Share News

బయట.. భయం..!

ABN , Publish Date - Feb 12 , 2024 | 01:20 AM

ఉత్తరాంధ్రకు చెందిన ఓ యువకుడు విజయవాడకు వచ్చి ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు. సత్యనారాయణపురంలో ఒక గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. కొద్దిరోజుల క్రితం ద్విచక్ర వాహనాన్ని ఇంటి ముందు పార్క్‌ చేశాడు. అర్ధరాత్రి మెళుకువ రావడంతో బయటకు వచ్చి చూడగా వాహనం కనిపించలేదు.

బయట.. భయం..!

ఇళ్ల ముందున్న వాహనాలు మాయం

అన్నీ ద్విచక్ర వాహనాలే

అర్ధరాత్రి పూట నేరగాళ్ల సంచారం

అంతా యువకులే

వ్యసనాల ఖర్చుల కోసం చోరీలు

(ఆంధ్రజ్యోతి - విజయవాడ) ఉత్తరాంధ్రకు చెందిన ఓ యువకుడు విజయవాడకు వచ్చి ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు. సత్యనారాయణపురంలో ఒక గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. కొద్దిరోజుల క్రితం ద్విచక్ర వాహనాన్ని ఇంటి ముందు పార్క్‌ చేశాడు. అర్ధరాత్రి మెళుకువ రావడంతో బయటకు వచ్చి చూడగా వాహనం కనిపించలేదు.

నగరానికి చెందిన ఓ వ్యక్తి ఊరు వెళ్లడం కోసం పీఎన్‌బీఎస్‌కు వెళ్లాడు. అక్కడ వాహనాన్ని పార్క్‌ చేసుకుని ఊరు వెళ్లాడు. తిరిగి వచ్చి చూసుకునే సరికి ఇక్కడ వాహనం కనిపించలేదు.

మధ్యతరగతి వర్గాలకు బైక్‌ ఉంటేనే బతుకు బండి నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న ద్విచక్ర వాహనానికి మరమ్మత్తులు చేయించుకుని ఉపయోగించు కోవడం తప్ప కొత్త వాహనం కొనుగోలు జోలికి వెళ్లలేకపోతున్నారు. ప్రతినెలా బడ్జెట్‌ను కేటాయించుకుని సంసార నావను లాగాల్సి వస్తోంది. వ్యసనపరులు మధ్యతరగతి వర్గాల ప్రణాళికలను చెల్లాచెదురు చేస్తున్నారు. ఈ వర్గాల ప్రజలను టార్గెట్‌ చేసుకుని వరుస చోరీలు చేస్తున్నారు. ఇళ్ల ముందు పార్క్‌ చేసిన వాహనాలను దొంగిలిసున్నారు. వ్యసనాల ఖర్చుల కోసం వాకిట్లో ఉంచిన వాహనాలను మాయం చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఈ చోరీలతో వాహనదారులు భయపడిపోతున్నారు.

ఎవరీ దొంగలు?

ఒక బైక్‌పై ఇద్దరు, ముగ్గురు నగరంలోని టార్గెట్‌ చేసుకున్న ప్రదేశాల్లో తిరుగుతున్నారు. అర్ధరాత్రి వరకు తిరుగుతూ వీధులను పరిశీలిస్తున్నారు. రాత్రి రెండు, మూడు గంటల ప్రాంతంలో వాహనాలను మాయం చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో వాహనాలు కొంతదూరం వరకు మాత్రమే వెళ్లాయి. కొంతమంది కొండ ప్రాంతానికి దిగువన ఉన్న ప్రదేశంలో వాహనాలను నిలుపుదల చేస్తారు. మరికొందరు రహదారి ఉన్నంత వరకు తీసుకెళ్లి అక్కడ నిలుపుదల చేసుకుంటారు. దీనికి భిన్నంగా నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఉంటుంది. కృష్ణలంక, రాణిగారితోట, రామలింగేశ్వరనగర్‌, సత్యనారాయణపురం, టూటౌన్‌, వన్‌టౌన్‌, భవానీపురంలో కొన్ని ప్రాంతాల్లో వాహనాలను ఇంటి వరండాలో పెట్టుకునే ప్రదేశం ఉండదు. దీంతో వారు వీధుల్లోనే ఇంటి బయట వాహనాలను నిలుపుదల చేసుకుంటారు. కొంతమంది వాహనదారులు ఇంటి ముందే బైకులు పార్క్‌ చేశామన్న ధీమాతో వాటికి హ్యాండిల్‌ లాక్‌లు వేయడం లేదు. భౌగోళికంగా ఉన్న పరిస్థితులను నేరగాళ్లు అవకాశంగా మార్చుకుంటున్నారు. మద్యం, గంజాయి, అమ్మాయిలు వంటి వ్యసనాలకు అలవాటు పడిన యువకులు ఈ తరహా నేరాలకు దిగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇద్దరు, ముగ్గురు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడుతున్నారు. సత్యనారాయణపురం, ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వద్ద ఉన్న ఫుడ్‌కోర్టులో అర్ధరాత్రి వరకు గడుపుతున్నారు. ఆ తర్వాత ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని అక్కడికి బయలుదేరుతు న్నారు. ఆయా వీధుల్లో రెండు, మూడు రౌండ్లు వేసిన తర్వాత పరిస్థితిపై ఒక అంచనాకు వస్తున్నారు. ముందుగా వాహనా లకు తాళాలు వేసి ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఆ వాహనాలకు హ్యాండిల్‌ లాక్‌ వేయలేదంటే ఏ మాత్రం కష్టపడ కుండా వాహనాన్ని మాయం చేస్తున్నారు. ఒకరు దొంగిలించిన వాహనం ఉంటే, మిగిలిన ఇద్దరూ ఆ వాహనాన్ని లాక్కుంటూ వెళ్లిపోతున్నారు. రెండు, మూడు రోజులపాటు ఒక రహస్య ప్రదేశంలో ఉంచిన తర్వాత ఆ వాహనాలను నగర సరిహద్దుల నుంచి దాటించేస్తున్నారని తెలుస్తోంది. ఇతర జిల్లాలకు తీసుకెళ్లి మెకానిక్‌లకు విక్రయించడమో, తాకట్టు పెట్టడమో చేస్తున్నారు. ఇలా సంపాదించిన డబ్బుతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. చోరీలకు వెళ్లినప్పుడు ఉపయోగించే వాహ నాల్లో పెట్రోలును ప్రజల వాహనాల నుంచి దొంగిలిస్తున్నారు.

Updated Date - Feb 12 , 2024 | 01:20 AM