రోడ్లపైనే ధాన్యం రాశులు
ABN , Publish Date - Nov 28 , 2024 | 01:02 AM
మండలంలోని బొమ్ములూరు, లింగవరం, వలివర్తిపాడులో కొనే నాథుడు లేక యంత్రాలతో కోసిన ధాన్యాన్ని రైతులు రహదారుల వెంట రాశులుగా పోసి ఉం చారు.

తేమశాతం ఎక్కువగా ఉండడంతో రైతుసేవా కేంద్రాల్లో కొనుగోలు చేయని సిబ్బంది
తుఫాను హెచ్చరికలతో తక్కువ ధరకే మిల్లర్లకు అమ్మకం
గుడివాడ రూరల్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బొమ్ములూరు, లింగవరం, వలివర్తిపాడులో కొనే నాథుడు లేక యంత్రాలతో కోసిన ధాన్యాన్ని రైతులు రహదారుల వెంట రాశులుగా పోసి ఉం చారు. యంత్రాలతో కోయడంతో తేమశాతం ఎక్కువగా ఉంటోంది. ఆర్బీకేల్లోని రైతు సేవా కేంద్రాలకు తీసుకెళితే తేమశాతం ఎక్కువగా ఉండడంతో కొనడం లేదు. ఆరబెట్టి తీసుకురావాలని వారు సూచిస్తున్నారు. ప్రభుత్వం బస్తాకు రూ.1730కు కొనుగోలు చేయాలి. తుఫాను హెచ్చరికలతో ఆరబె ట్టుకోవాలంటే రైతులు భయపడుతున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని మిల్లర్లు రూ.1300 నుంచి రూ.1400కు రైతుల దగ్గర కొనుగోలు చేస్తున్నారు. చేసేది లేక రైతులు మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. ఎకరానికి రూ.10 వేలు నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. అధికారులు వచ్చినప్పుడు సక్రమంగానే కొనుగోళ్లు చేస్తున్నామని మిల్లర్లు చెబుతున్నారని, వారు వెళ్లిపోయాక ఇబ్బంది పెడుతున్నారని రైతులు అంటున్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో చాలా మంది రైతులు రోడ్ల వెంబడి ధాన్యం పోసుకుని పరదాలు కప్పుకొంటున్నారు. భారీ వర్షం వస్తే పొలాల నుంచి ధాన్యం రాశులు బయటికి రావనే భయంతో యంత్రాల ద్వారా కోసిన ధాన్యాన్ని రోడ్లపైన, పొలాల డొంకలపైన ఆరబెట్టుకుంటున్నారు. రైతుసేవా కేంద్రా ల్లో తేమశాతం చూసే పరికరాలు సరిగా లేవని, మిల్లర్ల నుంచి సరిపడా సంచులు అందించలేకపోతున్నారని, ట్రాన్స్‌పోర్టు వాహనాలు దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి ధాన్యం సంచులు సరఫరా చేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
మిల్లర్లు దోచుకుంటున్నారు: సీపీఎం
ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలకు వాస్తవానికి చాలా వ్యత్యాసం కనిపిస్తోందని సీపీఎం మండల కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి విమర్శించారు. బుధవారం సీపీఎం, రైతు సంఘం నాయకులు లింగవరంలో పంట పొలాలను, ధాన్యం రాశులను పరిశీలించారు. మిల్లర్లు రైతులను ఇష్టమొచ్చినట్లు దోచుకుంటున్నారని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. తేమ శాతం ఎక్కువగా ఉందని ప్రభుత్వ రేటు ఇవ్వడం లేదని, సంచులూ రైతులకు దొరకటం లేదని ఆర్సీపీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంఘం నాయకులు నీలం మురళీకృష్ణారెడ్డి, సీఐటీయూ నాయకులు రేపాని కొండ, సింగవరపు రాంబాబు, వెంకటేష్ పాల్గొన్నారు.
సరిపడా సంచులు సరఫరా చేస్తాం: తహసీల్దార్
కొరత లేకుండా రైతులకు ధాన్యం సంచులు సరఫరా చేస్తామని తహసీల్దార్ రామకోటేశ్వరరావు తెలిపారు. చిరుచింతలో రోడ్లపై ఉన్న ధాన్యం రాశులను తహసీల్దార్ పరిశీలించారు. రైతులతో చర్చలు జరిపారు. ఎన్ని ఎకరాలు పండించారు, ఎన్ని సంచులు కావాల్సి వస్తున్నా యో వివరాలు తెలుసుకుని మిల్లర్లతో మాట్లాడారు. పండించిన ధాన్యం వర్షానికి తడవకుండా తగుచర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మండల వ్యవసాయాధికారిణి బోలెం అనంతలక్ష్మి, డీటీ కిరణ్, ఆర్‌ఐ నాగబాబు, చిరుచింతల రైతులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.