Share News

నందిగామలో మల్లగుల్లాలు!

ABN , Publish Date - May 15 , 2024 | 12:54 AM

నందిగామ నియోజకవర్గంలో గెలుపు తమదేనంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్నివర్గాల్లో మేజార్టీ ఓట్లు తమకే పడ్డాయని, సైలెంట్‌ ఓటింగ్‌ తమకే అనుకూలంగా ఉందని ఎవరికి వారే చెప్పుకుంటున్నారు. గ్రామ నాయకుల పోలింగ్‌ గణాంకాలు.. ముఖ్య నేతల కూడికలు, తీసివేతల్లో నిమగ్నమయ్యారు.

నందిగామలో మల్లగుల్లాలు!

(కంచికచర్ల) : నందిగామ నియోజకవర్గంలో గెలుపు తమదేనంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్నివర్గాల్లో మేజార్టీ ఓట్లు తమకే పడ్డాయని, సైలెంట్‌ ఓటింగ్‌ తమకే అనుకూలంగా ఉందని ఎవరికి వారే చెప్పుకుంటున్నారు. గ్రామ నాయకుల పోలింగ్‌ గణాంకాలు.. ముఖ్య నేతల కూడికలు, తీసివేతల్లో నిమగ్నమయ్యారు. నియోజకవర్గంలో 87.56 శాతం పోలింగ్‌ జరగ్గా.. మొత్తం 2,05,480 ఓట్లకుగాను 1,79,914 ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో 87.95 శాతం పోలింగ్‌ జరగ్గా, ఈసారి స్వల్పంగా 0.4 శాతం తగ్గింది. ఈ ఎన్నికల్లో అన్నివర్గాల ఓటర్లు ఉదయం ఆరు గంటలకే పోలింగ్‌ కేంద్రాలకు వెల్లువలా తరలివచ్చారు. పురుషులకు దీటుగా మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కంచికచర్ల సత్రంబడి, వీరులపాడు మండలం గూడెం మాధవరం, అనాసాగరం, నందిగామలో కొన్ని కేంద్రాల్లో రాత్రి పొద్దుపోయినప్పటికీ ఓటు వేశారు. తొలిసారిగా ఓటు హక్కు పొందిన యువత ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. మార్పు, అభివృద్ధి కోసం ఓటేసినట్టుగా యువ ఓటర్లు పేర్కొన్నారు.

ప్రధాన పార్టీల మధ్యే పోటీ..

నియోజకవర్గంలో తొమ్మిది మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ మధ్యే పోటీ నెలకొంది. టీడీపీ అభ్యర్ధిగా తంగిరాల సౌమ్య, వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు గెలుపుపై గట్టి ధీమాతో ఉన్నారు. కనిష్టంగా ఐదువేలకు తగ్గకుండా మెజార్టీ వస్తుందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు.

ఎవరి ధీమా వారిదే..

నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు మండలాల్లో అధిక్యత మెజారిటీ వస్తుందని, వీరులపాడు మండలంలో బ్యాలెన్స్‌ అవుతుందని టీడీపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. రైతులు, మహిళలు, వృద్ధులు, అన్ని వర్గాల ఓటర్లు సైకిల్‌ను ఆదరించారని చెబుతున్నారు. దీంతో టీడీపీ శిబిరంలో రెట్టింపు ఉత్సాహం నెలకొంది. ఇదిలా ఉంటే గెలుపు ఖాయమని, మరోసారి ఓటర్లు తమనే ఆదరించారని వైసీపీ నాయకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కనపడలేదని చెపుతున్నారు. వీరులపాడు మండలంలో మెజారిటీ వస్తుందని, కంచికచర్ల, చందరర్లపాడు మండలాల్లో బ్యాలెన్స్‌ అవుతుందని, నందిగామ మండలంలో కొద్దిగా మైనస్‌ వచ్చినప్పటికీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఫ విజయవాడ సెంట్రల్‌లో 7.23శాతం పెరిగిన ఓటింగ్‌

(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : పోలింగ్‌ పూర్తయింది.. అభ్యర్థులు లెక్కలే తేల్చే పనిలో పడ్డారు. పోలింగ్‌కు ముందు ఒకలా.. పోలింగ్‌ తర్వాత మరోలా అంచనాలు ఉంటాయి. మంగళవారం నియోజకవర్గాల్లో బూత్‌ల వారీగా జరిగిన పోలింగ్‌ శాతం వివరాలు వెల్లడికావడంతో అభ్యర్థులు ఆయా బూత్‌ ఏజెంట్లు, వారికి సారధ్యం వ్యవహించిన నేతలతో సమావేశమయ్యారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో అనూహ్యంగా పోలింగ్‌ శాతం పెరిగింది. ఇది ఎవరికి లాభిస్తుందో అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. సెంట్రల్‌లో 2019 ఎన్నికల్లో 65.73శాతం ఓట్లు పోలయ్యాయి. ఈసారి 72.96శాతం నమోదై 7.23శాతం పోలింగ్‌ పెరిగింది.

ఎవరి లెక్కలు వారివి..

సెంట్రల్‌ నియోజకవర్గంలో అభ్యర్థులు స్వల్ప ఓట్లతో గట్టెక్కడం ఆనవాయితీగా వస్తోంది. 2019లో వైసీపీ తరపున మల్లాది విష్ణువర్థన్‌, టీడీపీ తరపున బొండా ఉమామహేశ్వరరావు పోటీచేయగా ఉమాపై విష్ణు 25ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రస్తుతం వైసీపీ నుంచి మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నుంచి బొండా ఉమామహేశ్వరరావు పోటీ చేశారు. ఇండియా కూటమి అభ్యర్థిగా సీహెచ్‌ బాబూరావు (సీపీఎం) పోటీలో ఉన్నారు. ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ మధ్య ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అభ్యర్థుల గెలుపు విషయంలో ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ఓటింగ్‌ శాతం తమకే అనుకూలంగా ఉంటుందని నేతలు భావిస్తున్నారు. విజయవాడ సెంట్రల్‌ క్లిష్టతరమైన నియోజకవర్గం కావడంతో ఈసీ అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోను వెబ్‌క్యాస్టింగ్‌ ఏర్పాటు చేసింది. 2014లో 65.20శాతం నమోదు కాగా, 2019లో 65.73శాతం నమోదైంది. ఈసారి 72.96శాతం పోలింగ్‌ నమోదైంది. ప్రభుత్వంపై వ్యతిరేత కారణంగానే ఓటర్లు ఈస్థాయిలో పోటెత్తారని టీడీపీ విశ్వసిస్తోంది. నియోజకవర్గ ఓటర్లు తమ మనసులోని భావన ఎక్కడా బయట పడకుండా జాగ్రత్త పడ్డారు. ఓటరు నాడి మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.

Updated Date - May 15 , 2024 | 12:54 AM