Share News

రైల్వే కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం.. ముంపులో వరి నారుమళ్లు

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:18 AM

రైల్వే కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడి పరిధిలోని పంట భూముల్లో సుమారు 500 ఎకరాల్లో వరి నారుమళ్లు నీటి మునిగాయి.

రైల్వే కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం.. ముంపులో వరి నారుమళ్లు
నీట మునిగిన వరి నారుమళ్లను చూపుతున్న రైతు

గొల్లపూడి, జూలై 27: రైల్వే కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడి పరిధిలోని పంట భూముల్లో సుమారు 500 ఎకరాల్లో వరి నారుమళ్లు నీటి మునిగాయి. రైల్వే లైన్‌ అభివృద్ధి పనుల్లో భాగంగా కొత్త ట్రాక్‌ ఏర్పాటు చేసే కాంట్రాక్టర్‌ అశ్రద్ధ చూపడంతో తమ పొలాల్లో నీరువచ్చి చేరిందంటున్నారు. దాంతో నారుమళ్లు నీట మునిగి ఎందుకు పనికి రాకుండా కుళ్లిపోతున్నాయని అన్నదాతలు వాపోతున్నారు. తిరిగి నారుమళ్లు పోసే సమయం కూడా లేదంటున్నారు. దీంతో ఈఏడాది నారు కొనుక్కోవాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందుతున్నారు. కొత్తగా పట్టాలు వేసే చోట మురుగు పోయేందుకు ఉన్న కాల్వకు మట్టి అడ్డుగా వేయడం వల్ల గ్రామంలో నుంచి వెళ్లిపేయే మురుగు మొత్తం పంట పొలాలను ముంచేస్తుందని, గ్రావెల్‌ స్టాక్‌ పెట్టడం వల్ల కూడా మురుగు మొత్తం పొలాల్లోకి చేరుతుందని ఆందోళన చెందుతున్నారు. సమస్యను రైల్వే అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మురుగు బారి నుంచి తమ నారుమళ్లను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు.

Updated Date - Jul 28 , 2024 | 12:18 AM