Share News

నేడు పామర్రుకు సీఎం జగన్‌

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:30 AM

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన పామర్రుకు రానున్నారు. విజయవాడ రోడ్డులోని దేవస్థాన భూముల్లో ఏర్పాటు చేసిన జగనన్న విద్యాదీవెన పంపీణీ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. సభ వేదిక ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్‌, ట్రాఫిక్‌ మళ్లింపు తదితర ఏర్పాట్లను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

నేడు పామర్రుకు సీఎం జగన్‌
ఏర్పాట్లపై సూచనలు చేస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

పామర్రు, ఫిబ్రవరి 29 : ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన పామర్రుకు రానున్నారు. విజయవాడ రోడ్డులోని దేవస్థాన భూముల్లో ఏర్పాటు చేసిన జగనన్న విద్యాదీవెన పంపీణీ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. సభ వేదిక ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్‌, ట్రాఫిక్‌ మళ్లింపు తదితర ఏర్పాట్లను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. బందరు రోడ్డు మార్కెట్‌ యార్డు సమీపంలో హెలిప్యాడ్‌, సభాప్రాంగణ ఏర్పాట్లను ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌తో కలిసి కృష్ణా కలెక్టర్‌ రాజాబాబు, ఎస్పీ నయీమ్‌ అస్మి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ తదితరులు పరిశీలించారు. సభకు డ్వాక్రా మహిళలు, విద్యార్థులను తరలించాలని యానిమేటర్లను ఆదేశించినట్టు సమాచారం. సభకు రాకుంటే సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తామంటున్నారని డ్వాక్రా సంఘ సభ్యులు బహాటంగానే చెబుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా వాహనాల దారి మళ్లింపునకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇద్దరు అడిషనల్‌ ఎస్పీలు 11 మంది డీఎస్పీలు, 28మంది సీఐలు, 65మంది ఎస్‌ఐలతోపాటు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నట్టు చెప్పారు.

ముఖ్యమంత్రి సభా ప్రాంగణంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని చర్యలు పాటించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ రాజాబాబు ఆదేశించారు. సభావేదిక వద్ద ఫంక్షన్‌ హాల్లో అధికారులతో ఆయన మాట్లాడారు. సమావేశంలో జేసీ గీతాంజలి శర్మ జెడ్పీ సీఈవో జ్యోతిబసు, డీఆర్డీఏ పీడీ ప్రసాద్‌, హాసింగ్‌ పీడీ జీవీ సూర్యనారాయణ, ఉయ్యూరు, గుడివాడ, బందరు ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి పర్యటన ఇలా

ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్మోహనరెడ్డి హెలికాప్టర్‌లో బయలుదేరి 10.30కి పామర్రుకు చేరుకుంటారు. 10.50కి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. నేతల ప్రసంగాల అనంతరం విద్యాదీవెన లబ్ధిదారులతో సీఎం మాట్లాడనున్నారు. అనంతరం విద్యాదీవెన సాయం బటన్‌ నొక్కి విడుదల చేస్తారు. హెలికాప్టర్‌లో తిరిగి తాడేపల్లికి వెళతారు.

ట్రాఫిక్‌ మళ్లింపు

గుడివాడ వైపు నుంచి అవనిగడ్డ వెళ్లే వాహనాలను బైపాస్‌ రోడ్డు నుంచి వయానిడుమోలు మీదుగా, విజయవాడ వైపు నుంచి అవనిగడ్డ వెళ్లే వాహనాలను కరకట్టమీదుగా దారి మళ్లించారు. గ్రామంలోని అన్ని రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు.

Updated Date - Mar 01 , 2024 | 12:30 AM