుమతించరంటేనే ఇక్కడ ఎంతటి పక్షపాత వైఖరి కొనసాగుతుందో తెలుస్తుంది.

ఇంకా విషమంగానే..

అల్ర్టాటెక్‌ సిమెంట్‌ కర్మాగారంలో గత ఆదివారం జరిగిన ప్రమాదంలో 16 మందికి గాయాలయ్యాయి. వీరిలో 80 నుంచి నూరుశాతం కాలిపోయిన ఆవుల వెంకటేశ్‌, బాణావతు స్వామి ఇప్పటికే మృతిచెందగా, బొంత శివనారాయణ, పరిటాల అర్జున్‌ వెంటిలేటర్‌పై ఉన్నారు. గుగులోతు గోపీనాయక్‌, బాణావత్‌ సైదా పరిస్థితి కూడా విషమంగానే ఉంది. వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 5 నుంచి 30 శాతం మేర కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న వారు ముగ్గురు ఉండగా, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌కు చెందిన ఏడుగురు విజయవాడలోని ఆంధ్ర, మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సైదాకు కాలిన గాయాలు లేకపోయినా, బూడిద గొంతులోకి వెళ్లింది. దారావతు వెంకటేశ్వరరావుకు కళ్లలో పడింది. దీంతో వీరిద్దరికీ వైద్యం అందిస్తున్నారు. పూర్తిగా కోలుకునే వరకూ ఏమీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు. వీరితో పాటు 5 నుంచి 30 శాతం మేర కాలిన గాయాలైన జార్ఖండ్‌కు చెందిన అరుణ్‌ నిషాశర్మ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన దినేష్‌కుమార్‌, నాగేంద్ర, అరవింద్‌ యాదవ్‌, గుడ్డు కుమార్‌, శుభం సోనీ, బిహార్‌కు చెందిన బిబిల్‌ సింగ్‌ చికిత్స పొందుతున్నారు. వారికే ఇప్పటికే నష్టపరిహారం అందించారు.

  • ఆధారమే లేకపోయె..

ఈయన పేరు వేముల సైదులు. భార్య అన్నపూర్ణ, కుమారుడు నారాయణరావు, కుమార్తె శైలజ. కుమార్తెకు ఇటీవల వివాహమైంది. గతంలో సమీప పట్టణంలో పనులకు వెళ్లేవాడు. నెలకు రూ.20 వేలు కూడా వచ్చేవి కావు. పనులు లేక ఫ్యాక్టరీలో రోజు కూలీగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత ఆదివారం జరిగిన ప్రమాదంలో 60 శాతం కాలిన గాయాలతో విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పేద కుటుంబానికి ఆధారమైన సైదులు ఆసుపత్రిలో ఉండగా, ఆ కుటుంబమంతా కన్నీటితో ఎదురుచూస్తోంది.

  • పోలీస్‌ కావాలని.. కూలి పనికి..

దారావతు వెంకటేశ్వరరావు.. పోలీస్‌ ఉద్యోగం కోసం ఎన్నో కలలు కన్నాడు. పలుమార్లు కానిస్టేబుల్‌, ఎస్‌ఐ సెలక్షన్లకు కూడా వెళ్లాడు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఖాళీగా ఉండటమెందుకని ఫ్యాక్టరీలో కూలీగా మారాడు. కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో చిమ్మిన పౌడర్‌ వెంకటేశ్వరరావు కళ్లలో పడింది. భార్య నాగమణి, కుమారుడు నరేంద్ర, కుమార్తె కీర్తి ఉన్నారు. పిల్లలిద్దరూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. తన కుమారుడి కళ్లకు ఏమైనా జరిగితే పరిస్థితి ఏమిటా..? అని వెంకటేశ్వరరావు తల్లిదండ్రులు నంద, లక్ష్మీ విలపిస్తున్నారు.

  • కుటుంబమంతా కన్నీరు

బాణావతు సైదా కుటుంబం పేదరికంలో ఉంది. భార్య వీరేశ్వరి, కుమారుడు సత్యారాం, కుమార్తె తేజస్వితో పాటు నాయనమ్మ చిట్టి, తల్లి మంగమ్మ, చెల్లి నాగబాల, మేనకోడలు దుర్గ బాధ్యత కూడా సైదాపైనే ఉంది. సైదా విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, క్షేమంగా రావాలని ఆ కుటుంబమంతా కోరుకుంటోంది.

  • ఎప్పుడు ఏమవుతుందో..

పరిటాల అర్జున్‌ పరిస్థితి విషమంగా ఉంది. తండ్రి వెంకటేశ్వర్లు సర్పంచ్‌గా పనిచేశారు. భార్య నాగలక్ష్మి, కుమారులు గురుసాయి, పవన్‌తేజ ఉన్నారు. ప్రస్తుతం అర్జున్‌ పరిస్థితి విషమంగా ఉందని, ఎప్పుడు దుర్వార్త వినాల్సి వస్తోందని ఆ కుటుంబం కన్నీటితో రోజులు గడుపుతోంది. పరిహారం ఇచ్చినా.. ఆ కుటుంబ భవిష్యత్తు ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆ కుటుంబానికి శాశ్వత జీవనో పాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

  • అయ్యో కొడుకా..

గుగులోతు గోపీ సంపాదనే కుటుంబానికి ఆధారం. భార్య రోజా, కుమారుడు కల్యాణ్‌, కుమార్తె మల్లిక, తల్లిదండ్రులు కూడా గోపీపైనే ఆధారపడి ఉన్నారు. ఆదివారం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గోపీ పరిస్థితి ఇప్పుడు విషమంగానే ఉంది. తన కుమారుడికి ఏమైనా జరిగితే కుటుంబం పరిస్థితి ఏమిటని ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు.

Updated Date - Jul 12 , 2024 | 01:03 AM