Share News

తప్పు ఎవరిదీ..!

ABN , Publish Date - Apr 30 , 2024 | 01:11 AM

గుడివాడ ఆర్‌డీవో, ఆర్వో పి.పద్మావతి తీరు వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే కొడాలి నాని సమర్పించిన నామినేషన్‌ పత్రంలో తప్పులున్నా.. టీడీపీ నాయకులు ఆధారాలతో సహా వాటిని నిరూపించినా ఆమె వ్యవహరించిన తీరు అధికార పార్టీకి అనుకూలంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు అందడంతో స్పందించిన ఆర్వో నామమాత్రంగా నోటీసులు పంపడం, కొడాలి నాని తప్పు ఒప్పుకొన్నా చర్యలు తీసుకోకపోవడం వెనుక రహస్యమేమిటనే ఆరోపణలు వస్తున్నాయి.

తప్పు ఎవరిదీ..!

ఆది నుంచి వివాదాస్పదంగా గుడివాడ ఆర్‌డీవో

ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్‌ ఆమోదంలోనూ అంతే

ప్రభుత్వ వసతి వినియోగించుకోలేదని పేర్కొన్న నాని

ఉపయోగించుకున్నారని ఆధారాలతో సహా చూపిన టీడీపీ

టీడీపీ నాయకులపై చిందులు తొక్కిన ఆర్‌డీవో

ఈసీ జోక్యంతో నామమాత్రంగా నోటీసు జారీ

నాని తప్పును ఒప్పుకొన్నా చర్యలకు మీనమేషాలు

మొదటి నుంచి వైసీపీకి అనుకూలమేనంటున్న ప్రతిపక్షాలు

గుడివాడ ఆర్‌డీవో, ఆర్వో పి.పద్మావతి తీరు వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే కొడాలి నాని సమర్పించిన నామినేషన్‌ పత్రంలో తప్పులున్నా.. టీడీపీ నాయకులు ఆధారాలతో సహా వాటిని నిరూపించినా ఆమె వ్యవహరించిన తీరు అధికార పార్టీకి అనుకూలంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు అందడంతో స్పందించిన ఆర్వో నామమాత్రంగా నోటీసులు పంపడం, కొడాలి నాని తప్పు ఒప్పుకొన్నా చర్యలు తీసుకోకపోవడం వెనుక రహస్యమేమిటనే ఆరోపణలు వస్తున్నాయి.

గుడివాడ : కొడాలి నాని మంత్రిగా పనిచేసిన సమయంలో పౌరసరఫరాల శాఖ పాత మున్సిపల్‌ కార్యాలయాన్ని తన క్యాంపు కార్యాలయంగా అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. 2022, నవంబరు 30 నాటికి పౌరసరఫరాల శాఖ ఒప్పందం ముగిసింది. ఆ తరువాత కొడాలి నాని సదరు భవనాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా మార్చుకునేందుకు గుడివాడ మున్సిపాలిటీకి అర్జీ పెట్టుకున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చే వరకు ఆ భవనం నాని ఆధీనంలోనే ఉంది. 2024, మార్చి 17వ తేదీన సదరు భవనాన్ని నాని నుంచి స్వాధీనం చేసుకున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యం ఆర్‌డీవో, రిటర్నింగ్‌ అధికారి పి.పద్మావతికి పత్రాలను సమర్పించారు.

నామినేషన్‌ పత్రాల్లో తప్పుడు సమాచారం

కొడాలి నాని తన నామినేషన్‌ పత్రాల్లో ఎటువంటి ప్రభుత్వ వసతిని వినియోగించుకోలేదని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ, అది తప్పుడు సమాచారమని రిటర్నింగ్‌ అధికారికి ముందే తెలుసు. స్ర్కూటినీ సమయంలో టీడీపీ నాయకుల నుంచి ఫిర్యాదు వచ్చినా స్వీకరించకుండా, నామినేషన్‌కు ఆమోదం తెలపాలని ముందే ఆర్వో సిద్ధమయ్యారు. అభ్యంతరాలున్నాయా అని కూడా అడగకుండా ఆమోదం తెలిపారు. అభ్యంతరం తెలిపేందుకు లేచి నిలబడిన టీడీపీ నాయకులను పట్టించుకోలేదు. అంతేకాదు.. వారిపై తీవ్రస్థాయిలో చిందులు తొక్కారు.

నామమాత్రంగా నోటీసులిచ్చి..

ఈ విషయంపై టీడీపీ నాయకులు జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో స్పందించి నామమాత్రంగా నోటీసులు జారీ చేశారు. నాని పాత మున్సిపల్‌ కార్యాలయాన్ని వినియోగించుకున్న పత్రాలను టీడీపీ నాయకులు చూపించారు. పూర్తిస్థాయిలో అద్దెను కూడా చెల్లించలేదని ఆరోపించారు. నోటీసుకు స్పందించిన కొడాలి నాని తాను పాత మున్సిపల్‌ కార్యాలయాన్ని వినియోగించుకున్నట్లు ఒప్పుకొంటూ అద్దె బకాయిలను చెల్లించినట్లు ఎన్‌వోసీని ఆర్వోకు సమర్పించారు. దీంతో అసలు బండారం బయటపడింది. నామినేషన్‌ పత్రాల్లో ప్రభుత్వ వసతిని వినియోగించుకోలేదని నాని ఒప్పుకొన్నారు. మళ్లీ నోటీసుకు జవాబుగా ప్రభుత్వ భవనాన్ని కార్యాలయంగా వినియోగించుకున్నానని చెబుతూ పత్రాలను సమర్పించారు. తాను తప్పు చేసినట్లు నాని ఒప్పుకొన్నా ఆర్వో చర్యలు తీసుకోకపోవడంపై అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.

చర్యలేవీ..?

వైసీపీ అభ్యర్థి కొడాలి నాని నామినేషన్‌ను ఏకపక్షంగా ఆమోదం తెలపడం అనుమానాలకు తావిస్తోంది. చేతిలో అధికారం ఉందనే ఆర్వో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కావాలనే ఎన్నికల కమిషన్‌ నిబంధనలు తుంగలో తొక్కారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఎన్నికల కమిషన్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Updated Date - Apr 30 , 2024 | 01:11 AM