Share News

తొలి జాబితాలో తొమ్మిది మంది

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:17 AM

కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులకు సంబంఽధించిన విడుదల చేసిన జాబితాలో ఉమ్మడి జిల్లాలో తొమ్మిది మందికి స్థానం దక్కింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది.

తొలి జాబితాలో తొమ్మిది మంది

అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌

ఉమ్మడి జిల్లాలో ఐదు స్థానాలు పెండింగ్‌

వామపక్షాలకు రెండు స్థానాలు

మిగిలిన మూడింటిపై సందిగ్ధం

(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులకు సంబంఽధించిన విడుదల చేసిన జాబితాలో ఉమ్మడి జిల్లాలో తొమ్మిది మందికి స్థానం దక్కింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. తిరువూరు నుంచి లాం తాంతియ కుమారిని అధిష్టానం పోటీలోకి దింపింది. గుడివాడ స్థానాన్ని వడ్డాది గోవిందరావుకు కేటాయించారు. పెడనకు శొంఠి నాగరాజు, మచిలీపట్నానికి అబ్దుల్‌ మతీన్‌, అవనిగడ్డకు అందే శ్రీరామమూర్తి, పామర్రుకు మాజీ ఎమ్మెల్యే డీవై దాసు పేర్లను కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ ప్రకటించింది. పెనమలూరు నుంచి ఎలిసల సుబ్రహ్మణ్యం, మైలవరం నుంచి ఎన్టీఆర్‌ జిల్లా కమిటీ అధ్యక్షుడు బొర్రా కిరణ్‌ను బరిలోకి దింపింది. నందిగామ నుంచి మందా వజ్రయ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అసెంబ్లీ అభ్యర్థులతోపాటు లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసినా అందులో విజయవాడ, మచిలీపట్నం స్థానాలకు చోటు దక్కలేదు. మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా వాటిలో తొమ్మిది స్థానాలకు లైన్‌ క్లియర్‌ అయింది.

ఆ రెండు వామపక్షాలకే

కాంగ్రెస్‌ పార్టీ ఇంకా మరో ఐదు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిగా అడుగులు వేస్తోంది. ఇందులో సీపీఐ, సీపీఎం ఉన్నాయి. పొత్తులో భాగంగా వామపక్షాలకు చెరో నియోజకవర్గాన్ని కేటాయించడానికి దాదాపు అంగీకారం కుదిరింది. విజయవాడలో మొత్తం మూడు నియోజకవర్గాలు ఉండగా రెండింటిని వామపక్షాలకు కేటాయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయవాడ సెంట్రల్‌ నుంచి సీపీఎం, పశ్చిమ నియోజకవర్గం నుంచి సీపీఐ పోటీ చేసే సూచనలు ఉన్నాయి. ఇప్పటి సెంట్రల్‌ నుంచి సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు, పశ్చిమ నియోజకవర్గం నుంచి సీపీఐ నగర కమిటీ కార్యదర్శి జి.కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ రెండు స్థానాలు పోగా ఇంకా మూడు స్థానాలను కాంగ్రెస్‌ ఖరారు చేయాల్సి ఉంది. ఎన్టీఆర్‌ జిల్లాలో విజయవాడ తూర్పు, జగ్గయ్యపేట స్థానాలకు, కృష్ణా జిల్లాలో గన్నవరం స్థానానికి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. గన్నవరం నుంచి కాంగ్రెస్‌ జిల్లా కమిటీ అధ్యక్షుడు వింతా సంజీవరెడ్డి పోటీ చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈయనతోపాటు మరికొంతమంది ఉన్నప్పటికీ డీసీసీ అధ్యక్షుడి హోదాలో సంజీవరెడ్డికి అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు. ఇప్పుడు ఈ స్థానంపై కాంగ్రెస్‌, వామపక్షాల మధ్య పేచీ మొదలైంది. విజయవాడ సెంట్రల్‌తోపాటు గన్నవరం స్థానాన్ని తమకు కేటాయించాలని సీపీఎం కోరుతోంది. ఈ విషయంలో తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఈ మొత్తం వ్యవహారం కొలిక్కి వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.

Updated Date - Apr 03 , 2024 | 01:17 AM