Share News

పోలింగ్‌కు ఈవీఎంలు సిద్ధం

ABN , Publish Date - May 03 , 2024 | 12:59 AM

ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఈవీఎం కమిషనింగ్‌ పనులను గురువారం ఎన్టీఆర్‌ జిల్లా ఎన్నికల యంత్రాంగం ప్రారంభించింది.

పోలింగ్‌కు ఈవీఎంలు సిద్ధం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఈవీఎం కమిషనింగ్‌ పనులను గురువారం ఎన్టీఆర్‌ జిల్లా ఎన్నికల యంత్రాంగం ప్రారంభించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లను ఎన్నికలకు సిద్ధం చేస్తోంది. విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గంతో పాటు, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాల పరిధిలో గురువారం రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు, జిల్లాకు ప్రత్యేకంగా నియమించిన ఎన్నికల పరిశీలకుల సమక్షంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన డిస్ర్టిబ్యూషన్‌ కమ్‌ రిసెప్షన్‌ సెంటర్లలో ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఈవీఎంల రెండోదశ ర్యాండమైజేషన్‌ పూర్తవడంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజవర్గాలకు ఓట్లు వేయటానికి అవసరమైన మేరకు, రిజర్వుగా ఉంచిన ఈవీఎంలలో బ్యాలెట్‌ నింపే కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఖరారు చేసిన తుది అభ్యర్థులు, వారికి కేటాయించిన ఎన్నికల గుర్తుల ప్రాతిపదికన బ్యాలెట్లను ఈవీఎంలలో ఏర్పాటు చేస్తున్నారు.

ఈవీఎంలు, వీవీప్యాట్ల కేటాయింపు ఇలా

జిల్లా వ్యాప్తంగా 1781 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 2147 బ్యాలెట్‌ యూనిట్లను(బీయూ), 2147 కంట్రోల్‌ యూనిట్లను(సీయూ), 2324 వీవీప్యాట్లను కేటాయించారు. రిజర్వులో మరో 611 బీయూ, 45 సీయూ, 308 వీవీప్యాట్లను ఉంచుతున్నారు. వీటన్నింటిలోనూ బ్యాలెట్‌ పేపర్లు నింపడం, సింబల్‌ లోడింగ్‌ ప్రక్రియను చేపట్టారు. తిరువూరుకు 280 బీయూ, 280 సీయూ, 304 వీవీ ప్యాట్లను కేటాయించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి 303 బీయూ, 303 సీయూ, 328 వీవీ ప్యాట్లు, సెంట్రల్‌కు 321 బీయూ, 321 సీయూ, 346 వీవీ ప్యాట్లు, తూర్పుకు 357 బీయూ, 357 సీయూ, 387 వీవీ ప్యాట్లు, మైలవరానికి 354 బీయూ, 354 సీయూ, 383 వీవీ ప్యాట్లు, నందిగామకు 266 బీయూ, 266 సీయూ, 288 వీవీప్యాట్లు, జగ్గయ్యపేటకు 266 బీయూ, 266 సీయూ, 288 వీవీప్యాట్లను కేటాయించారు. ఈ 7 నియోజకవర్గాలకు కలిపి 644 బీయూ, 45 సీయూ, 349 వీవీప్యాట్లను రిజర్వులో ఉంచుతున్నారు. పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 4,294 బీయూ, 4,294 సీయూ, 4,648 వీవీ ప్యాట్లను, అదనంగా 1255 బీయూ, 91 సీయూ, 657 వీవీప్యాట్లను కేటాయించారు. కమిషనింగ్‌ ప్రక్రియ రెండు రోజుల్లో నూరుశాతం పూర్తవుతుంది.

కమిషనింగ్‌ను పరిశీలించిన నీనా నిగమ్‌

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గాంధీజీ మునిసిపల్‌ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న ఈవీఎంల కమిషనింగ్‌ ప్రక్రియను రాష్ట్ర ప్రత్యేక ఎన్నికల వ్యయ పరిశీలకురాలు నీనా నిగమ్‌ పరిశీలించారు. ఎన్టీఆర్‌ జిల్లా ఎన్నికల అధికారి దిల్లీరావు ప్రక్రియను ఆమెకు వివరించారు. ఎన్నిలను పారదర్శకంగా, నిస్పక్షపాతంగా నిర్వహించటంలో ఈవీఎం కమిషనింగ్‌ ముఖ్యమని ఆమె అన్నారు. కమిషనింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

ఈవీఎం కమిషనింగ్‌లో భాగంగా..

ఈవీఎంలలో కంట్రోల్‌ యూనిట్‌తో అనుసంధానించే బ్యాలెట్‌ యూనిట్‌ను ఓపెన్‌ చేసి అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన బ్యాలెట్‌ పేపర్లను వేర్వేరు బ్యాలెట్‌ యూనిట్లలో ఏర్పాటు చేశారు. బ్యాలెట్‌ను లోడ్‌ చేశాక, ఽథంబ్‌ వీల్‌ సెట్టింగ్‌, మాస్కింగ్‌, అడ్రెస్‌ ట్యాగింగ్‌ చేశారు. ఈ రెండూ అనుసంధానమయ్యే కంట్రోల్‌ యూనిట్‌లో బ్యాలెట్‌ పేపర్‌ ప్రకారం క్యాండిడేట్‌ సెట్టింగ్‌, సీలింగ్‌ ఆఫ్‌ క్యాండిడేట్‌ సెట్‌ చేపట్టారు. ఈ ప్రక్రియతో పాటు సమాంతరంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన వీవీ ప్యాట్ల కమిషనింగ్‌ చేపట్టారు. వీవీ ప్యాట్ల కమిషనింగ్‌లో భాగంగా వాటిలో సింబల్‌ లోడింగ్‌ చేశారు. బ్యాలెట్‌ పేపర్‌ ప్రకారం అభ్యర్థుల సింబల్‌ లోడింగ్‌ చేపట్టారు. స్లిప్పుల కోసం పేపర్‌ రోల్స్‌ సెట్‌ చేశారు. పవర్‌ ప్యాక్‌, సీలింగ్‌ ఆఫ్‌ పేపర్‌ రోల్‌ వంటివి నిర్వహించారు.

Updated Date - May 03 , 2024 | 12:59 AM