Share News

బయటపడుతున్న బదిలీలలు

ABN , Publish Date - Jun 09 , 2024 | 01:29 AM

తీగ లాగితే డొంకంతా కదిలినట్టు.. మాజీమంత్రి బొత్స సత్యనారాయణ పేషీ నుంచి గత ప్రభుత్వం విడుదల చేసిన టీచర్ల బదిలీల సిఫార్సు లేఖల కథంతా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. వెబ్‌ కౌన్సెలింగ్‌తో సంబంధం లేకుండా చేసిన ఈ బదిలీలకు ప్రస్తుత ప్రభుత్వం బ్రేక్‌ వేయటంతో బొత్స పేషీలో రూ.లక్షలు ముట్టజెప్పి సిఫార్సు లేఖలు తెచ్చుకున్నవారు కంగుతిన్నారు. ఈ బదిలీల కోసం ఒక్కొక్కరు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల మేర చెల్లించారని, ఈ మొత్తం తంతులో ఇద్దరు యూనియన్‌ నాయకుల హస్తం ఉందనే విషయాలు ఇప్పుడు ఉమ్మడి కృష్ణాజిల్లా టీచర్ల బదిలీల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

బయటపడుతున్న బదిలీలలు

మాజీమంత్రి బొత్స సిఫార్సు లేఖల బదిలీలకు బ్రేక్‌

జూనిలిచిన టీచర్ల సిఫార్సు బదిలీలు.. బయటపడిన అవినీతి

క్కో బదిలీకి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వసూలు

విజయవాడలో చక్రం తిప్పిన ఇద్దరు యూనియన్‌ నేతలు

డీఈవో కార్యాలయానికీ అందిన ముడుపులు

జిల్లాలో తొలి విడతలో 90 మంది, మలివిడతలో 50 మంది బదిలీ

కొత్త ప్రభుత్వ నిర్ణయంతో సిఫార్సు టీచర్లకు షాక్‌

తీగ లాగితే డొంకంతా కదిలినట్టు.. మాజీమంత్రి బొత్స సత్యనారాయణ పేషీ నుంచి గత ప్రభుత్వం విడుదల చేసిన టీచర్ల బదిలీల సిఫార్సు లేఖల కథంతా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. వెబ్‌ కౌన్సెలింగ్‌తో సంబంధం లేకుండా చేసిన ఈ బదిలీలకు ప్రస్తుత ప్రభుత్వం బ్రేక్‌ వేయటంతో బొత్స పేషీలో రూ.లక్షలు ముట్టజెప్పి సిఫార్సు లేఖలు తెచ్చుకున్నవారు కంగుతిన్నారు. ఈ బదిలీల కోసం ఒక్కొక్కరు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల మేర చెల్లించారని, ఈ మొత్తం తంతులో ఇద్దరు యూనియన్‌ నాయకుల హస్తం ఉందనే విషయాలు ఇప్పుడు ఉమ్మడి కృష్ణాజిల్లా టీచర్ల బదిలీల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : టీచర్ల సాధారణ బదిలీల్లో భాగంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో 2023-జూన్‌లో 3వేల మంది టీచర్లను వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల నిష్పత్తిని ఆధారంగా చేసుకుని, జీవో నెంబరు 117 ప్రకారం ఈ బదిలీలు నిర్వహించారు. ఈ సమయంలో హెచ్‌ఆర్‌ఏ అధికంగా వచ్చే కీలక ప్రాంతాల్లోని పాఠశాలల్లో కొన్ని పోస్టులను ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఈవో కార్యాలయ అధికారులు బ్లాక్‌లో పెట్టారు. వీటిని పక్కనపెట్టి ఖాళీ చూపిన పాఠశాలల్లోకి టీచర్లను బదిలీ చేశారు. దీనిప్రకారం సీనియారిటీ ఉన్న టీచర్లు సైతం 100 నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లోని పాఠశాలలకు బదిలీపై వెళ్లాల్సి వచ్చింది. ఈ ప్రక్రియపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకోలేదు.

బొత్స పేషీ నుంచి సిఫార్సు లేఖలు

బదిలీల ప్రక్రియ ముగిసిన అనంతరం ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు ఇచ్చిన సిఫార్సు లేఖలను బయటకు తీశారు. వాటిని ఆధారంగా చేసుకుని విద్యాశాఖ మాజీమంత్రి బొత్స సత్యనారాయణ పేషీ నుంచి బదిలీలు మొదలుపెట్టారు. గత ఆగస్టు నుంచి డిసెంబరు వరకు మంత్రి పేషీ నుంచి ఉమ్మడి కృష్ణాజిల్లాలోని 90 మంది వరకు టీచర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరిలో కొంతమందికి పోస్టింగ్‌ ఇచ్చి, ఏప్రిల్‌లో రిలీవ్‌ కావాలని చెప్పారు. మరికొంతమందికి బదిలీ ఉత్తర్వులు ఇవ్వకుండా డీఈవో కార్యాలయ అధికారులు జాప్యం చేశారు. ఈలోగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో వీరికి కేటా యించిన పాఠశాలల్లో చేరినట్లుగా చూపడానికి అవకాశం లేకుండా పోయింది. గత జనవరి, ఫిబ్రవరిలో జిల్లాలోని 50 మంది టీచర్లు బొత్స పేషీ నుంచి సిఫార్సు లే ఖలు తెచ్చుకున్నారు. కోడ్‌ అమల్లోకి రావడంతో వీరందరికీ డీఈవో కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాలేదు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఏర్పడటంతో కొంతమంది ఎమ్మెల్సీలు గత ప్రభుత్వంలో బొత్స పేషీ నుంచి విడుదలైన టీచర్ల సిఫార్సు బదిలీలను నిలిపేసేలా తెరవెనుక చక్రం తిప్పారు. దీంతో ప్రస్తుతం వీటికి బ్రేక్‌ పడింది. గత ఆగస్టు నుంచి విడతలవారీగా విడుదలైన సిఫార్సు బదిలీలను పూర్తిస్థాయిలో రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు.

తెరవెనుక ఇద్దరు యూనియన్‌ నాయకులు

సిఫార్సు లేఖలతో జరిగిన బదిలీలపై ఉపాధ్యాయ సంఘాల నాయకుల్లో చాలామంది గుర్రుగానే ఉన్నారు. విజయవాడలో ఉండే ఒక యూనియన్‌ నాయకుడు.. బొత్స పేషీ నుంచి తెచ్చిన సిఫార్సు లేఖలతో 26 మంది టీచర్లను బదిలీ చేయించినట్లు చెప్పుకొంటు న్నారు. భీమవరంలో ఉద్యోగం చేస్తూ ఆన్‌డ్యూటీపై బొత్స కార్యాలయం వద్దే నిత్యం ఉండే మరో యూనియన్‌ నాయకుడు 90కి పైగా బదిలీ ఉత్తర్వులు తెచ్చినట్టు సమాచారం. వీరిద్దరూ ఒక్కో టీచర్‌ నుంచి రూ.5 లక్షల వరకూ వసూలు చేశారనే ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. అలాగే, డీఈవో కార్యాలయంలో పనిచేసే ఒక కీలక అధికారి తన మను షుల ద్వారా ఒక్కొక్కరి నుంచి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేయడం గమనార్హం. ఈ అంశంపై సదరు అధికారిని ఎవరైనా ప్రశ్నిస్తే ప్రభుత్వ బదిలీలకు సంబంధించి ఇంకా ఎలాంటి జాబితాలు రాలేదని తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నాడు. డీఈవో కార్యాలయంలోని అధికారులకు నగదు ముట్టజెప్పని ఆరుగురు టీచర్లకు సంబంధించిన సిఫార్సు బదిలీ లేఖలను మాత్రం పక్కనపెట్టారని సమాచారం. కోరుకున్న ప్రాంతంలో ఖాళీలు లేవని చెప్పిన వీరు.. డబ్బు ముట్టజెప్పిన వారికి మాత్రం పోస్టింగ్‌ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.

మచిలీపట్నం, విజయవాడలోనే అధికం

మాజీమంత్రి బొత్స పేషీ నుంచి జారీ అయిన టీచర్ల బదిలీలకు సంబంధించిన సిఫార్సు లేఖలు అధికంగా అవనిగడ్డ, విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాలకే ఇచ్చారు. విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాల్లో పోస్టింగ్‌ తెచ్చుకుంటే హెచ్‌ఆర్‌ఏ అధికంగా వస్తుంది. పోస్టింగ్‌ కోసం చెల్లించిన నగదు నాలుగేళ్లలో హెచ్‌ఆర్‌ఏ రూపంలో వచ్చేస్తుందని చాలామంది ఆశించారు. పిల్లల చదువులతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రులకు దగ్గరగా ఉండాలని, ఇతరత్రా అవసరాలకు నగరాల్లోనే ఉండాల్సిన పరిస్థితి అని చెప్పి, డబ్బు ముట్టజెప్పి ఈ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అవనిగడ్డవైపు కూడా చాలామంది ఆసక్తి చూపించారు. ఇక్కడి డీఎస్సీ కోచింగ్‌ సెంటర్లలో అనధికారికంగా పనిచేసేందుకే టీచర్లు ఇలా చేశారనే వాదన వినిపిస్తోంది.

Updated Date - Jun 09 , 2024 | 01:29 AM