Share News

‘నోటా’మాటలేదు

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:44 AM

కూటమి సునామీ దెబ్బకు నోటా మాట లేకుండాపోయింది. రెండు జిల్లాల మొత్తం ఓట్లలో ఒక్కశాతం కూడా నోటాకు పడకపోవడమే ఇందుకు నిదర్శనం. మొత్తంగా టీడీపీ కూటమికే పట్టం కట్టిన ఓటర్లు నోటావైపు కన్నెత్తి కూడా చూడలేదు.

‘నోటా’మాటలేదు

విజయవాడ పార్లమెంట్‌ పరిధిలో 0.67 శాతం

అసెంబ్లీ నియోజకవర్గాలకైతే 0.56 శాతమే

వంద ఓట్లు కూడా పొందలేని అభ్యర్థులు 45 మంది

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : టీడీపీ కూటమి గెలుపులో ‘నోటా’ చిన్నబోయింది. ఎన్టీఆర్‌ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నోటాకు మొత్తంగా 7,719 ఓట్లు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా 13,65,284 ఓట్లు పోలయ్యాయి. దీనిప్రకారం నోటాకు వచ్చింది 0.56 శాతమే. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,40,965 ఓట్లు పడగా, నోటాకు 1,598 ఓట్లు పడ్డాయి. ఇది మొత్తం ఓట్లలో 0.66 శాతమే. ఆ తర్వాత విజయవాడ సెంట్రల్‌ నియోజక వర్గంలో నోటాకు 1,236 ఓట్లు పడ్డాయి. ఇక్కడ మొత్తం 1,70,112 ఓట్లు పోలవగా, అందులో నోటాకు పడ్డవి 0.72 శాతమే. తిరువూరు నియోజకవర్గంలో నోటాకు 1,184 ఓట్లు పడ్డాయి. మొత్తం 1,81,669 ఓట్లు పోలవ్వగా, ఇందులో 0.65 శాతమే నోటాకు పడ్డాయి. తూర్పు నియోజకవర్గంలో మొత్తంగా 1,93,031 ఓట్లు పడగా, నోటాకు 1,049 ఓట్లు వచ్చాయి. మొత్తం ఓట్లలో ఇది 0.54 శాతమే. విజయవాడ పశ్చిమలో నోటాకు 951 ఓట్లు పడ్డాయి. మొత్తం 2,02,662 ఓట్లు పడగా, అందులో నోటాకు పడ్డవి 0.46 శాతం. నందిగామ నియోజక వర్గంలో నోటాకు 928 ఓట్లు పడ్డాయి. ఇక్కడ మొత్తం 1,79,914 ఓట్లు పోలవ్వగా, ఇందులో నోటాకు పడ్డవి 0.51 శాతం. జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో మొత్తం 1,84,611 ఓట్లు పోలవ్వగా, ఇందులో 773 ఓట్లు అంటే.. 0.40 శాతం నోటాకు పడ్డాయి.

విజయవాడ పార్లమెంట్‌ పరిధిలో ఇలా..

విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో మొత్తంగా 13,65,284 ఓట్లు పోలవ్వగా, నోటాకు 9,193 ఓట్లు పడ్డాయి. మొత్తం ఓట్లలో ఇది 0.67 శాతమే. విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే.. తిరువూరులో 1,371, విజయవాడ పశ్చిమలో 1,146, విజయవాడ సెంట్రల్‌లో 1,336, విజయవాడ తూర్పులో 1,261, మైలవరం నియోజకవర్గంలో 1,684, నందిగామ నియోజకవర్గంలో 1,029, జగ్గయ్యపేట నియోజకవవర్గంలో 1,211 ఓట్లు నోటాకు పడ్డాయి. పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించి పడిన 17,757 ఓట్లలో నోటా ఖాతాలోనివి 155.

అయ్యో.. వంద ఓట్లు కూడా రాలేదు..!

కూటమి సునామీ దెబ్బకు ఉమ్మడి కృష్ణాజిల్లాలో డిపాజిట్ల సంగతి దేవుడెరుగు బరిలో నిలిచిన అభ్యర్థులు వంద ఓట్లను కూడా సాధించలేకపోయారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని విజయవాడ పార్లమెంట్‌ పరిధిలో 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే.. తిరువూరులో 12 మంది, విజయవాడ పశ్చిమలో 15 మంది, విజయవాడ సెంట్రల్‌లో 20 మంది, విజయవాడ తూర్పులో 15 మంది, మైలవరంలో 12 మంది, నందిగామలో 9 మంది, జగ్గయ్యపేటలో 13 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరందరిలో 37 మంది అభ్యర్థులు కనీసం 100 ఓట్లు కూడా సాధించలేదు. కృష్ణాజిల్లాలో 8 మంది అభ్యర్థులు 100 ఓట్లు కూడా పొందలేకపోయారు.

Updated Date - Jun 07 , 2024 | 12:44 AM