Share News

రేపే నోటిఫికేషన్‌

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:55 AM

ఎన్నికల్లో కీలక ఘట్టమైన నోటిఫికేషన్‌ గురువారం వెలువడనుండటంతో అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటి నుంచి పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసుకునే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ఆ హడావిడిలో ఉన్నారు.

రేపే నోటిఫికేషన్‌

19న కేశినేని చిన్ని నామినేషన్‌కు ఏర్పాట్లు

దుర్గగుడి నుంచి సబ్‌ కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ

చాలామంది వైసీపీ అభ్యర్థులూ ఆ రోజే..

22న కూడా అధికంగానే..

అక్రమ కేసులపై విపక్ష అభ్యర్థుల్లో ఆందోళన

(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : ఎన్నికల్లో కీలక ఘట్టమైన నోటిఫికేషన్‌ గురువారం వెలువడనుండటంతో అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటి నుంచి పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసుకునే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ఆ హడావిడిలో ఉన్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమికి చెందిన అభ్యర్థుల్లో అధికశాతం మంది ఈనెల 19న నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు. విజయవాడ పార్లమెంట్‌ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేశినేని చిన్ని ఆరోజే నామినేషన్‌ దాఖలు చేస్తారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న దర్గా నుంచి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఆయనతో పాటు ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాలకు చెందిన పలువురు వైసీపీ అభ్యర్థులు కూడా అదేరోజు నామినేషన్‌ దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక టీడీపీ అభ్యర్థుల్లో అధికశాతం మంది 22న నామినేషన్‌ దాఖలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

అనుమానాలు అనేకం..

ఈ నెల 25తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 29 సాయంత్రం వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. అదేరోజు సాయంత్రం అర్హులైన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. ఇప్పటికే అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష కూటమి తమతమ అభ్యర్థులను ప్రకటించాయి. వారంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు నామినేషన్ల ప్రక్రియపై టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అధికార వైసీపీ ఒత్తిళ్లకు లోనవుతున్న పలువురు అధికారులు నామినేషన్ల ప్రక్రియలో పక్షపాత ధోరణితో వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు ఇచ్చే సమాచారంతో రిటర్నింగ్‌ అధికారి సంతృప్తి చెందకపోతే తిరస్కరించే అవకాశం ఉంది. అందుకే ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ ఇప్పటికే నామినేషన్లపై కసరత్తు మొదలుపెట్టారు. ప్రతిపక్ష కూటమికి చెందిన అభ్యర్థులు నామినేషన్లలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకునేందుకు ఒక్కో అభ్యర్థి ఇప్పటికే ఇద్దరు న్యాయవాదులను నియమించుకుని ఒకటికి రెండుసార్లు పరిశీలన చేయించుకుంటున్నారు. విపక్ష పార్టీలకు చెందిన చాలామంది అభ్యర్థులపై అధికార వైసీపీ పలు కేసులు బనాయించింది. ఈ కేసుల వివరాలపై ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించి మరీ అభ్యర్థులు తమకు కావాల్సిన సమాచారం పొందారు. అయినప్పటికీ ఇంకా తమకు తెలియకుండా ఏమైనా కేసులు ఉన్నాయేమోనని వారు ఆందోళన పడుతున్నారు. వీటిని సాకుగా చూపి నామినేషన్‌ తిరస్కరించే అవకాశం లేకపోలేదన్నది వారి ఆందోళనకు కారణం.

Updated Date - Apr 17 , 2024 | 12:55 AM