Share News

ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌ వస్తే.. మళ్లీ దాడి

ABN , Publish Date - May 03 , 2024 | 12:44 AM

జనసేన కార్యకర్త కర్రి మహేష్‌ కుటుంబసభ్యులపై వైసీపీ నాయకులు దాడిచేసిన ఘటనలో పోలీసుల తీరుపై మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన ఇన్‌చార్జి బండి రామకృష్ణలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌ వస్తే.. మళ్లీ దాడి
ఎస్పీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు, బాధితుల ఆందోళన..

  • పోలీసుల నిర్లక్ష్యంపై బాధితుల ఆగ్రహం

  • అన్ని ఆధారాలతో ఎన్నికల సంఘం, గవర్నర్‌,

  • డీజీపీకి ఫిర్యాదు చేస్తాం : బాలశౌరి, రవీంద్ర

  • ఎస్పీ కార్యాలయం ఎదుట నేతల ఆందోళన

  • తక్షణం కేసులు నమోదు చేయాలని డిమాండ్‌

  • ఎమ్మెల్యే పేర్ని నాని ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరిక

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జనసేన కార్యకర్త కర్రి మహేష్‌ కుటుంబసభ్యులపై వైసీపీ నాయకులు దాడిచేసిన ఘటనలో పోలీసుల తీరుపై మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన ఇన్‌చార్జి బండి రామకృష్ణలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మూకదాడిపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌ వస్తే పోలీసుల ఎదుటే వైసీపీ కార్యకర్తలు వారిపై దాడిచేయడంతో విషయం తెలుసుకున్న వల్లభనేని బాలశౌరి, కొల్లు రవీంద్ర, బండి రామకృష్ణ, పార్టీశ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. నిందితులపై కేసునమోదు చేయాలంటూ ఆందోళనకు దిగారు. దాడిలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలపైనా, ఎమ్మెల్యే పేర్నినాని, పేర్నికిట్టుపై కేసులు నమోదుచేయాలని ఎస్పీతో ఫోన్‌లో బాలశౌరి, కొల్లురవీంద్ర మాట్లాడారు. వైసీపీ నాయకులు నా బీసీలు, నా ఎస్సీలు అని ఒకవైపు చెబుతూనే బీసీలపై దాడికి పాల్పడ్డారన్నారు. బాధితుల కులవృత్తి, ఆచారాలను కించపరుస్తూ మాట్లాడారని ఆరోపించారు. మహేశ్‌ కుటుంబసభ్యులపై పేర్నికిట్టు సమక్షంలోనే దాడి జరిగిందని మహిళల మెడలోని తాళిబొట్టు సైతం లాగేందుకు ప్రయత్నించడంతో పాటు, విచక్షణా రహితంగా దాడిచేశారని అన్నారు. ఆధారాలు, పోలీ్‌సస్టేషన్‌ వద్ద ఉన్నసీసీ పుటేజీని పరిశీలనచేసి నిందితులపై కేసు నమోదు చేయాలన్నారు. ఘటనకు సంబంధించిన అన్ని సాక్ష్యాలతో ఎన్నికల సంఘానికి, గవర్నర్‌కు, డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. దీనికి బాధ్యులు, నిందితులపై కేసులు నమోదుచేయకుంటే, శుక్రవారం పేర్నినాని ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. ఓడిపోతున్నామనే భయం వైసీపీ నాయకుల్లో వచ్చిందని, దీంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, గందరగోళ పరిస్థితులను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ ఘటనపై బాధితుల నుంచి మచిలీపట్నం డీఎస్పీ అబ్ధుల్‌ సుబానీ, సీఐ శ్రీనవాసయాదవ్‌ ఫిర్యాదు తీసుకుని నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో జనసేన, టీడీపీ నాయకులు ఎస్పీ కార్యాలయం నుంచి వెనుదిరిగారు. అనంతరం ఎంపీ బాలశౌరి, కొల్లురవీంద్ర మహేశ్‌ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. తమపై విచక్షణా రహితంగా దాడిచేశారని మహిళలు నేతల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.

Updated Date - May 03 , 2024 | 12:44 AM