వైద్యసేవల్లో నిర్లక్ష్యం
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:52 AM
గుడివాడ చుట్టుపక్కల ప్రజలకు వైద్య సేవ లందించేందుకు ఏరియా ప్రభుత్వాస్పత్రిని 100 పడకల ఆస్ప త్రిగా మార్చారు. ఆస్పత్రి అభివృద్ధి చెంది నూతన భవనాల్లోకి మారింది గానీ వైద్యసేవల్లో వైద్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

రిస్క్ ప్రసవాలు విజయవాడకు రిఫర్..ఆస్పత్రిలో చేసేందుకు సిద్ధంగా లేని వైద్యులు
సాయంత్రం ఆరు దాటితే వైద్యసేవలు బంద్..గుడివాడ ఏరియా ప్రభుత్వాస్పత్రి తీరిది
గుడివాడ: గుడివాడ చుట్టుపక్కల ప్రజలకు వైద్య సేవ లందించేందుకు ఏరియా ప్రభుత్వాస్పత్రిని 100 పడకల ఆస్ప త్రిగా మార్చారు. ఆస్పత్రి అభివృద్ధి చెంది నూతన భవనాల్లోకి మారింది గానీ వైద్యసేవల్లో వైద్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సాయంత్రం 6గంటలు దాటితే వైద్యసేవలు బంద్ చేస్తారు. గర్భిణులకు రిస్క్ లేని ప్రసవాలకే వైద్యాన్ని అంది స్తారు. ప్రసవ సమయంలో ఏ చిన్న రిస్క్ వచ్చినా దానిని చాలెంజ్‌గా తీసుకుని వైద్య సేవలందించడానికి ఇక్కడి వైద్యులు సిద్ధంగా లేరు. గర్భిణిని విజయవాడ ప్రభుత్వా స్పత్రికి తీసుకెళ్లాలని కుటుంబసభ్యులపై సిబ్బంది ఒత్తిడి తెస్తారు. తల్లీబిడ్డల్లో ఒకరికి ప్రమాదమని భయపెడతారు. చివరికి విజయవాడ వెళ్లేటట్టు చేస్తారు. ఇటీవల గుడివాడ మండలం మల్లాయిపాలెం గ్రామానికి చెందిన గర్భిణీకి ఇదే పరిస్థితి ఎదురైంది. ఏడాదిలో 20 రిస్క్ ప్రసవాలు ఆస్పత్రికి వస్తే అన్నింటినీ విజయవాడకు రిఫర్ చేశారు. శుక్రవారం కూడా రిస్క్ ప్రసవం ఆస్పత్రికి వస్తే విజయవాడకు రిఫర్ చేసినట్టు సమాచారం.
అమర్యాదకర ప్రవర్తన
వైద్యం కోసం వచ్చిన రోగుల పట్ల కొందరు వైద్యులు, నర్సులు అమర్యాదగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. వారం క్రితం గుడ్లవల్లేరు మండలానికి చెందిన గర్భిణీకి ఇక్కడ సిజేరియన్ అయ్యింది. 10రోజుల్లోనే బాలింత మృతి చెందింది. దీంతో పసికందు అనాథగా మిగిలిపోయింది. బాలింత మృతికి కారణాలు చెప్పేవారు లేరు.