Share News

నామినేషన్ల జాతర

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:14 AM

నామినేషన్ల జాతర రెండోరోజు శుక్రవారం కూడా కొనసాగింది. రెండు జిల్లాల్లో భారీగానే నామినేషన్లు పడ్డాయి. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, ఇతర రాజకీయ పక్షాలతో పాటు స్వతంత్రులు, సోషలిస్టు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 18, కృష్ణాజిల్లాలో 8 దాఖలయ్యాయి. అభ్యర్థుల ర్యాలీలు, ప్రచారాలతో ఎన్నికల పండుగ వాతావరణం కనిపిస్తోంది.

నామినేషన్ల జాతర

రెండో రోజూ భారీగా నామినేషన్లు

ఎన్టీఆర్‌ జిల్లాలో 18, కృష్ణాజిల్లాలో 8

అట్టహాసంగా విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని నామినేషన్‌

ర్యాలీలు, ప్రచారాలతో పండుగ వాతావరణం

సీపీఎం, సీపీఐ నాయకులు సహా ఇతర పార్టీల వారు కూడా..

నామినేషన్ల జాతర రెండోరోజు శుక్రవారం కూడా కొనసాగింది. రెండు జిల్లాల్లో భారీగానే నామినేషన్లు పడ్డాయి. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, ఇతర రాజకీయ పక్షాలతో పాటు స్వతంత్రులు, సోషలిస్టు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 18, కృష్ణాజిల్లాలో 8 దాఖలయ్యాయి. అభ్యర్థుల ర్యాలీలు, ప్రచారాలతో ఎన్నికల పండుగ వాతావరణం కనిపిస్తోంది.

- విజయవాడ/మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి

ఎన్టీఆర్‌ జిల్లాలో..

ఎన్టీఆర్‌ జిల్లావ్యాప్తంగా శుక్రవారం 18 నామినేషన్లు దాఖలయ్యాయి. విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గానికి 3 నామినేషన్లు పడగా, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 15 దాఖలయ్యాయి. టీడీపీ తరఫున అత్యధికంగా 6 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఒక ఎంపీ కాగా, 5 ఎమ్మెల్యే నామినేషన్లు. వైసీపీకి ఒకే ఒక్క అసెంబ్లీ నామినేషన్‌ దాఖలైంది. సీపీఎం తరఫున ఒకటి, సీపీఐ తరఫున ఒకటి దాఖలయ్యాయి.

విజయవాడ పార్లమెంట్‌కు 3

విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌ (చిన్ని) నామినేషన్‌ దాఖలు చేశారు. కేశినేని చిన్ని ఒక సెట్‌ నామినేషన్‌ వేశారు. రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌పీఐ)-అథవాలేకు చెందిన పేరం శివనాగేశ్వరరావు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. తెలుగు రాజ్యాధికార సమితి పార్టీకి చెందిన బి.శ్రీనివాసరావు రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు.

అసెంబ్లీ నియోజకవర్గాలకు 15

విజయవాడ పశ్చిమ నుంచి వైసీపీకి చెందిన షేక్‌ ఆసిఫ్‌ నామినేషన్‌ వేశారు. సీపీఐ తరఫున జి.కోటేశ్వరరావు, ఎంసీపీఐ (యూ) తరఫున ఖదీర్‌ భాషా షేక్‌, స్వతంత్ర అభ్యర్థిగా రత్నావత్‌ కిషోర్‌ నామినేషన్‌ వేశారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గానికి నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ తరఫున బొండా ఉమామహేశ్వరరావు నామినేషన్‌ వేశారు. సీపీఎం (మార్క్సిస్టు) తరఫున చిగురుపాటి బాబూరావు, స్వతంత్ర అభ్యర్థిగా బొప్పన గాంధీ, జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా కె.శివశంకర్‌ నామినేషన్లు వేశారు. విజయవాడ తూర్పులో మొత్తం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్‌ తరఫున ఆయన సతీమణి అనూరాధ, గద్దె కుమారుడు క్రాంతికుమార్‌ కూడా నామినేషన్లు వేశారు. మైలవరం అసెంబ్లీకి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులుగా వేములపల్లి పృథ్వీ, వేల్పూరి కనకదుర్గాదేవి ఒక్కో సెట్‌ నామినేషన్‌ వేశారు. జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ అభ్యర్థిగా శ్రీరామ్‌ రాజగోపాల్‌ (తాతయ్య), ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కర్నాటి అప్పారావు నామినేషన్‌ వేశారు. నందిగామ, తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్లు పడలేదు.

కృష్ణాజిల్లాలో..

కృష్ణాజిల్లాలో శుక్రవారం 8 నామినేషన్లు దాఖలయ్యాయి. పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్‌ నామినేషన్‌ వేశారు. అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బోడె హేమచౌదరి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, టీడీపీ జిల్లా అఽధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు, టీడీపీ నాయకుడు వంగవీటి రాధా, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ తదితరులు హాజరయ్యారు. అవనిగడ ్డనియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా నాదెళ్ల గిరిధర్‌ నామినేషన్‌ వేశారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వడ్డాది గోవిందరావు, బహుజన సమాజ్‌పార్టీ అభ్యర్థిగా గుడివాడ బోసుబాబు నామినేషన్‌ వేశారు. మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గం పిరమిడ్‌ పార్టీ అభ్యర్థిగా బడుగు క్రాంతికుమార్‌ నామినేషన్‌ వేశారు. గన్నవరం, పెడన, మచిలీపట్నం, పామర్రు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నామినేషన్లేమీ పడలేదు.

Updated Date - Apr 20 , 2024 | 01:14 AM