Share News

నామినేషన్ల ప్రక్రియ షురూ..

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:59 AM

సాధారణ ఎన్నికలు-2024లో భాగంగా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఫారం-1 ఎన్నికల పబ్లిక్‌ నోటీ్‌సను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.దిల్లీరావు గురువారం ఉదయం విడుదల చేశారు.

నామినేషన్ల ప్రక్రియ షురూ..
ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ దిల్లీరావుకు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేస్తున్న గుజ్జుల లలిత

కృష్ణలంక, ఏప్రిల్‌ 18 : సాధారణ ఎన్నికలు-2024లో భాగంగా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఫారం-1 ఎన్నికల పబ్లిక్‌ నోటీ్‌సను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.దిల్లీరావు గురువారం ఉదయం విడుదల చేశారు. అనంతరం దిల్లీరావు మాట్లాడుతూ, ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్లు స్వీకరించడం జరుగుతోందన్నారు. నామినేషన్‌ దాఖలుకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గురువారం ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 25 వరకు కొనసాగుతుందని, ప్రభుత్వ సెలవు దినాల్లో మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించనున్నట్టు వెల్లడించారు. అభ్యర్థులు గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని, రెండు నియోజకవర్గాల నుంచి నామినేషన్లను ఫైల్‌ చేయవచ్చన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో మూడు వాహనాలు మాత్రమే అనుమతించబడతాయని, అభ్యర్థి సహా ఐదుగురిని కార్యాలయంలోకి అనుమతించడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు.

తొలిరోజు 11 నామినేషన్లు

విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో రెండు..

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు సంబంధించి తొలిరోజు ఎన్టీఆర్‌ జిల్లాలో గురువారం ఇద్దరు వ్యక్తులు రెండేసి సెట్ల చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. కలెక్టర్‌, విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.దిల్లీరావుకు నామినేషన్లు సమర్పించారు. సోషలిస్టు యూనిటీ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (కమ్యూనిస్టు) పార్టీ నుంచి విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన గుజ్జుల లలిత (61) నామినేషన్‌ దాఖలు చేశారు. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా తెలంగాణా రాష్ట్రం, జనగామ జిల్లా తరిగొప్పుల మండలం, సోలిపురం గ్రామానికి చెందిన అర్జున్‌ చేవేటి (33) నామినేషన్‌ దాఖలు చేశారు.

గన్నవరం నియోజకవర్గంలో మూడు..

గన్నవరం : గన్నవరంలో తొలిరోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్‌ పత్రాన్ని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి గీతాంజలి శర్మకు అందజేశారు. గురువారం ఉదయం 11.21 గంటల సమయంలో రెండుసెట్లను దాఖలు చేశారు. డమ్మీ అభ్యర్థిగా యార్లగడ్డ సతీమణి జ్ఞానేశ్వరీ ఒక సెట్‌ను వేశారు.

జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఐదు..

జగ్గయ్యపేట : జగ్గయ్యపేటలో తొలిరోజు గురువారం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి.

తొలుత టీడీపీ అభ్యర్ధి శ్రీరాం రాజగోపాల్‌ (తాతయ్య) తరపున మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ శ్రీరాం సుబ్బారావు, నియోజక వర్గ టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు నెట్టెం శివరాం, టీడీపీ మాజీ ఫ్లోర్‌లీడర్‌ యలమంచిలి రాఘవ, మాజీ వైస్‌చైర్మన్‌ నూకల కుమార్‌ రాజాలు అందజేశారు.

శ్రీరాం తాతయ్య సతీమణి శ్రీదేవి, మాజీ చైర్మన్‌ శ్రీరాం సుబ్బారావు సతీమణి సూర్యకాంతంలతో కలిసి నామినేషన్‌ దాఖలు చేశారు. బీఎస్పీ తరపున కొదమల ప్రభుదాస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీఆర్‌ పుష్పరాజ్‌ తదితరులతో కలిసి నామినేషన్‌ దాఖలు చేశారు.

నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున చింతమల నవీన్‌ అంబేడ్కర్‌, తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ తరపున గుడిసె రాంబాబులు నామినేషన్లు వేసినట్టు ఎన్నికల రిటర్నింగ్‌ అఽధికారి జె.వెంకటేశ్వర్లు తెలిపారు.

పామర్రు నియోజకవర్గంలో ఒకటి..

పామర్రు : నామినేషన్ల తొలిరోజున గురువారం ఉదయం పామర్రు నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థిగా వర్ల కుమార్‌రాజా తొలి నామినేషన్‌ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిణి బూసి శ్రీదేవికి అందజేశారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ బాధ్యుడు తాడిశెట్టినరేష్‌, టీడీపీ జిల్లా రైతుప్రధాన కార్యదర్శి వల్లూరిపల్లి గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:59 AM