ప్రమాదం వెనుక నిర్లక్ష్యం
ABN , Publish Date - Jul 08 , 2024 | 01:20 AM
ఒకసారి కాదు. ఇప్పటి వరకు రెండుసార్లు అలా్ట్రటెక్ సిమెంట్ కంపెనీలో కిలెన్ బాయిలర్ వద్ద ప్రమాదాలు జరిగాయి. దీన్ని తక్షణమే మార్పు చేయాలని ఇంజనీర్లు తేల్చారు. అయినా కర్మాగార యాజమాన్యం మాత్రం స్పందించలేదు. కార్మికుల భద్రత విషయంలో నిలువునా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. ఆ నిర్లక్ష్యంగా ఇప్పుడు ఒక కార్మికుడి ప్రాణాలు తీసింది. మరికొంత మందిని చావుబతుకుల మధ్య పడేసింది. ఇంకొంతమందిని గాయాలపాలు చేసింది.

కిలెన్ వద్ద వరుస ఘటనలు
బాయిలర్‌ను మార్పు చేయని కంపెనీ యాజమాన్యం
రోడ్డున పడిన కాంట్రాక్ట్ కార్మికుడి కుటుంబం
పరిహారం ప్రకటించని కంపెనీ
‘అలా్ట్రటెక్’ ముందు గ్రామస్తుల ఆందోళన
పరిపాలన భవనంపై దాడి
సీఎం చంద్రబాబు, మంత్రి వాసంశెట్టి ఆరా
క్షతగాత్రులకు ఎమ్మెల్యే, అధికారుల పరామర్శ
ఒకసారి కాదు. ఇప్పటి వరకు రెండుసార్లు అలా్ట్రటెక్ సిమెంట్ కంపెనీలో కిలెన్ బాయిలర్ వద్ద ప్రమాదాలు జరిగాయి. దీన్ని తక్షణమే మార్పు చేయాలని ఇంజనీర్లు తేల్చారు. అయినా కర్మాగార యాజమాన్యం మాత్రం స్పందించలేదు. కార్మికుల భద్రత విషయంలో నిలువునా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. ఆ నిర్లక్ష్యంగా ఇప్పుడు ఒక కార్మికుడి ప్రాణాలు తీసింది. మరికొంత మందిని చావుబతుకుల మధ్య పడేసింది. ఇంకొంతమందిని గాయాలపాలు చేసింది.
(ఆంధ్రజ్యోతి - విజయవాడ/ జగ్గయ్యపేట రూరల్) : లైమ్‌స్టోన్ ఎర్రమట్టి మిక్సింగ్ చేసే బాయిలర్ (కిలెన్) 1200-1400 సెల్సియస్ హీట్‌లో ఉంటుంది. అది ఒక్కసారిగా పేలటంతో పౌడర్ రూపంలోని క్లింకర్ బయటకు వెదజల్లి పరిసరాల్లోని కార్మికులపై పడింది. దీంతో ప్రాణభయంతో కార్మికులు పరు గులు పెట్టారు. సమీపంలోని 15 మందిపై ఎక్కువ స్థాయిలో బూడిద పడటంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో బూదవాడ కు చెందిన ఎనిమిది మంది, మిగిలినవారు బీహార్, ఉత్తర ప్రదేశ్‌లకు చెందిన వారు ఉన్నారు. ప్రమాద సమ యంలో గాయ పడిన వారిని విజయవాడ తరలించారు. గాయపడిన 15 మందిలో 8మంది బూదవాడకు చెందినవారు. వారిలో ఆవుల వెంకటేశ్ మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాణావత్ స్వామి, గుగులోతు బాలాజీ, గుగులోతు గోప్యా నాయక్, బాణావత్ సైదా, వేముల సైదులు, దారావత్ వెంకటేశ్వరరావు, పరిటాల అర్జున్, ఆవుల వెంకటేశ్వరరావులు బూదవాడ వాస్తవ్యులు. వివేక్‌సింగ్, నగేంద్ర సుదాసింగ్, శుభం సోనీ, గుడ్డు కుమార్, అరవింద్ జైపాల్, దినేష్ కాస్యప, రవికుమార్ విశ్వకర్మ బిహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికులు. బాణావత్ స్వామిని కుటుంబ సభ్యులు జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగిలిన వారిని విజయవాడకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం స్వామిని విజయవాడ తరలించారు. గాయపడిన కార్మికులను గొల్లపూడిలోని ఆంధ్రా ఆసుపత్రి, తాడేపల్లిలో ఉన్న మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. వారిని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాంగోపాల్, కలెక్టర్ సృజన, పోలీసు కమిషనర్ పీహెచ్‌డీ రామకృష్ణ పరామర్శించారు.
కట్టలు తెంచుకున్న ఆగ్రహం
అలా్ట్రటెక్ సిమెంట్ కర్మాగారంలో కెలన్ బాయిలర్ పేలడంతో బూదవాడ గ్రామవాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రమాద ఘటన గురించి తెలియగానే చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా అక్కడికి పరుగులు తీశారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించిన తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా గ్రామస్థులు ఆగలేదు. కంపెనీ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. మధ్యాహ్నం నుంచి కంపెనీ వద్ద గ్రామస్థులు గుమిగూడారు. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై నినాదాలు చేశారు. బాయిలర్ వద్ద ఇంతకుముందు రెండు, మూడు సార్లు ప్రమాదాలు జరిగినా యాజమాన్యంలో చలనం లేదని ధ్వజమెత్తారు. దీనివల్ల రెక్కాడితే గానీ డొక్కాడని కార్మికులు కనుమరుగైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది కార్మికులు కంపెనీ ఆవరణలో ఉన్న పరిపాలనా భవనంపై రాళ్లు రువ్వడంతో కార్యాలయం లోపల ఉన్న కంప్యూటర్లు, ల్యాప్‌టా్‌పలు, టీవీలు ధ్వంసమయ్యాయి. గ్రామస్థులు ఆగ్రహంతో ఊగిపోతుండడంతో పోలీసులు వారితో చర్చలు జరిపి శాంతింపచేశారు.
రోడ్డున పడిన కుటుంబం
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు. పాపంపుణ్యం తెలియని ఇద్దరు పసిపాపలు. తానే జీవితం అనుకున్న భార్య. ఇదీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆవుల వెంకటేష్ (36) కుటుంబపరిస్థితి. బూదవాడ గ్రామానికి చెందిన వెంకటేష్ నాలుగైదేళ్ల క్రితం కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా చేరాడు. అతడి తండ్రి వీరయ్య పక్షవాతంతో బాధపడుతున్నాడు. తల్లి రమాదేవి వృద్ధురాలు. వీరు కాకుండా భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొత్తం కుటుంబభారాన్ని వెంకటేశ్ మోస్తున్నాడు. చాలీచాలని వేతనంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ్రామంలోనే సిమెంట్ కంపెనీ ఉండటంతో ఇక్కడే పనిచేసుకుంటూ కుటుంబాన్ని చూసుకోవచ్చన్న ఆలోచనలో అతడు ఉన్నాడు. కెలన్ బాయిలర్ వద్ద పేలుడు ఘటనలో ఆ మిశ్రమంపై పడటంతో వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికి అతడు ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. వృద్ధాప్యంలో తమకు దిక్కు ఎవరని తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం. కష్టానికి వెళ్లిన కట్టుకున్న భర్త ప్రాణాలు కోల్పోవడంతో ఆమె కన్నీరుమున్నీరవుతోంది.
చంద్రబాబు, మంత్రి ఆరా
అలా్ట్రటెక్ కంపెనీలో ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అధికారులతో మాట్లాడారు. ఘటన జరగడానికి గల కారణాలు క్షుణ్ణంగా తెలుసుకున్నారు. దీనిపై ఒక నివేదికను రూపొందించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
సైక్లోన్ ప్రీహీటర్ పేలటంతోనే ప్రమాదం
జగ్గయ్యపేట : సిమెంట్ కర్మాగారంలో ప్రీహీటర్‌లో సమస్యలతోనే పేలినట్టు కార్మికులు ఆరోపిస్తున్నారు. గతంలో సైక్లోన్ ప్రీహీటర్‌లో సమస్యలు రావటంతో కార్మికులు సంబంధిత విభాగానికి ఫిర్యాదు చేసినా స్పందించలేదు. కిలెన్‌లో వేసే ముడి పదార్థాల్లో ఉండే యాసిడ్లను తొలగించేం దుకు, సిమెంట్ నాణ్యతను పెంచేందుకు ప్రీహీటర్ సైక్లోన్‌లో ఉంచుతారు. ఇక్కడ 800 డిగ్రీల సెల్సి యస్‌పైగా ఉష్ణోగ్రత ఉంటుంది. సైక్లోన్ ప్రీహీటర్‌లో ముడిపదార్థాలు కలిసే సంద ర్భంలో ఈ పేలుడు సంభవించింది. భారీ వేడితో ఉండే సిమెంట్ కార్మికులకు అంటుకు పోవటంతో కార్మికులు శరీరాలు కాలిపోయాయి.