Share News

మోతాదుకు మించి..

ABN , Publish Date - Jul 28 , 2024 | 01:13 AM

డుగ్‌.. డుగ్‌.. డుగ్‌మని సౌండ్‌ చేసుకుంటూ రివ్వున దూసుకుపోయేవి ఒకరకం బుల్లెట్లైతే.. భారీ బాంబులను పేలిన శబ్దాలతో భయపెట్టేవి మరోరకం బుల్లెట్లు.. నేటి కుర్రకారుకు ఇది స్టేటస్‌ సింబల్‌ అయితే, వాహనదారులు, పాదచారులకు మాత్రం గుండెల్లో దడపుట్టించే భారీ ధ్వనికాలుష్యం. ట్రాఫిక్‌ పోలీసులు అప్పుడప్పుడు చర్యలు తీసుకుంటున్నా.. సదరు సైలెన్సర్లను తుక్కు చేస్తున్నా.. ఈ విష సంస్కృతి మాత్రం నగరంలో నానాటికీ పెరుగుతూనే ఉంది.

మోతాదుకు మించి..

నగరంలో శ్రుతిమించుతున్న బుల్లెట్‌ సైలెన్సర్ల శబ్దాలు

పాదచారులు, వాహనదారులను భయపెడుతూ విన్యాసాలు

సైలెన్సర్లు మార్చేసి భారీ శబ్దాలు వచ్చేవి అమరిక

పోలీసు హెచ్చరికలను ఖాతరు చేయని సర్వీసింగ్‌ సెంటర్లు

యువత చేష్టలతో వణికిపోతున్న నగరవాసులు

డుగ్‌.. డుగ్‌.. డుగ్‌మని సౌండ్‌ చేసుకుంటూ రివ్వున దూసుకుపోయేవి ఒకరకం బుల్లెట్లైతే.. భారీ బాంబులను పేలిన శబ్దాలతో భయపెట్టేవి మరోరకం బుల్లెట్లు.. నేటి కుర్రకారుకు ఇది స్టేటస్‌ సింబల్‌ అయితే, వాహనదారులు, పాదచారులకు మాత్రం గుండెల్లో దడపుట్టించే భారీ ధ్వనికాలుష్యం. ట్రాఫిక్‌ పోలీసులు అప్పుడప్పుడు చర్యలు తీసుకుంటున్నా.. సదరు సైలెన్సర్లను తుక్కు చేస్తున్నా.. ఈ విష సంస్కృతి మాత్రం నగరంలో నానాటికీ పెరుగుతూనే ఉంది.

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : స్టేటస్‌ సింబల్‌గా మారిన బుల్లెట్‌ బైకులపై యువకులు చేస్తున్న విన్యాసాలు గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. బుల్లెట్లకు భారీ శబ్దాలు వచ్చే సైలెన్సర్లను ఏర్పాటు చేసుకుని వాహనచోదకులు, పాదచారులను భయపెడుతున్నారు. జనావాసాల మధ్య, ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బాంబులు పేలిన శబ్దాలు చేస్తున్నారు. నగరంలో ఈ పేలుడు ఓ ఫ్యాషన్‌గా మారింది. ఇప్పటికే ధ్వనికాలుష్యంతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు బుల్లెట్ల మోత చెవులు చిల్లులు పడేలా చేస్తోంది.

మోడల్‌కు తగ్గట్టుగా మార్పులు

బుల్లెట్‌లో ఏడెనిమిది రకాలున్నాయి. క్లాసిక్‌ 350, హంటర్‌ 350, బుల్లెట్‌ 350, హిమాలయ, థండర్‌ స్ట్రామ్‌, జీటీ 650 మోడళ్లు ఉన్నాయి. వాటిలో క్లాసిక్‌, హంటర్‌, బుల్లెట్‌ మోడళ్లను ఎక్కువగా కొంటున్నారు. వీటి ధర సుమారు రూ.2.48 లక్షల వరకు ఉంటుంది. ఇవికాకుండా 2016-2019 మోడళ్ల బుల్లెట్లు కొన్ని ఉన్నాయి. వాటికి హ్యాండిల్‌ కుడివైపున ఇంజన్‌ ఆన్‌-ఆఫ్‌ స్విచ్‌ ఉంటుంది. బుల్లెట్‌ను స్టార్ట్‌ చేసిన తర్వాత ఎక్స్‌లేటర్‌ ఇచ్చి వేగం పెంచుతున్నారు. ఆ సమయంలో ఈ బటన్‌ను ఆన్‌-ఆఫ్‌ చేస్తున్నారు. ఇలా పదేపదే చేయడంతో బాంబు పేలిన శబ్దాలు వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లోకి బీఏ6 మోడల్‌ బుల్లెట్లు వస్తున్నాయి. వాటికి ఆన్‌-ఆఫ్‌ స్విచ్‌ను గుండ్రంగా ఇస్తున్నారు. ఇంజన్‌ స్టార్ట్‌ కావాలంటే దీనికి ఉండే కొనను పైకి నెట్టాలి. ఆగిపోవాలంటే.. కిందకు జరపాలి. పాత బుల్లెట్ల మాదిరిగా ఆన్‌-ఆఫ్‌ చేసినా బాంబు పేలిన శబ్దం మాత్రం రాదు. దీంతో కుర్రకారు ఆన్‌-ఆఫ్‌ స్విచ్‌లను మార్చేస్తోంది. దీంతో పాటు కంపెనీ ఇన్‌బిల్ట్‌గా ఇచ్చిన సైలెన్సర్లను తీయించేస్తున్నారు. రూ.3 వేల నుంచి రూ.12 వేల విలువ కలిగిన ఎగ్జాస్టర్‌ సైలెన్సర్లను కొంటున్నారు. నగరంలో ఉన్న బుల్లెట్‌ సర్వీసింగ్‌ సెంటర్లలో వాటిని అమర్చుకుంటున్నారు. ఇలా చేసినందుకు సర్వీసింగ్‌ సెంటర్లు రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నాయి. కొత్తగా మార్కెట్లోకి వస్తున్న బీఎస్‌6 మోడల్‌ బుల్లెట్లలో ఏబీఎస్‌ (ఆటోమెటిక్‌ బ్రేక్‌ సిస్టం) ఉంటుంది. ఇంజన్‌ ఆన్‌-ఆఫ్‌ బటన్‌, ఎగ్జాస్టర్‌ సైలెన్సర్లను అమర్చుకోవాలంటే ఈ ఏబీఎస్‌ను తొలగిస్తున్నారు.

హెచ్చరికలతోనే సరి

ట్రాఫిక్‌ పోలీసులు కొద్దిరోజుల క్రితం 297 బుల్లెట్లకు ఉన్న భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లను తొలగించి రోడ్డు రోలర్‌తో తొక్కించారు. ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఇలాంటి చర్యలు తీసుకున్నారు. ఇలా చేసిన కొన్ని రోజులు మాత్రం కుర్రాళ్లు సైలెంట్‌గా ఉంటున్నారు. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మామూలుగానే ఉంటోంది. ఇంటర్మీడియెట్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌, పీజీ చేసే విద్యార్థులు బుల్లెట్లను ఒక స్టేటస్‌ సింబల్‌గా భావిస్తున్నారు. తల్లిదండ్రులను ఏదోలా ఒప్పించుకుని ఖరీదైన బుల్లెట్లను కొంటున్నారు. తర్వాత వాటి నామరూపాలు మార్చేస్తున్నారు. షోరూంల్లో నుంచి బుల్లెట్లను బయటకు తీసుకురాగానే సర్వీసింగ్‌ సెంటర్లకు తీసుకెళ్తున్నారు. కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లను తీయించేసి భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లను అమర్చుకుంటున్నారు. ఇందుకోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎగ్జాస్టర్ల ఏర్పాటు నిషేధం. అయినా సర్వీసింగ్‌ సెంటర్ల నిర్వాహకులు బెంగళూరు, ముంబయి, ఢిల్లీ నుంచి ఎగ్జాస్టర్లను తెప్పించి విచ్చలవిడిగా అమరుస్తున్నారు. పోలీసులు, రవాణా శాఖ అధికారులు సర్వీసింగ్‌ సెంటర్లను కట్టడి చేయకపోతే సైలెన్సర్లను తొక్కించడానికి ఎన్ని రోలర్లు ఉపయోగించినా ఫలితం ఏముంటుందని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Jul 28 , 2024 | 01:13 AM