సం‘సిద్ధం’గా లేరు!
ABN , Publish Date - Feb 04 , 2024 | 01:42 AM
దెందులూరులో వైసీపీ సిద్ధం సభకు రెడ్డిగూడెం మండలం నుంచి జనాన్ని తరలించేందుకు భారీగా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సులు పంపారు. అయితే సభకు వెళ్లేందుకు నాయకులు కాని, జనం కాని ఆసక్తి చూపలేదు. దీంతో వచ్చిన వాటిలో చాలా బస్సులు ఖాళీగానే వెనుతిరిగి వెళ్లాయి.
దెందులూరు సభకు అంతంతమాత్రంగా వెళ్లిన జనం
సభకు జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ, ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులు
సభకు వెళ్లేందుకు జనం పెద్దగా రాకపోవడంతో వెనుదిరిగి వెళ్లిన బస్సులు
ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికుల పాట్లు
రెడ్డిగూడెం, ఫిబ్రవరి 3: దెందులూరులో వైసీపీ సిద్ధం సభకు రెడ్డిగూడెం మండలం నుంచి జనాన్ని తరలించేందుకు భారీగా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సులు పంపారు. అయితే సభకు వెళ్లేందుకు నాయకులు కాని, జనం కాని ఆసక్తి చూపలేదు. దీంతో వచ్చిన వాటిలో చాలా బస్సులు ఖాళీగానే వెనుతిరిగి వెళ్లాయి. స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సిద్ధం సభకు తాను హాజరు కానని చెప్పడంతో పాటు జనసమీకరణ కూడా చేయనని చెప్పడంతో ఒక్క రోజులోనే మైలవరం ఇన్‌చార్జిని వైసీపీ మార్చి వేసింది. ఈక్రమంలో సభకు జనాన్ని నడిపించే నాయకులు మాకెందుకులే అని మిన్నకున్నారు. దీంతో బస్సులు ఖాళీగా వెనుతిరగాల్సి వచ్చింది. మొత్తం మీద వైసీపీలో తీవ్ర నైరాశ్యం నెలకొంది.
రూ.300, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి..
తోట్లవల్లూరు: తోట్లవల్లూరు మండలం నుంచి దెందులూరులో సిద్దం సభకు ఒక్కొక్కరికీ రూ 300, బిర్యాని ప్యాకెట్లను పం పిణీ చేసి, ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని వైసీపీ నేతలు తరలించారు.
వైసీపీ కార్యకర్తల్లా ఆర్టీసీ అధికారులు.. మోటమర్రి బాబాప్రసాద్ ఆగ్రహం
మచిలీపట్నం టౌన్: దెందులూరు సభకు ఆర్టీసీ బస్సులను పెద్ద సంఖ్యలో తరలించారని, దీంతో ప్రయాణికులు నానా ఇబ్బం దులు పడుతున్నారని ఆర్టీసీ అధికారులు వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆర్టీసీ బస్టాండ్ సెం టర్లో టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు చిన్నం సురేష్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు మోటమర్రి బాబాప్రసాద్, టీడీపీ నగర పాలక అధ్యక్షుడు ఎండీ ఇలియాస్ పాషా, పిప్పళ్ల కాంతారావు, అసీం బేగ్ తదితరులు ఆందోళన చేశారు. అధికారులకు వినతిపత్రమిచ్చారు.
బస్సులు లేక ప్రయాణికుల పాట్లు
అవనిగడ్డ రూరల్: దెందులూరు సభకు అవనిగడ్డ డిపో నుంచి ఆర్టీసీ బస్సులు భారీగా వెళ్లటంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి మండలాలకు చెందిన ప్రైవేట్ పాఠశాలల బస్సులను తీసుకున్నారు. బస్సులు లేకపోవడంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
ప్రైవేట్ పాఠశాలలకు సెలవిచ్చి..దెందులూరు సభకు బస్సులు
మోపిదేవి: మండలంలోని పలు ప్రైవేట్ పాఠశాలలకు జిల్లా విద్యాశా ఖాధికారులు సెలవు ప్రకటిం చారు. సిద్ధం సభకు ఆ పాఠశాలల బస్సుల్లో వైసీపీ కార్యకర్తలను తరలించారు. మోపిదేవి మండలంలోని ఆయా గ్రామాల్లో 8 బస్సులు ఏర్పాటు చేయగా, ఏడు బస్సుల్లో అంతంత మాత్రంగా కార్యకర్తలు, జనాన్ని ఎక్కించగా, ఒక ఆర్టీసీ బస్సులో ఎక్కే జనం లేక బస్సును వెనుతిరిగి పంపించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు జెండా ఊపి బస్సులను ప్రారంభించారు.