Share News

తొలిరోజే కోలాహలం

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:54 AM

నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం అలా నోటిఫికేషన్‌ విడుదలైందో.. ఇలా నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు పోటీ పడ్డారు. మొదటి రోజు, పైగా మంచిరోజు కావడంతో అభ్యర్థులు అట్టహాసంగా తరలివచ్చారు. దీంతో నగరంలోని కలెక్టరేట్‌ వద్ద సందడి వాతావరణం కనిపించింది. ఇక ఎన్టీఆర్‌ జిల్లావ్యాప్తంగా 13 నామినేషన్లు, కృష్ణా జిల్లావ్యాప్తంగా 5 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీ అభ్యర్థులు భారీ ర్యాలీలతో అట్టహాసంగా తరలిరావడంతో అంతటా ఎన్నికల సందడి కనిపించింది. - విజయవాడ/మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి

తొలిరోజే కోలాహలం

నోటిఫికేషన్‌ విడుదల.. వెనువెంటనే నామినేషన్లు

ఎన్టీఆర్‌ జిల్లాలో 13, కృష్ణాజిల్లాలో 5 నామినేషన్లు

నగరంలోని కలెక్టరేట్‌ సమీపంలో ర్యాలీల సందడి

కృష్ణాజిల్లాలో ఆరు ప్రాంతాల్లో నామినేషన్ల స్వీకరణ

మంచి ముహూర్తం చూసుకుంటున్న అభ్యర్థులు

ఈ నెల 25వ తేదీ వరకు గడువు

నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం అలా నోటిఫికేషన్‌ విడుదలైందో.. ఇలా నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు పోటీ పడ్డారు. మొదటి రోజు, పైగా మంచిరోజు కావడంతో అభ్యర్థులు అట్టహాసంగా తరలివచ్చారు. దీంతో నగరంలోని కలెక్టరేట్‌ వద్ద సందడి వాతావరణం కనిపించింది. ఇక ఎన్టీఆర్‌ జిల్లావ్యాప్తంగా 13 నామినేషన్లు, కృష్ణా జిల్లావ్యాప్తంగా 5 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీ అభ్యర్థులు భారీ ర్యాలీలతో అట్టహాసంగా తరలిరావడంతో అంతటా ఎన్నికల సందడి కనిపించింది.

- విజయవాడ/మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి

ఎన్టీఆర్‌ జిల్లాలో..

ఎన్టీఆర్‌ జిల్లావ్యాప్తంగా పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 13 నామినేషన్లు పడ్డాయి. వీటిలో రెండు విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోవి కాగా, 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందినవి. మొత్తంగా టీడీపీ తరఫున రెండు నామినేషన్లు, వైసీపీ తరపున ఒక నామినేషన్‌ దాఖలయ్యాయి. నామినేషన్ల ఘట్టం ప్రారంభానికి ముందు జిల్లా ఎన్నికల అధికారి దిల్లీరావు పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల పబ్లిక్‌ నోటీసును విడుదల చేశారు. ఎక్కడికక్కడ రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికల నోటీసును విడుదల చేశారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. సాయంత్రం 3 గంటల వరకు స్వీకరించారు. అభ్యర్థులు నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసే అవకాశాన్ని కల్పించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు భారీ సంఖ్యలో ర్యాలీగా రాగా, రిటర్నింగ్‌ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోనే నిలుపుదల చేయించారు. అభ్యర్థి సహా కేవలం ఐదుగురినే కార్యాలయంలోకి అనుమతించారు.

విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో..

విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో గురువారం రెండు నామినేషన్లు పడ్డాయి. సోషలిస్టు యూనిటీ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (కమ్యూనిస్టు) తరఫున విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన గుజ్జుల లలిత (61) నామినేషన్‌ వేశారు. అలాగే, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లాకు చెందిన తరిగొప్పుల మండలం, సోలిపురం గ్రామానికి చెందిన చేవిటి అర్జున్‌ (33) విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో..

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి యలమంచిలి సుజనా చౌదరి నామినేషన్‌ దాఖలు చేశారు. జగ్గయ్యపేటలో టీడీపీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్‌ (59) తరఫున మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ శ్రీరాం సుబ్బారావు, అలాగే, శ్రీరాం రాజగోపాల్‌ సతీమణి శ్రీదేవి (50) కూడా నామినేషన్‌ వేశారు. ఎస్సీ రిజర్వుడ్‌ తిరువూరులో వైసీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు నామినేషన్‌ వేశారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి దుగ్గిశెట్టి సుభాషిణి (43), మైలవరం నియోజకవర్గం నుంచి వల్లభనేని నాగ పవన్‌కుమార్‌ (34), నందిగామ నియోజకవర్గం నుంచి కొత్తపల్లి సుందరరావు (45) స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌ వేశారు. నందిగామ నియోజకవర్గంలో తెలుగు రాజ్యాధికార సమితి తరఫున బి.శ్రీనివాసరావు (37) నామినేషన్‌ సమర్పించారు. బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ నుంచి కె.ప్రభుదాస్‌ (54) నామినేషన్‌ వేశారు. నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నవీన్‌ అంబేడ్కర్‌ చింతమల నామినేషన్‌ వేశారు. తెలుగు రాజ్యాధికార పార్టీ తరఫున జి.రాంబాబు (30) నామినేషన్‌ దాఖలు చేశారు.

కృష్ణాజిల్లాలో..

కృష్ణాజిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డీకే బాలాజీ గురువారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అనంతరం జిల్లాలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. గుడివాడ, ఉయ్యూరు ఆర్డీవో కార్యాలయాల్లో గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అవనిగడ్డ, పామర్రు, పెడన, గన్నవరం తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లను స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు. ఈనెల 25వ తేదీ వరకు జిల్లాలోని రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 26న పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29వ తేదీ వరకు గడువు ఇచ్చారు. మచిలీపట్నం పార్లమెంట్‌ అభ్యర్థుల నామినేషన్లను కలెక్టర్‌ చాంబరులో కలెక్టర్‌ స్వీకరిస్తారు. కాగా, మంచి ముహూర్తం చూసుకుని అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. శుక్ర, శని, సోమవారం నాడు అధికసంఖ్యలో నామినేషన్లు పడే అవకాశాలున్నాయి.

ఐదు నామినేషన్లు

నామినేషన్ల స్వీకరణ తొలిరోజు జిల్లాలోని గన్నవరం, పామర్రు, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు నామినే షన్లు దాఖలయ్యాయి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, ఆయన భార్య యార్లగడ్డ జ్ఞానేశ్వరి నామినేషన్‌ దాఖలు చేశారు. పామర్రు నియోజకవర్గం (ఎస్సీ) టీడీపీ అభ్యర్థి వర్ల కుమార్‌రాజా నామినేషన్‌ వేశారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పిరమిడ్‌ పార్టీ అభ్యర్థిగా వక్కలగడ్డ పావని నామినేషన్‌ వేశారు. మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి గురువారం ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదని కలెక్టర్‌ డీకే బాలాజీ తెలిపారు. గుడివాడ, పెడన, అవనిగడ్డ, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా గురువారం నామినేషన్లేమీ పడలేదని పేర్కొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:54 AM